బాధితులందరికీ న్యాయం చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ -ఖమ్మం
పక్షం రోజులపాటు ఐక్యంగా, ధైర్యంగా పోరాడిన ఫలితంగానే వెలుగుమట్ల పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగుమట్ల ప్రజలు, వారికి మద్దతుగా నిలిచిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు చేసిన పోరాటాలు, ఆందోళనలు ఫలితంగానే ప్రభుత్వం తలొగ్గి, కూల్చిన చోట మళ్లీ స్థలాలు, ఇండ్లు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. హక్కులు సాధించిన భూదాన్ బాధితులకు అభినందనలు, వారికి అండగా నిలిచిన వామపక్ష, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. అత్యంత దుర్మార్గానికి ఒడిగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకొని దిగి రావటం హర్షనీయమన్నారు.
ప్రజల పోరాటానికి తలొగ్గి ఇండ్లు మంజూరు చేయటమే కాకుండా, చిత్తశుద్ధితో నిర్మించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అవి పూర్తి అయ్యేవరకు ప్రజలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని తెలిపారు. మిగిలిపోయిన బాధితులకు, అర్హులైన వారికి కూడా స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని, వారికి న్యాయం జరిగేలా సీపీఐ(ఎం) పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. భూదాన్ భూమిలో మిగిలిన మరో 30 ఎకరాల భూమి ఏమైందో, ఎక్కడున్నదో, బయటికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. 15 రోజులుగా సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు బాధితులకు అండగా నిలిచారని, వారికి వీలైన పద్ధతుల్లో సహాయం చేయడమే కాక, వారందరికీ ధైర్యం చెప్పి ఐక్యంగా నిలిపిన విషయాన్ని గుర్తు చేశారు.



