మున్సిపాలిటీ ఎన్నికలలో 100 శాతం పోలింగ్ లక్ష్యం..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుటకు గాను ఈనెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ రోజున స్థానిక సెలవు గా ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్,మోత్కూర్ మున్సిపాలిటీ లలో పోలింగ్ జరిగే రోజు ఈ నెల 11వ తేదీన ప్రభుత్వ, సంస్థల ఉద్యోగులకు, సాధారణ సెలవు, ఎన్నికల ప్రాంతంలో ఉన్న షాపులు సంస్థలు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రయివేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు విద్యాసంస్థల భవనాలకు ఈనెల 10వ తేదీన (మంగళవారం) పోలింగ్ కు ముందు రోజు, 11వ తేదీన (బుధవారం) పోలింగ్ రోజు, 13వ తేదీ (శుక్రవారం ) ఓట్ల లెక్కింపు తేదీల్లో సెలవును ప్రకటించినట్లు పేర్కొన్నారు. అందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లు తప్పకుండా తమ విలువైన ఓటును పోలింగ్ రోజున వినియెగించుకోవాలని కలెక్టర్ కోరారు.



