Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధి వంతెన ఎక్కని ఆశలు

అభివృద్ధి వంతెన ఎక్కని ఆశలు

- Advertisement -

ఆ మత సామరస్య కేంద్రంలో నిత్యం నరకం!
‘గేటు’ దాటాలంటే గుండెల నిండా భయం
‘వంతెన’ కోసం కన్నీళ్లతో నిరీక్షణ
ఇదీ దర్గా కాజీపేట జాగీర్‌ 48వ డివిజన్‌ దుస్థితి


నవతెలంగాణ- కాజీపేట
”మా ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. దేశంలోనే ప్రముఖమైన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కానీ ఈ చరిత్ర, ఈ ఘనత మా సమస్యల ముందు చిన్నబోయింది. అభివృద్ధి మాకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. రోజూ నరకం చూస్తున్నాం. గేటు దాటాలంటే గుండెల నిండా భయం. వంతెన కోసం కన్నీళ్లతో మెరపెట్టుకున్నాం. అయినా కనికరం చూపని నిర్లక్షం” – ఇది హనుమకొండ జిల్లా 48వ డివిజన్‌లోని దర్గా కాజీపేట జాగీర్‌ ప్రజల ఆవేదన.

”మా బంధువు ఒకరికి గుండె నొప్పి రావడంతో అర్జెంట్‌గా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి గేటు పడింది. ఆ గేటు దాటేసరికే ఆలస్యమై, అతను ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. మేము రోజూ మృత్యువు అంచున నిలబడి రైలు గేటు తెరవాలని దేవుడిని వేడుకుంటున్నాం.” ఇదీ గాంధీనగర్‌కు చెందిన ఓ స్థానికుడు కన్నీటి వ్యథ. ”మా చిన్న పిల్లలను ఒంటరిగా బయటికి పంపాలంటే గుండె దడ. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రోజూ భయంతో బతుకుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.” అంటూ స్థానికుల కంటతడి.

దర్గా కాజీపేట జాగీర్‌ 48వ డివిజన్‌.. ఒకప్పుడు ఈ ప్రాంతం విద్యకు కాణాచి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల పిల్లలు ఇక్కడి పాఠశాలల్లో చదివేవారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడే ఇండ్లు కొనుక్కొని, కిరాయికి ఉండి చదివించేవారు. ప్రసిద్ధమైన దర్గా, చర్చి, దేవాలయాలు.. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవించే ప్రాంతం ఇది. ఈ డివిజన్‌ ప్రజల దైనందిన జీవితాన్ని శాసిస్తున్న అతిపెద్ద సమస్య.. దర్గా రైల్వే గేటు. ఈ మార్గంలో రోజుకు 150కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

రైలు గేటు పడిందంటే, ఒక్కోసారి గంటకు పైగా అక్కడే నిలబడాలి. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లే రోగులు, పరీక్ష సమయానికి చేరుకోవాల్సిన విద్యార్థులు, పనులకు వెళ్లే కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయం. ఈ పరిస్థితుల్లో రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారంగా దర్గా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణం మొద లైంది. కానీ, అది అసంపూర్తిగా నిలిచి పోయింది. మరోవైపు, ఫాతిమానగర్‌ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కాక, ఇరుకైన పాత బ్రిడ్జిపై ట్రాఫిక్‌తో కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నాయి. ‘వంతెనలు కడితే మా కష్టాలు తీరుతాయని ఆశ పడితే, ఆ వంతెనల నిర్మాణమే మాకు సమస్యగా మారింది’ అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు, అండర్‌ బ్రిడ్జి కల కూడా కలగానే మిగిలింది.

సమస్యలతో సతమతం
”వర్షం పడిందంటే చాలు.. పిల్లలను స్కూళ్లకు పంపాలంటే భయం. మత్తడిపై కల్వర్టు నిర్మించమని ఎన్నిసార్లు మొర పెట్టు కున్నా పట్టించుకునేవారు లేరు,” అని ఓ తల్లి వాపోయింది. వర్షాకాలం వస్తే దంతం చెరువు మత్తడి ఉగ్రరూపం దాలుస్తుంది. మత్తడి ఉధృతికి దర్గా నుంచి చుట్టుపక్కల గ్రామాలైన బట్టుపల్లి, కడిపికొండలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. పిల్లల చదువులకు, ప్రజల పనులకు ఆటంకం కలుగుతోంది. అంతేకాదు, రోడ్లు, డ్రయినేజీల సమస్యలూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తు న్నాయి. పైపులైన్ల కోసం తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో రోడ్లు నరకప్రాయంగా మారాయి.

ముళ్ళ చెట్లు పెరిగి, కనీస సదుపాయాలు లేని శ్మశాన వాటికల దుస్థితి చూసి, చివరి ప్రయాణంలో కూడా ప్రశాంతత లేదా అని స్థానికులు విలపిస్తున్నారు. అంతకంటే ఘోరం వీధి కుక్కల బెడద.. దర్గా నుంచి ఫాతిమానగర్‌ వెళ్లే దారి, అఫ్జల్‌ నగర్‌, గాంధీనగర్‌ ప్రాంతాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరి స్తున్నాయి. ఈ కుక్కల దాడిలో చాలామంది గాయపడ్డారు.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీలు ఇస్తున్నారు. దర్గా ఆర్‌ఓబీ త్వరలో పూర్తవుతుందని, కొత్త రోడ్డు అభివద్ధి పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. కానీ, ఆ హామీలు ఎప్పటికి కార్యరూపం దాలుస్తాయో నని 48వ డివిజన్‌ ప్రజలు ఆశగా, ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.

ప్రజల ఇబ్బందులు పరిష్కరించండి
స్థానిక ప్రజలు దర్గా రైల్వే గేటుతో ఇబ్బందులకు గురవు తున్నారు. దీనికి ప్రత్యామ్నా యంగా నిర్మిస్తున్న దర్గా ఆర్‌ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి. దర్గా అండర్‌ బ్రిడ్జి నిర్మాణంపై ప్రజా ప్రతినిధులు, అధికారుల వాస్తవ అభిప్రాయాలు, నిర్ణయాలు అధికారికంగా ప్రకటించి ప్రజల్లో అపోహలను తొలగిం చాలి. డివిజన్‌లోని అంతర్గత సీసీ రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టాలి. ఎన్‌ఐటీ దర్గా 150 ఫీట్ల కొత్త రోడ్డును లైట్స్‌తో ఫోర్‌ లైన్స్‌తో అభివృద్ధి చేయాలి. దంతం చెరువు మత్తడిపై కల్వర్టు నిర్మించాలి. దర్గా నుంచి పవన్‌ నగర్‌ పీహెచ్‌సీకి వెళ్లే కనెక్టివిటీ రోడ్డుకు ఉన్న అడ్డంకులు పరిష్కరించాలి. శ్మశాన వాటిక లను ఆధునికరించాలి. ఫాతిమా నగర్‌ ఆర్‌ఓబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-ఎం చుక్కయ్య, సీపీఐ(ఎం)జిల్లా నాయకులు

త్వరితగతిన బ్రిడ్జి పూర్తి చేస్తాం
కొన్ని కోర్టు కేసులు, భూసేకరణ సమస్యల వల్ల దర్గా ఆర్‌ఓబీ బ్రిడ్జి పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రైల్వే ట్రాక్‌ పైన నిర్మాణానికి రైల్వేశాఖ అప్రూవల్‌ కూడా ఇచ్చింది. దర్గా ఆర్‌ఓబీ బ్రిడ్జి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరితగతిన బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. దర్గా రైల్వే అండర్‌ బ్రిడ్జి గురించి ఆర్‌అండ్‌బీ శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం గురించి తెలియదు. ఎన్‌ఐటీ 150 ఫీట్ల దర్గా కొత్త రోడ్డులో రూ.7.50కోట్లతో చేపట్టే ఫోర్‌ లైన్స్‌ రోడ్డు నిర్మాణం పనులనూ త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ప్రారంభిస్తారు. ఫాతిమా నగర్‌ ఆర్‌ఓబీ బ్రిడ్జి పనులూ వేగంగా జరుగుతున్నాయి. బ్రిడ్జి పైన కూర్చుండబెట్టే రెండు గడ్డర్స్‌ నిర్మాణం పూర్తయింది. -సురేష్‌ బాబు, ఈఈ. ఆర్‌అండ్‌బీ

ప్రతిపాదనలు సిద్ధం చేశాం
డివిజన్‌లో పైప్‌లైన్‌ల కోసం తవ్విన రోడ్ల, డ్రయినేజీల నిర్మాణ మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అదే విధంగా దర్గా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ నుంచి రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీల నిర్మాణానికి అనుమతి లభించింది. త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తాం.
-ఏఈ విజయలక్ష్మి, జీడబ్ల్యూఎంసీ, కాజీపేట

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -