నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలోని సిమెంట్ పరిశ్రమ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. సీసీఐ పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అనేక వనరులు ఉండడంవల్ల పరిశ్రమను తిరిగి పునరుద్ధరించవచ్చని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీసీఐ పునరుద్ధరణ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో సీసీఐ పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత ఉపాధి తదితర విషయాలను మంత్రితోపాటు పరిశ్రమల శాఖకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో, తెలంగాణ ముఖ్య కార్యదర్శి ఎ. రామకృష్ణ రావు, సీసీఐ సిఎండీ సంజయ్ బంగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీనియర్ అధికారులతో కలిసి ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రతిపాదనలను పరిశీలించారు. ఆధునిక యంత్రాంగంతో ప్లాంట్ పునరుద్ధరణకు సుమారు రూ.2,000 కోట్లు అవసరమని సీసీఐ యాజమాన్యం తెలిపింది. పునరుద్ధరించబడిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా విస్తృతమైన లాభాలు కలుగుతాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇంత పెద్ద పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని, ప్రైవేటీకరణ లేదా డిస్ఇన్వెస్ట్‌మెంట్ (అంశాల విక్రయం) ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తుందని స్పష్టంగా తెలిపారు. సీసీఐ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కోరిందని, వీటిని త్వరలో సమర్పిస్తామని ఆయన వివరించారు. ఇకపోతే, ఈ ప్రాంతంలో 2,000 ఎకరాల మేర ఉన్న ఉన్నత ప్రమాణాల చున్నపు రాళ్ల (లైమ్‌స్టోన్) నిల్వలు ఈ ఫ్యాక్టరీ స్థిరంగా కొనసాగేందుకు బలాన్నిస్తాయని తెలిపారు.