Monday, February 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆశలు..అడియాశలు

ఆశలు..అడియాశలు

- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి
ప్రత్యేకంగా ఏం ప్రకటించని వైనం
రాష్ట్ర విజ్ఞప్తులను పట్టించుకోని మోడీ సర్కారు
విభజన హామీల ఊసేలేదు

నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పలుమార్లు కలిసి వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల గురించి విజ్ఞాపన పత్రాలను అందించారు. తెలంగాణకు అండగా ఉండాలనీ, దాదాపు రూ.1.50 లక్షల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

దీంతో 2026-27 కేంద్ర బడ్జెట్‌లో నిధులొస్తాయని ఆశించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. అయినా ఏపీ పునర్విభజన చట్టాన్ని మాత్రం అమలు చేయడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ విభజన హామీల ఊసేలేదు. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అడగకపోయినా హైదరాబాద్‌-పూణె, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌- చెన్నై మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రకటించడం గమనార్హం.

నిధుల సమీకరణ ఎలా?
రాష్ట్రానికి సంబంధించి దాదాపు 12 విభాగాల్లో 47 అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టూ సుమారు 350 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దానికి రూ.34,367 కోట్లు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్లు ఇవ్వాలని సూచించింది. హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 ప్రతిపాదనలకు అనుమతించడంతోపాటు నిర్మాణానికి రూ.44,028 కోట్లు మంజూరు చేయాలని కోరింది. గోదావరి నుంచి మూసీకి నీటిని మళ్లించే లింక్‌ ప్రాజెక్టుకు రూ.ఆరు వేల కోట్ల ఆర్థిక సాయం కావాలని విజ్ఞప్తి చేసింది. ముసీ పునర్జీవం పథకానికి నిధులు కేటాయించాలని కోరింది. బందర్‌ పోర్ట్‌, హైదరాబాద్‌ డ్రై పోర్ట్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ ప్రతిపాదనల కోసం రూ.17 వేల కోట్లు మంజూరు చేయాలని కోరింది.

ఆదిలాబాద్‌, కొత్తగూడెం, బసంత్‌ నగర్‌ విమానాశ్రయాలను ఆమోదించాలని తెలిపింది. రాష్ట్రంలో ఎనిమిది కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలని సూచించింది. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌లో తెలంగాణను చేర్చాలని కోరింది. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎంను ఇవ్వాలని సూచించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తులను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బడ్జెట్‌లో కనీసం ఒక్క అంశం కూడా ప్రస్తావనకు రాలేదు. దీంతో తెలంగాణ పట్ల ఎంత వివక్షను ప్రదర్శిస్తున్నదో అర్థమవుతున్నది. అయితే ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకుపోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం సహకరించకుంటే ఈ అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలకు నిధుల సమీకరణ ఎక్కడి నుంచి తెస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం ముందు సవాల్‌గా ఉన్నది.

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం
2026-27 రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయి. వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఎక్కడి నుంచి తెస్తుందన్నది కూడా కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభావం పడుతుంది. నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ బాటలో అప్పులు చేస్తుందా? లేదంటే భూములను అమ్ముతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వీటితోపాటు కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. వాటి అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుతామని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ నిధుల సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్నది. అభివృద్ధిని, సంక్షేమ పథకాలను, ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకుపోతుందో వేచిచూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -