– ట్రంప్ వంద రోజుల పాలనలో అప్రతిష్ట మూటకట్టుకున్న అమెరికా
– కొంపముంచుతున్న విధానాలు… నోటిదురుసు… యుద్ధోన్మాదం
– కార్పొరేట్లకు అండదండలు
– వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ కాలంలో ప్రపంచ దేశాలలో అమెరికా పేరు ప్రతిష్టలు బాగా దిగజారి పోయాయి. అయితే దేశాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ట్రంప్ మహాశయుడు చెప్పుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలను ప్రతిపక్ష డెమోక్రాట్లు, తటస్థులే కాదు…సొంత రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకిస్తుండడం గమనార్హం.
వాషింగ్టన్ : ట్రంప్ తన వంద రోజుల పాలనలో పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నించారు. నిస్పాక్షికంగా వ్యవహరించాల్సిన న్యాయ శాఖను ఓ ఆయుధంగా వాడుకున్నారు. జనవరి 6వ తేదీన తిరుగుబాటుదారులు చెలరేగి హింసకు తెగబడితే వారిని క్షమించి వదిలేశారు. తనకు సంక్రమించిన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించుకుంటూ ప్రతినిధి సభను బేఖాతరు చేశారు. కార్యనిర్వాహక అధికారాలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకున్న ఇన్‌స్పెక్టర్ జనరల్స్‌పై వేటు వేశారు. వలసవాదులతో పాటు పౌరులను సైతం ఎలాంటి ప్రక్రియలు పాటించకుండా దేశం నుంచి బహిష్కరించారు.
పెరుగుతున్న నిరసనల హోరు
కార్పొరేట్ బిలియనీర్లు గతంలో బైడెన్‌కు నిధులు సమకూర్చారు. ఇప్పుడు అదే విధంగా ట్రంప్ జేబులు కూడా నింపుతున్నారు. ట్రంప్ అయినా, బైడెన్ అయినా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే వారే. ట్రంప్ తొలిసారి దేశాధ్యక్షుడు అయినప్పుడు కూడా అమెరికాలో రాజకీయ అశాంతి చెలరేగింది. ఆయన విధానాలు, వాచాలత ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. కాకుంటే కొంచెం హెచ్చు స్థాయిలో నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. 2016కు ముందున్న కాలంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.
2017లో చార్లోట్స్‌విల్లేలో జరిగిన ‘యునైట్ ది రైట్’ ర్యాలీని గుర్తు చేసుకోండి. ఆ ఏడాది జనవరిలో జరిగిన మహిళా మార్చ్ అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ప్రదర్శనగా నిలిచి ఒకే రోజు లక్షలాది మందిని ఆకర్షించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో చోటుచేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాల కారణంగా 2020 మే నుంచి నిరసనలు గరిష్ట స్థాయికి చేరాయి. అమెరికాలో పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలు తీశారు. వీటిలో 1.4 కోట్ల నుంచి 2.5 కోట్ల మంది భాగస్వాములయ్యారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ప్రదర్శనలు జరిగాయి. దీంతో యావత్ ప్రపంచం అమెరికానే చూస్తూ ఉండిపోయింది.
బైడెన్ పదవీకాలంలో నిరసనలు అంతగా జరిగి ఉండకపోవచ్చు. కానీ పోలీస్ హత్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. రాజకీయ అశాంతి, ప్రతిఘటన అనేవి 2016కు ముందున్న స్థాయికి చేరలేదు కానీ గాజాలో ఇజ్రాయిల్ ఆక్రమణలకు అమెరికా మద్దతు తెలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.
ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిపాలన మరింత కఠినంగా సాగుతోంది. గాజాలో నరమేధం సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు మద్దతు కొనసాగుతూనే ఉంది. 2017 ఫిబ్రవరిలో జరిగిన నిరసనలతో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో రెట్టింపు సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. ఏదేమైనా ట్రంప్ ఎజెండాకు వ్యతిరేకంగా అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలు సజీవంగానే ఉంటున్నాయి. పైగా అవి నానాటికీ ఉధృతమవుతున్నాయి. ట్రంప్ తన వంద రోజుల పాలనలో సాధించిన విజయాలు ఏవైనా ఉంటే అవన్నీ ఈ నిరసన హోరులో కొట్టుకుపోయాయి.
బెదిరింపులు…దాడులు
న్యాయస్థానాలలో తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను వాదిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థల న్యాయవాదులను ట్రంప్ బెదిరించారు. యూదు వ్యతిరేకతపై పోరాటం ముసుగులో విశ్వవిద్యాలయాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించే ప్రయత్నం చేశారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థను అతలాకుతలం చేసేలా పలు దేశాలపై సుంకాల దాడి చేశారు. కెనడా, పనామా, గ్రీన్‌ల్యాండ్‌పై దాడి చేస్తానంటూ పదే పదే హెచ్చరికలు చేశారు. ఫెడరల్ ప్రభుత్వాన్ని బిలియనీర్ల ఇష్టాఇష్టాలకు, లాభాలకు వదిలేశారు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ఆయుధ పోటీకి ట్రంప్ ఆజ్యం పోశారు. ఫలితంగా అస్థిరత, ఘర్షణలు పెరిగిపోయాయి. ట్రంప్ తన వంద రోజుల పాలనలో కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడి చేశారు. జాతి, లింగ పరమైన మైనారిటీలు కష్టపడి సాధించుకున్న హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు.
తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ట్రంప్ పన్ను కోతలను ఆమోదించారు. వాటినే బైడెన్ కొనసాగించారు. కార్పొరేట్ సంస్థలకు అందిస్తున్న సబ్సిడీలు కూడా కొనసాగుతున్నాయి. ట్రంప్‌తో పాటు బైడెన్ కూడా ప్రపంచంలో ఆయుధ అమ్మకాలు పెరగడానికి కారణమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రారంభించిన రక్షణాత్మక వాణిజ్యాన్ని బైడెన్ విస్తరించారు. ఇప్పుడు అది మరింతగా విస్తరించింది. ట్రంప్ తన వంద రోజుల పాలనలో 17 లక్షల మందిని స్వదేశాలకు తిప్పి పంపారు. ట్రంప్ తొలి ప్రభుత్వ హయాంలో 12 లక్షల మంది దేశ బహిష్కరణకు గురయ్యారు. యుద్ధ సమయంలో తనకు లభించే అపరిమిత అధికారాలను ఉపయోగించుకొని ఆ సంఖ్యను మరింత పెంచాలని ట్రంప్ యోచిస్తున్నారు. చట్టాన్ని ఎంత మాత్రం పట్టించుకోకుండా లక్షలాది మందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. యుద్ధోన్మాది ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వడం, ఇంధన రంగంలో డ్రిల్లింగ్‌కు అనుకూలంగా వ్యవహరించ డంతో పాటు దానికి ప్రాధాన్యత కల్పించడం, శిలాజ ఇంధన ఉత్పత్తిని చేపట్టడం వంటి చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
గందరగోళంగా సర్కారు పనితీరు
అమెరికా ప్రభుత్వ ఆంతరంగిక పనితీరు ఇప్పుడున్నంత గందరగోళంగా మునుపెన్నడూ లేదు. సొంత సమాజం, ప్రజలపై దాని వైఖరి దారుణంగా ఉంది. ప్రపంచ దేశాల విషయంలో దాని ఉద్దేశాలు సైతం గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఫ్రాంక్లిన్ డొలానో రూజ్‌వెల్ట్ తొలి ప్రభుత్వ పాలన దాదాపుగా ఇలాగే ఉండేది. ట్రంప్ ప్రస్తుతం కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. విదేశీ లేదా స్వదేశీ శత్రువులు, పోటీదారుల నుంచి కార్పొరేషన్లను కాపాడేందుకు ట్రంప్ తన అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. అందుకోసం యుద్ధ ప్రమాదాన్ని పెంచుతున్నారు. ఇక్కడ సమస్య ట్రంప్ మాత్రమే కాదు. ట్రంప్ మాత్రమే సమస్య అయితే ఆయనను పదవి నుంచి తొలగించవచ్చు లేదా పదవీ విరమణ చేయించవచ్చు. దాంతో సమస్య పరిష్కారమవుతుంది. ఇది డెమొక్రటిక్ పార్టీ ఇస్తున్న సందేశం. ఈ నేపథ్యంలో ట్రంప్-1, బైడెన్, ట్రంప్-2 ప్రభుత్వాల విధానాలను పరిశీలించాల్సిన అవసరమున్నదని డెమొక్రాట్ల అభిప్రాయం.
పరువు పోతోంది..!
- Advertisement -
RELATED ARTICLES