Thursday, March 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశత్రునౌకలకు మృత్యుమార్గం హార్ముజ్‌

శత్రునౌకలకు మృత్యుమార్గం హార్ముజ్‌

- Advertisement -

ఈ జలసంధిలో అడుగుపెడితే అంతే…
ఎక్కడికక్కడ విధ్వంసక ఉచ్చులు ఏర్పాటు చేసిన ఇరాన్‌
ట్రంప్‌ సర్కార్‌కు కంటిమీద కునుకు కరువు
ఇరాన్‌ చమురు కేంద్రాలపై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులు
ఇది చాలా ప్రమాదకరం : రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ


టెహరాన్‌: తమ ఆధీనంలో ఉన్న హార్మూజ్‌ జల సంధిని శత్రునౌకలకు మృత్యుమార్గంగా ఇరాన్‌ మార్చేస్తోంది. అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు పెరిగే కొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు తన ప్రతిఘటనను తీవ్రం చేస్తోంది. ఇందుకోసం తాజాగా తన పాత ఆయుధాన్ని రంగంలోకి దించుతోంది. ఈ ప్రాంతంలోకి అమెరికా మిత్ర దేశాల నౌకలు అడుగుపెడితే పేలిపోయేలా ఇరాన్‌ ఎక్కడి కక్కడ ఉచ్చులు ఏర్పాటు చేసింది. ఈ చర్యలు ట్రంప్‌ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ఆయుధం పేరే ‘సీమైన్స్‌’ లేదా ‘నేవల్‌ మైన్స్‌’ (సముద్రపు మందుపాతరలు)..! సముద్రంలో ఒక్కసారి మైన్స్‌ను పరిచాక నౌకలు ఏమార్గంలో ప్రయాణిస్తే హార్మూజ్‌ను దాటగలవో ఒక్క ఇరాన్‌కు మాత్రమే తెలుసు.

ఏమిటీ ‘నేవల్‌ మైన్స్‌'(లేదా) ‘సీ మైన్స్‌’..?
సాధారణంగా శత్రువులు సరిహద్దులు దాటకుండా భూమిలో మందుపాతర్లు అమర్చినట్లే సముద్ర జలాల్లో అమర్చే మందుపాతరలనే సీమైన్స్‌ అంటారు. నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేసేందుకు అవి ప్రయాణించే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. దీంతో శత్రువు ఆ మార్గంలోకి రాకుండా ఇవి భయపెడుతుంటాయి. అమెరికా విప్లవం సమయంలో గన్‌పౌడర్‌ నీటి అడుగున కూడా పేలుతుందనే విషయాన్ని యేల్‌కు చెందిన డేవిడ్‌ బుష్‌నెల్‌ గుర్తించినప్పుడే వీటి తయారీకి బీజం పడింది. వీటిల్లో వివిధ రకాల మైన్స్‌ ఉన్నాయి. సముద్రం అడుగున గొలుసులతో అమర్చేవి, ప్రొపల్షన్‌ వ్యవస్థలతో పనిచేసేవి ముఖ్యమైనవి. ఇక మైన్స్‌ను నౌకల కింది భాగాలు తాకినా, అయస్కాంత క్షేత్రం సమీపంలోకి వచ్చినా, నౌకల ప్రొపల్షన్‌ వ్యవస్థ చప్పుడుకు, నౌక నీటిపై సృష్టించే ఒత్తిడికి ఇవి పేలిపోయేలా వీటిని రూపొందిస్తారు. రిమోట్‌ సాయంతో కూడా వీటిని పేల్చవచ్చు. వీటిల్లో మైన్‌ స్థాయిని బట్టి 50 నుంచి 1,000 కేజీల పేలుడు పదార్థాలు ఉంటాయి. మిగిలిన ఆయుధాలతో పోలిస్తే ఇవి చాలా చౌక.

కాగా, ఇరాన్‌ వద్ద దాదాపు 2,000 నుంచి 6,000 వరకు సీమైన్స్‌ ఉన్నట్టు అంచనా. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతోపాటు.. సొంతంగానూ ఉత్పత్తి చేస్తోంది. ఇరాన్‌ నౌకాదళంలోని చిన్న నౌకలు ఒక్కోటి రెండు నుంచి మూడు మైన్స్‌ను సముద్రంలో అమర్చగలవు. ఇలాంటి నౌకలు వందల సంఖ్యలో ఇరాన్‌ వద్ద ఉన్నాయి. ఇక సబ్‌మెరైన్ల సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్‌ కూడా టెహ్రాన్‌ వద్ద ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వీటి సాయంతో సముద్రంలో మైన్స్‌ను పెట్టడం వల్ల హార్మూజ్‌ జలసంధిని దాటడం రవాణా నౌకలకు అసాధ్యంగా మారుతుంది. 1980ల్లో ట్యాంకర్‌ వార్‌ వేళ భారీ సంఖ్యలో సీమైన్లను వాడి నౌకలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ట్రంప్‌ సర్కారు కూడా కంగారుపడుతోంది. హర్మూజ్‌లో సీమైన్స్‌ను తొలగించాలని ట్రంప్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నేడు అమెరికా దళాలు 16 ఇరానియన్‌ మైన్‌ లేయర్స్‌ నౌకలను ధ్వంసం చేశాయి. కాకపోతే ఇంకా పెద్దసంఖ్యలో ఇరాన్‌ వద్ద ఈ శ్రేణి నౌకలు ఉన్నాయి.

ఇరాన్‌లో నల్లటి ఆమ్ల వర్షం
ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయిల్‌, అమెరికా వైమానిక దాడులకు పాల్పడిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. అది నల్లటి ఆమ్ల వర్షమని మరికొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వర్షం కారణంగా తలనొప్పి, శ్వాస సమస్యలు వస్తున్నాయని, భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయని ఇరాన్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. వైమానిక దాడుల అనంతరం కురిసే ఆమ్ల వర్షం అత్యంత ప్రమాదకరమని ఇరాన్‌కు చెందిన రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ తెలిపింది. ఇది సాధారణ ఆమ్లవర్షం కన్నా హానికరమని వాతావరణ కాలుష్యంపై పరిశోధన జరుపుతున్న ఆ సంస్థ పేర్కొంది. ఈ వర్షాలతో శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, హృద్రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని సంస్థ పరిశోధకులు తెలిపారు.

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి
హార్మూజ్‌ జలసంధిలో మంటల్లో చిక్కుకున్న నౌక
20మంది సిబ్బంది కాపాడిన అధికారులు
మరో ముగ్గురు గల్లంతు ?
దాడి చేసింది తామేనన్న ఇరాన్‌
మరో నౌకపైనా దాడి ?

భారత్‌కు వస్తున్న థాయి కార్గో నౌక ‘మయూరీ నారీ’పై అత్యంత వూహాత్మకమైన హార్మూజ్‌ జలసంథిలో బుధవారం దాడి జరిగింది. వెంటనే పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో నౌక చిక్కుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఖలీఫా పోర్ట్‌ నుంచి బయలుదేరి గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోవాల్సిన ఈ నౌకపై క్షిపణితో దాడి జరగడంతో నౌకలో కొంత భాగం మండుతోంది. ఆ వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఇరుకైన షిప్పింగ్‌ కారిడార్‌లో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని రెండు క్షిపణులతో దాడి జరిగిందని గుర్తించారు. వెంటనే ఆ నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

20మంది సిబ్బందిని రక్షించారు. తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన ఒమన్‌ నావికా బలగాలు ఎక్కువమంది సిబ్బందిని రక్షించినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు గల్లంతయ్యారా లేక ఇంకా నౌకలోనే వున్నారా అనేది తెలియరాలేదని బ్యాంకాక్‌ పోస్ట్‌ తెలిపింది. ఒమన్‌కు ఉత్తర తీరంగా 11 నాటికల్‌ మైళ్ళ దూరంలో వుండగా ఈ నౌకను లక్ష్యంగా చేసుక్నుట్లు నౌక ట్రాకింగ్‌ డేటాను బట్టి తెలుస్తోంది. రాయల్‌ థాయి నేవీ, బ్రిటన్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సంస్థలు రెండూ ఈ దాడి సమాచారాన్ని నిర్ధారించాయి. ఈ దాడిలో నౌకకు జరిగిన నష్టం గురించి లేదా అందులోని సిబ్బంది గురించి ఎలాంటి సమాచారాన్ని అధికారులు ఇంతవరకు వెల్లడించలేదు.

మేమే చేశాం
అనంతరం ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఒక ప్రకటన చేసింది. లైబేరియా జెండాతో వెళుతున్న ఒక నౌకను, అలాగే థాయి సరుకుల రవాణా నౌక మయూరీ నారీపై హోర్మూజ్‌ జలసంథిలో తాము దాడులు జరిపినట్లు ప్రకటించింది. ” లైబేరియా జెండాతో వెళుతున్న ఈ నౌక ఇజ్రాయిల్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్‌ రోమ్‌ నౌక అని, దానిపై, మయూరీ నారీపై ఇరాన్‌ క్షిపణులతో దాడులు జరిపి, వాటిని నిలువరించామని ఆ ప్రకటన పేర్కొంది. ఐఆర్‌జీసీ నావికా బలగాల హెచ్చరికలను బేఖాతరు చేసి అవి ముందుకు సాగుతుండడంతో తాము దాడులకు పాల్పడ్డా మని ఐఆర్‌జీసీని ఉటంకిస్తూ ఇరాన్‌ వార్తా సంస్థ ఇర్నా తెలిపింది.

భారత్‌ ఆందోళన
భారత్‌ వస్తున్న మయూరీ నారీపై దాడిజరగడం పట్ల భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని, అమాయకులైన సిబ్బందిని, ప్రజలకు ముప్పు కలిగించడాన్ని నివారించాలని కోరింది.

ట్రంప్‌ నిర్ణయంతో తిప్పలు
ఓవైపు హార్మూజ్‌లో ఇరాన్‌ సీమైన్స్‌ను అమరుస్తున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో .. ట్రంప్‌ సర్కారు గతంలో తీసుకొన్న ఓ నిర్ణయం బెడిసికొట్టినట్లైంది. సీమైన్స్‌ను తొలగించే మైన్‌స్వీపర్స్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో పర్షియన్‌ గల్ఫ్‌లోని నాలుగు స్పెషలైజ్డ్‌ మైన్‌ స్వీపర్లను డీకమిషన్‌ చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ కేంద్రం నుంచి వీటిని ఓ హెవీ లిఫ్ట్‌వెసల్‌లో ఉంచి తుక్కు కింద అమెరికాకు తరలించేసింది.

ఈ ప్రాంతానికి తరలించనున్న నాలుగు లిట్టోరల్‌ కాంబాట్‌ షిప్‌లకు మైన్స్‌ను తొలగించే బాధ్యతలు అప్పగిస్తామని అప్పట్లో యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. అయితే వీటి పనితీరు ఏమాత్రం బాగోలేదని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక నాలుగు పంపుతానన్న అమెరికా మూడింటినే పంపింది. వీటిని హర్మూజ్‌ జలసంధిలో మోహరిస్తే అది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గానే మిగులుతుందని అమెరికా నేవీ మాజీ కెప్టెన్‌, విశ్లేషకుడు కార్ల్‌ షఉస్టర్‌ సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓడలకు హార్మూజ్‌ జలసంధి మత్యు మార్గంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -