నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలో రాజకీయ పరంగా అరుదైన సంఘటన చోటుచేసుకోబోతుంది. శివసేన(UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) ఒకే వేదికపై కలువనున్నాయి. ప్రైమరీ స్కూల్‌లో హిందీని తృతీయ భాషగా తప్పనీసరిగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. ఈక్రమంలో హిందీని బలవంతం రుద్దడంపై రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు, సాహిత్య వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వారి ఆందోళనతో ఫడ్నవీస్ ప్రభుత్వం వెనుకు తగ్గింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కార్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇవాళ వర్లీ వేదికగా శివసేన(UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కలిసి విజయోత్సవ సభతో పాటు ర్యాలీని చేపట్టనున్నారు. MNS ముఖ్యనేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ… ఈ ఐక్యత మహారాష్ట్ర రాజకీయాలలో ఓ కీలక మలుపు కాబోతుందని ఇది మరాఠీ ప్రజాశక్తిని చాటే అవకాశం అని తెలిపారు.
ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు హిందీని “తప్పనిసరిగా మూడో భాషగా చేసిన త్రిభాషా విధానాన్ని అమలు చేయడంపై ఏప్రిల్ 16న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. వివిధ సమూహాలు, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తరువాత ఈ పరిణామం జరిగింది. రాష్ట్రంలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు.