Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభారీ ప్రాజెక్టుల్లో 'హెచ్‌ఎండీఏ'

భారీ ప్రాజెక్టుల్లో ‘హెచ్‌ఎండీఏ’

- Advertisement -

నిధుల లక్ష్యం రూ. 4,999 కోట్లు
వివిధ మార్గాల్లో రూ. 3,278 కోట్ల సేకరణ
రూ.19,999 కోట్ల నిధుల సేకరణకు అర్హత


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలంప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తూ…వివిధ అభివృద్ధి పనులను చేపడుతోంది. తాజాగా భారీ ప్రాజెక్టులను చేపట్టడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు రూ. 4,999 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేసింది. అందుకోసం బాండ్ల రూపంలో రూ.3,278 కోట్లు సేకరించింది. అయితే రూ.19,999 కోట్లను సేకరించేందుకు హెచ్‌ఎండీఏకు పూర్తి హక్కులున్నాయి. వాటి సేకరణ కోసం వేట కొనసాగిస్తోంది. అభివృద్ధి రుసుం, భవనాల క్రమబద్ధీకరణ చేయడం, భూముల వేలం, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ) తదితర మార్గాల్లో ఆదాయ వనరులను సమీకరిస్తూ…ఆర్థిక స్థితిని కొనసాగించింది. తక్కువ అప్పులతో స్థిరమైన క్రెడిట్‌ రేటింగ్‌ను నిర్వహిస్తూ హెచ్‌ఎండీఏ నిరంతరం ఆదాయ మిగులును ఆర్జించింది. అనేక పెద్ద ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉండటంతో, ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులపై అథారిటీ దృష్టి సారించింది.


హెచ్‌ఎండిఏ బాండ్ల కొనుగోలుదారులకు 5 శాతం నుంచి రూ. 8 శాతం వడ్డీని అందిస్తోంది. హెచ్‌ఎండీిఏ ఆధ్వర్యంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. రాజీవ్‌ రహదారిపై శామీర్‌పేట్‌ సమీపంలో ప్యారడైజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు, జాతీయ రహదారి-44పై ప్యారడైజ్‌ నుంచి డైయిరీ ఫామ్‌ రోడ్‌ వరకు ఉన్న రెండు ఎలివేటెడ్‌ కారిడార్లతోపాటు, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సిగల్‌ అడ్డంకులు లేకుండా గచ్చిబౌలి వద్ద ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేస్తుంది. రెండు దశల ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,650 కోట్లకు పైగా ఉంది. ఇందులో ఫిల్మీనగర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న మొదటి దశ పనులు, ఐసీసీసీ నుంచి హకీంపేట్‌ కుంట వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి.

ఈ ప్రాజెక్టుల్లో గ్రేడ్‌ మరియు ఎలివేటెడ్‌ మార్గాలతో నాలుగు మరియు ఆరు లేన్ల విభాగాలు, మరియు ఆరు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు ఉంటాయి. ఇతర ప్రధాన ప్రాజెక్టుల్లో రేడియల్‌ రోడ్‌-2ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించే ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌ నిర్మాణం, బుద్వేల్‌ లేఅవుట్‌, ప్రస్తుత రాజేంద్రనగర్‌ ఇంటర్‌చేంజ్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ. 488 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల్లో ఇంటర్‌చేంజ్‌ కూడా ఉంటుందని, ఇది నగరానికి ముఖద్వారంగా నిలుస్తుందని, బుద్వేల్‌ మరియు రాబోయే మూసీ రివర్‌ఫ్రంట్‌కు నిరంతరాయ కనెక్టివిటీని అందిస్తుందని అధికారి తెలిపారు.

మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్‌, గండిపేట్‌, నర్సింగ్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హెచ్‌జీసీఎల్‌ (హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌), మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంజీఐటీ) వద్ద ఉన్న శంకర్‌పల్లి రోడ్డు నుంచి మణికొండ వరకు 3.57 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ రోడ్డును వెడల్పు చేయడంతోపాటు దాన్ని బలోపేతం చేయనుంది. రూ.110 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో పది మీటర్ల మీడియన్‌తో ఆరు లేన్ల క్యారేజ్‌వే, చిన్న వంతెనలు, జంక్షన్ల అభివృద్ధి మొదలయ్యాయి. అదేవిధంగా నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి మధ్య ఓఆర్‌ఆర్‌ ఎడమ క్యారేజ్‌వేను వెడల్పు చేసేందుకు హెచ్‌ఎండీఏ రూ. 26.5 కోట్లను కేటాయించింది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు హెచ్‌జీసీఎల్‌ ఈ మార్గాన్ని మూడు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించాలని యోచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -