Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించండి

స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించండి

- Advertisement -

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రెంక సురేందర్‌ అనే వ్యక్తి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 9న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదనీ, కేవలం 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు 9, 41, 42లపై మాత్రమే స్టే విధించిందని పిటిషనర్‌ న్యాయవాది నలిమెల వెంకటయ్య పేర్కొన్నారు. 9వ తేదీన వెలువరించిన హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలనీ, వివిధ జడ్జిమెంట్లను ప్రస్తావిస్తూ 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ముందుకు వెళ్లాలన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా నిలిపివేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులు పదవ తేదీన వెలువడినప్పటికీ, హడావుడిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 9వ తేదీనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యిందనీ, అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారనీ, నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైందనీ, ఆ తర్వాత ఎన్నికలను నిలిపివేయడం చెల్లదని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికే రెండు సంవత్సరాలు ఆలస్యమైందనీ, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల్లో పాలన మరుగున పడిందన్నారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు తమ సొంత లాభం కోసం వివిధ కారణాలతో ఎన్నికల ప్రక్రియను తీవ్ర జాప్యం చేస్తున్నాయని చెప్పారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఒకటి, రెండు రోజుల్లో విచారణ చేసే అవకాశముంది.

కేంద్ర రాష్ట్రాలకు నోటీసులు
వికారబాద్‌ జిల్లా దామగుండం ఈఎల్‌ఎఫ్‌ రాడార్‌ ప్రాజెక్ట్‌ సెంటర్‌కు కేంద్రానికి సుమారు 3 వేల ఎకరాల అటవీ భూమి కేటాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కౌంటర్లు దాఖలు చేయాలనీ, గతంలో సమర్పించిన వివరాలకు అదనపు వివరాలివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బయో డైవర్సిటీ యాక్ట్‌ కమిటీ పని చేస్తోందో, లేదో చెప్పాలని కోరింది. ఫారెస్ట్‌ ల్యాండ్‌ కేటాయింపు నేపథ్యంలో అదనపు అటవీ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. దామగుండం ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ వేసిన పిటిషన్‌పై విచారణను నవంబర్‌ 13కి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ బెంచ్‌ ఆదేశించింది. 2020 నాటి పిటిషన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రం కౌంటర్‌ వేయలేదనీ, కేంద్రం వేసినప్పటికీ అందులో వివరాలు పూర్తిగా లేవని అమికస్‌క్యూరీ చెప్పారు. దీంతో డివిజన్‌ బెంచ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి నోటీసులు ఇచ్చింది.

గ్రూప్‌-1పై స్టే పొడిగించిన హైకోర్టు
గ్రూప్‌-1 పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌ అమలును నిలిపివేస్తూ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన స్టే ఆర్డర్‌ను బుధవారం పొడిగించింది. ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో విచారణను నవంబర్‌ 18కి వాయిదా వేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఆన్సర్‌ షీట్లను మోడరేషన్‌ విధానంలో పున్ణమూల్యాంకనం చేశాకే నియామకాలు చేయాలని సింగిల్‌ జడ్జి తీర్పు చెప్పారు. అలా చేయకపోతే తిరిగి మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్‌సీని ఆదేశించింది. ఈ తీర్పును రద్దు చేయా లంటూ టీజీపీఎస్సీ, అర్హత పొందిన అభ్యర్థులు వేరువేరుగా వేసిన అప్పీళ్లను బుధవారం చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ ఆధ్వర్యం లోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. మెయిన్‌ కేసులోని పిటిషనర్లు రాతపూర్వక వాదనలు దాఖలు చేయక పోవడంతో విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

పిటిషన్‌ డిస్మిస్‌
యాదాద్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌లో రక్షించిన ఇద్దరు బాధిత మహిళలను విడిపించాలని జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాధితురాలి స్నేహితురాలినని పిటిషనర్‌ చెబుతున్నా.. ఆమె హౌదాపై స్పష్టత లేదని తెలిపింది. యూసుఫ్‌గూడలోని స్టేట్‌ హౌమ్‌లో బాధితులను విడుదల చేయాలని యాదగిరిగుట్టకు చెందిన అంజలి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయగా, దీనిని జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం కొట్టివేసింది. బాధితుల స్నేహితులు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయరాదని చెప్పింది.

జంతుహింస నివారణ చర్యలు తీసుకోవాలి
సదర్‌ పండుగకు అనుమతి ఇచ్చే ముందుకు చట్ట ప్రకారం జంతు హింస నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశించింది. జంతు హింస నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్లను ఆదేశించారు. సదర్‌ పండుగ పేరుతో జంతు హింస జరుగుతోందంటూ వినతిపత్రం ఇచ్చినా డీజీపీ చర్యలు తీసుకోలేదనంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన గౌతం వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ బుధవారం విచారించారు. జంతు హింస నివారణా చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, సదర్‌ అనుమతి మంజూరు చేసేముందు పిటిషనర్‌ వినతి పత్రంలోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. విచారణ 27కు వాయిదా వేశారు.

నారాయణ్‌పేట-కొడంగల్‌ ప్రాజెక్టుపై పిటిషన్‌ డిస్మిస్‌
నారాయణపేట-కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కాంట్రాక్ట్‌ను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ మాజీ సభ్యులు బక్క జడ్సన్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ను నెంబర్‌ కేటాయింపు దశలోనే డిస్మిస్‌ చేసింది. కాంగ్రెస్‌లో ఉండగా పిటిషన్‌ వేయకుండా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక పిటిషన్‌ వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేయమని చెప్పింది. పిటిషనర్‌కు పిటిషన్‌ వేసే అర్హత లేదని చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. కాంగ్రెస్‌ ఎన్నికల బాండ్‌లు సమర్పించడంతో సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కాంట్రాక్ట్‌ల విలువను పెంచేశారని పిటిషనర్‌ వాదన. కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించి నెంబర్‌ ఇవ్వకుండానే కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -