Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ బాధితురాలు ఆత్మహత్య

హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ బాధితురాలు ఆత్మహత్య

- Advertisement -

పెండ్లికి నిరాకరించిందని గత నెలలో
వైరస్‌ రక్తం ఎక్కించిన యువకుడు
నవ తెలంగాణ-పోచారం

పెండ్లికి నిరాకరించిందనే కోపంతో యువకుడు తన హెచ్‌ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్‌ ద్వారా గత నెలలో యువతికి బలవంతంగా ఎక్కించడంతో మనస్తాపంతో బాధితురాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి కుటుంబ సభ్యులతో కలిసి అన్నోజిగూడ రాజీవ్‌ గృహకల్పలో ఉంటూ ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమె సమీప బంధువైన మనోహర్‌తో నిశ్చితార్థం చేశారు. అయితే వివాహానికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి ఎయిడ్స్‌ ఉన్నట్టు బయటపడటంతో యువతి తల్లిదండ్రులు పెండ్లిని రద్దు చేశారు. అయితే, తనను వివాహం చేసుకోవాలని ఆమెపై యువకుడు తరచూ ఒత్తిడి తెచ్చి బలవంతం చేసేవాడు. ఆమె నిరాకరిస్తుండటంతో కక్ష పెంచుకున్న యువకుడు తనను కాదన్నందుకు మరెవరినీ పెండ్లి చేసుకోవద్దని తన రక్తాన్ని ఇంజెక్షన్‌ ద్వారా తీసి పెట్టుకున్నాడు. గత మార్చి 11న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆ రక్తాన్ని బలవంతంగా ఎక్కించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. భయాందోళనకు గురైన బాధితురాలు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే తర్వాత నాలుగు రోజులకు ఆమెకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ రావడంతో మానసికంగా కుంగిపోయింది. ఆ మనోవేదనతోనే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -