Sunday, September 21, 2025
E-PAPER
Homeహెల్త్హాస్టల్‌, రూమ్మేట్స్‌

హాస్టల్‌, రూమ్మేట్స్‌

- Advertisement -

అనేక కారణాలవల్ల కొందరు పిల్లలు హాస్టల్లో వుండాల్సి వస్తుంటుంది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఎక్కువగా ట్రాన్స్‌ఫర్లు అవుతుండడంతో పిల్లల్ని హాస్టల్లో వుంచి చదివిస్తుంటారు. మరికొందరు పిల్లలకి చదువుమీదే దష్టి వుండాలని హాస్టల్లో చేరుస్తుంటారు. ఇది చాలా సహజమయిపోయింది. అయితే పిల్లలు సవ్యంగా చదువుతున్నారా, ఎదుగుతున్నారా అన్నది పరిశీలించాలి. హాస్టల్లో వేసినంత మాత్రాన పిల్లలు బాగా చదువుకుంటారని, ప్రయోజకులు అయిపోతారన్నది భ్రమే!

కొద్దిమంది మాత్రమే నిజంగా చదువుమీద దష్టిపెడుతున్నారు. చాలామంది ఆ వచ్చిన అవకాశాన్ని స్వేచ్ఛగా భావించి స్నేహితులతో గడిపేయడానికే ఇష్టపడు తున్నారు. ఆ స్నేహాలు పెడదారి పట్టిస్తున్నాయి. ఇది వాస్తవం. అలాగని ఎవర్నీ నిందించలేం, ఎవర్నీ తప్పుపట్టలేం. కారణం చదువు మీద దష్టిపెడతారని తల్లిదండ్రుల నమ్మకం. ఆ నమ్మకాన్ని కార్యరూపంలో చూపాల్సిన బాధ్యత పిల్లలది. కానీ అలా జరగడం లేదు.
హాస్టల్లో పిల్లలు చాలామందే వుండవచ్చు. హాస్టల్లో చేరగానే ముందుగా అక్కడి వాతావరణం అలవాటు కావాలి. అక్కడివారు, తోటి హాస్టల్‌ లేదా రూమ్మేట్స్‌ ఎలాంటివారన్నది గ్రహించడానికి కొంత సమయం పడుతుంది. పిల్లలంతా ఒకే ఆర్థికస్థాయితో వున్నవారు ఉండాలని, సామాజిక స్పహతో వున్నవారు, చదువుపట్ల ప్రత్యేక దష్టి, ఆసక్తి వున్నవారు ఉండాలనేమీ లేదు. రకరకాలుగా వుంటారు. పిల్లల్ని క్రమశిక్షణతో మంచి విద్యార్థులుగా, మంచి పిల్లలుగా తీర్చిదిద్దే బాధ్యత హాస్టల్‌ యాజమాన్యానిది. కానీ అలా అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నదా అంటే అదీ అనుమానమే.
అయితే పిల్లలు సవ్యంగా ప్రవర్తిస్తే ఇతరులు తమను వేరు మార్గాల్లోకి లాగే ప్రయత్నాలు అంతగా చేయరు. మంచి విద్యార్ధి అనిపించుకోవాలన్నా, చెడు అలవాట్లు తెచ్చుకున్నాడని వ్యతిరేకత పెంచుకోవాలనుకున్నా విద్యార్ధి తీరు తెన్నుల మీదనే ఆధారపడుతుంది. కనుక తోటి వారిని ముందుగా పరిశీలించు కోవాలి. ఎవరు నిజంగా చదువుమీద, చక్కగా అందరితో కలిసి మెలసి వుండేవా రన్నది గుర్తించాలి.

హాస్టల్లో వున్నంతకాలం అందరితో చక్కగా మెలగాలి. అందరితోనూ స్నేహంగా వుండాలి. అందుకు ఎంతో సహనం అవసరం. కొందరు మంచివారు, మరికొందరు బాగా అల్లరిచేసేవాళ్లు, ఇంకొందరు ఆటపాటలమీదనే ఎక్కువ దష్టిపెట్టేవారూ వుంటారు. వీరందరితో వుండాలంటే తప్పకుండా మీకు ఎంతో సహనం, అందరినీ మెప్పించగల నేర్పు వుండాలి. ఎవరితోనూ గొడవపడకూడదు. మీలో ప్రత్యేకతలతో అందర్నీ ఆకట్టుకోవాలి. మీలో విద్యేతర అంశాల్లో ఏదో ఒకదానిలో ప్రావీణ్యత వుండవచ్చు. అంటే మీరు సింగర్‌ కావచ్చు, ఏదన్నా ఆటలో ప్రావీణ్యం వుండవచ్చు లేదా వక్తగా ఆకట్టుకోవచ్చు. ఆ పరంగా అందరికీ దగ్గరకావచ్చు. అపుడు మీపట్ల ఇతరులు ఎంతో ఆదరాభిమానాలతో వ్యవహరిస్తారు. మీకు అవసర సమయాల్లో తోడ్పడతారు.
నాకు తెలిసినవాళ్ల అబ్బాయి పదవ తరగతిలో వుండగానే వాళ్లకి దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్‌ అయింది. అబ్బాయి చదువుతున్నది మంచి స్కూలు కావడంతో స్కూలు మార్చడం లేదా తమతో తీసికెళ్లడానికి ఇష్టపడలేదు. పిల్లాడిని ఒప్పించి హాస్టల్లో చేర్చారు. సహజంగానే పిల్లాడు ఎంతో మంచివాడు, మంచి ప్రవర్తన కలవాడు కావడంతో తక్కువ కాలంలోనే అందరికీ మంచి స్నేహితుడయ్యాడు. అంతేకాదు అతను లెక్కల్లో దిట్ట. లెక్కల్లో వెనుకబడిన వాళ్లందరికి ట్యూషన్‌ చెబుతూ వారిలో ఆ సబ్జెక్టుమీదున్న భయాన్ని పోగొట్టాడు. టెన్త్‌ అయిపోయి హాస్టల్‌ విడిచే సమయంలో వార్డన్‌, తోటి విద్యార్థులందరూ అతనికి మంచి బహుమతి ఇచ్చి సత్కరించడం గమనార్హం.

– తోటి విద్యార్థుల్లో మంచితనాన్ని గుర్తించండి.
– తోటివారిలో చదువుపరంగా వున్న లోటును గుర్తించండి.
– వీలైనంతగా సహనాన్ని, స్నేహభావాన్ని పాటించండి.
– అందర్నీ సమానంగా చూడండి.
మంచి నడవడి, చదువు మీద శ్రద్ధ వున్నవారు ఇతరులకు మార్గదర్శకులు కాగలరు. ఇంటివద్ద వున్నా, హాస్టల్లో వున్నా ఒకే విధంగా తెలివితేటలు, చదువుమీద శ్రద్ధా చూపగలరు. మీరు హాస్టల్లో వుంటే మీరు అతనిలా కావడానికి చిన్న ప్రయత్నం చేయండి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -