Sunday, May 11, 2025
Homeరాష్ట్రీయంఅవినీతి ఊబిలో ఆస్పత్రుల అనుమతులు!

అవినీతి ఊబిలో ఆస్పత్రుల అనుమతులు!

- Advertisement -

– నెలరోజుల్లో ఇవ్వాల్సిన ఎన్‌వోసీకి ఏడాకి పైగా నిరీక్షణ
– జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో రోజుల తరబడి పెండింగ్‌
– కలెక్టర్‌ చైర్మేన్‌గా ఉన్నా డీఆర్‌ఏ కమిటీ నుంచి స్పందన నిల్‌
– క్లీనికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెల్‌లోనూ స్తబ్ధత
– ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ స్కీంలు వర్తించక రోగుల ఇబ్బందులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

నూతన ఆస్పత్రుల అనుమతులు, పర్మిషన్‌ల పునరుద్ధరణ ఫైళ్లు రోజుల తరబడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంటున్నాయి. ఆస్పత్రులకు అనుమతి ఉందా? లేదా? పర్మిషన్‌ పునరుద్ధరణ అయిందా? లేదా..? అనే విషయం తెలియక ఆ ఆస్పత్రికి వెళ్లిన రోగులకు ప్రభుత్వ స్కీంలు వర్తించని పరిస్థితి ఉంది. కలెక్టర్‌ చైర్మెన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ (డీఆర్‌ఏ) నెల రోజుల్లో క్లియర్‌ చేయాల్సిన ఫైల్‌ను నెలల తరబడి అట్టిపెట్టుకోవటం అనుమానాలకు తావిస్తోంది. క్లీనికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెల్‌ (సీఏసీ)లోనూ ఫైళ్లు ముందుకు కదలట్లేదు. ఖమ్మం జిల్లాలో ఈ సెల్‌ బాధ్యతలు చూస్తున్న అడిషనల్‌ డీఎంహెచ్‌వో, సీనియర్‌ అసిస్టెంట్‌ వైపు నుంచి కూడా లోపాలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు లోబడి ఉన్న అనుమతి ఫైళ్ల(ఎన్‌వోసీ)ను వెంటనే క్లియర్‌ చేయటంలో చొరవ చూపాల్సిన డీఎంహెచ్‌వో, జిల్లా కలెక్టర్‌ స్తబ్ధత వహిస్తుండటంపైనా సందేహాలు తలెత్తుతున్నాయి.
తాత్కాలిక అనుమతులతోనే..
బిల్డింగ్‌, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికేట్‌, పార్టనర్‌షిప్‌ డీడ్‌, రెంటల్‌ డీడ్‌, డాక్టర్స్‌ అండ్‌ నర్సింగ్‌ స్టాఫ్‌కు తెలంగాణ మెడికల్‌ కౌన్సెల్‌ సర్టిఫికెట్స్‌, బయో మెడికల్‌ వేస్టేజ్‌ సర్టిఫికెట్‌, సరైన పార్కింగ్‌.. వంటివి పరిశీలించి నెల రోజుల్లోనే ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చేయాలి. కానీ ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రముఖ ఆస్పత్రులు అనుమతి కోసం అప్లై చేసుకొని రోజుల తరబడి నీరిక్షిస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులకు 45 రోజుల పాటు చెలామణిలో ఉండే తాత్కాలిక అనుమతులు ఇస్తున్నారు. కానీ శాశ్వత అనుమతులు (ఎన్‌వోసీ) ఇచ్చే విషయంలో బేరసారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనల మేరకు లోబడి ఉంటేనే అనుమతి ఇవ్వాలని కొన్ని యాజమాన్యాలు కోరుతున్నాయి. కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో, పోలీస్‌ కమిషనర్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జిల్లా ప్రెసిడెంట్‌ సభ్యులుగా ఉన్న డీఆర్‌ఏ కమిటీ అనుమతుల విషయంలో తాత్సారం చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
సకల వసతులున్నా సమర్పణ తప్పట్లే…!
నిబంధనల ప్రకారం వసతులున్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఆస్పత్రులు పడకల ఆధారంగా చలానా తీయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించి అనుమతుల కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేస్తుంటాయి. ఈ పర్మిషన్స్‌ను ప్రతి ఐదేండ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆస్పత్రులను ఒకచోటి నుంచి మరో చోటకు మార్చుతారు. అంతకుముందు అనుమతి ఉన్నా అలా మార్చినప్పుడు మళ్లీ అనివార్యంగా అనుమతి తీసుకోవాలి. బెడ్ల సంఖ్య పెరిగినా ఆ మేరకు అనుమతి తీసుకోక తప్పదు.
వైరా రోడ్డులోని ఆస్పత్రి బోనకల్‌ రోడ్డుకు మార్పు…
ఈ మేరకు ఖమ్మం వైరా రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిని బోనకల్‌ రోడ్డుకు మార్చారు. కార్పొరేట్‌ తరహా సౌకర్యాలతో నెలకొల్పారు. ఆస్పత్రికి శాశ్వత అనుమతి కోసం గతేడాది మార్చి 27వ తేదీన దరఖాస్తు చేశారు. 20 బెడ్స్‌ నుంచి 100 బెడ్స్‌కు విస్తరిస్తున్నట్టు దరఖాస్తులో స్పష్టత ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఆ ఆస్పత్రికి శాశ్వత అనుమతులు ఇవ్వటంలో తాత్సారం చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. అప్పట్లో మూడు నెలల వరకు తాత్కాలిక అనుమతి ఉంటే దానిని ఇటీవల ఏడాదికి పొడిగించారు. ఇలా తాత్కాలిక అనుమతులతోనే ఆ ఆస్పత్రి నెట్టుకురావాల్సి వస్తోంది. లోపాలను సూచిస్తే సరిచేసుకుంటాం.. కానీ తమకు శాశ్వత పర్మిషన్‌ ఇవ్వాలని ఆస్పత్రి యాజమాన్యం ఎన్నిసార్లు డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లినా స్పందించటం లేదని తెలుస్తోంది. ఫైల్‌ కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదేకాక మరో తొమ్మిది ఆస్పత్రులు కూడా అనుమతుల కోసం అర్జీ చేసుకోగా.. వాటిని కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారు. అయితే, ఈ జాప్యం వెనుక అమ్యామ్యాల మతలబేదో ఉందనే చర్చ సాగుతోంది. పర్మినెంట్‌ నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) లేకపోవడం సామాన్య రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ వంటి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్‌ పొందలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -