Tuesday, December 30, 2025
E-PAPER
Homeఖమ్మంఆయిల్ ఫామ్ తోటలలో కొమ్ము పురుగు 

ఆయిల్ ఫామ్ తోటలలో కొమ్ము పురుగు 

- Advertisement -

– లక్షణాలు,నివారణ : డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ ఫాం తోటల్లో కొమ్ము పురుగు వ్యాప్తి,నివారణ చర్యలు పై స్థానిక హెచ్ఆర్ఎస్ హెడ్ సైంటిస్ట్ మజ్జిగ శ్రీనివాస్ విశ్లేషణ ఆయిల్ పామ్ తోటలలో కొమ్ము పురుగు సంవత్సరం అంతటా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే ప్యూపా దశలో ఉన్న పురుగులు బయటకు వచ్చి మొక్కలపై దాడి చేస్తాయి. అందువల్ల వర్షాకాలం ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపించే కాలం.

పెద్ద పురుగు (అడల్ట్ బీటిల్) చెట్టు మొవ్వు భాగంలో రంధ్రాలు చేసి,మొక్క యొక్క మెత్తటి భాగాలను తింటుంది.అదేవిధంగా మొవ్వు దగ్గర రంధ్రాలు చేస్తుంది.ఈ రంధ్రాల నుండి నమిలిన పిప్పి బయట కనిపిస్తుంది.

నర్సరీ దశలో సాధారణంగా ఈ పురుగు ఉధృతి తక్కువగానే ఉంటుంది.కాని బాగా పెరిగిన నర్సరీ మొక్కలు కూడా ఈ పురుగు కు గురయ్యే అవకాశం ఉంటుంది.చిన్న మొక్కల మొవ్వు భాగాన్ని ఇది ఆశించి నప్పుడు మొవ్వు దెబ్బతిని,మొవ్వు కుళ్ళు సమస్య వ్యాపించే ప్రమాదం ఉంటుంది.తద్వారా మొక్క చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

పెద్ద మొక్కలలో,ఈ పురుగు ప్రభావం సాధారణంగా ఒకటి లేదా రెండు ఆకుల వరకు మాత్రమే పరిమితమవుతుంది.ఆకులు పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఆ ఆకుల మీద ఆంగ్ల వి( V) ఆకారంలో కత్తిరించినట్లు ఉన్న గాయాలు కనబడతాయి. అదేవిధంగా ఆకు మట్ట ల్లో రంధ్రాలు కూడా ఉంటాయి.

కొమ్ము పురుగు లక్షణాలు:

• ఆకుల చివర ఆంగ్ల అక్షరం వి( V )ఆకారంలో ఖాళీలు ఏర్పడటం
• ఆకుల మొదలలో శాశ్వత రంధ్రాలు
• ఆ రంధ్రాల నుండి నమిలిన పిప్పి బయటకు కనిపించడం
• మొవ్వు భాగంలోని ఆకులు కురుచగా విరిగినట్లు, మెలికలు తిరిగినట్లు కనిపించడం
జాగ్రత్తలు మరియు నివారణ
• పునరుత్పత్తి ప్రదేశాలను పూర్తిగా నాశనం చేయాలి.
• తోట పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.
• తోటలో పశువుల ఎరువుల కుప్పలు వేయకూడదు. వీటి దుర్వాసన పెద్ద పురుగులను ఆకర్షిస్తుంది; ఇవి గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలవుతాయి.
• బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా కంపోస్టు మాత్రమే వాడాలి.
• మొవ్వు వద్ద కనిపించే రంధ్రాల లో సూది మొనగల ఇనుప ఊచ ను దూర్చి లోపల ఉన్న పురుగులను బయటకు తీసి చంపాలి.
• పురుగు రంధ్రాలను ఇసుక + కార్బెండజిమ్ (3:1) మిశ్రమంతో మూసి వేయాలి.
• పశువుల ఎరువును తోటల్లో వేసే ముందు, 1 టన్ను ఎరువు కు 1 కిలో మెటారైజియం అనిసోఫ్లియా కలపాలి.
• మెటారైజియం అనిసోఫ్లియా జీవ శిలీంద్రాన్ని పెంకు కుప్పలలో, చనిపోయిన ఆయిల్‌పామ్/కొబ్బరి తాటి కాండాల మీద చల్లాలి.
• పులిసిన ఆముదపు పిండి, Responding కేరళ (pheromone traps) ద్వారా పెద్ద పురుగులను పట్టి నిర్మూలించవచ్చు.
• వాడిపోయిన చేపల వలలను మొక్కల మధ్య కట్టడం ద్వారా ఎగురుతున్న పురుగులను అడ్డుకోవచ్చు.
• చిన్న మొక్కల మొవ్వు భాగం చుట్టూ వల కప్పి తే పెద్ద పురుగులు లోపలికి ప్రవేశించ లేవు.
• పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లాంబ్డా సైహాలోత్రిన్ 1 ఎంఎల్ / 1 లీటర్ నీరు పిచికారీ చేయాలి.
• చిన్న రంధ్రాలున్న డబ్బాలో కానీ పాలిథీన్ కవర్ లో కానీ నాఫ్తలీన్ బాల్స్ పెట్టి మొవ్వు దగ్గర ఉంచాలి. వాసన తగ్గినప్పుడు కొత్తవి అమర్చాలి.
• బాకులోవైరస్ ద్రావణంలో పెద్ద పురుగులను ముంచి సహజ వాతావరణంలో విడుదల చేయాలి.

అలా విడుదల చేసిన పురుగులు సహజ జనాభా లోని ఇతర పురుగుల తో కలిసినప్పుడు వైరస్ వ్యాపించి, పురుగుల జనాభా క్రమంగా తగ్గిపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -