– క్యూరేటర్‌పై చీఫ్ కోచ్ గంభీర్ ఫైర్
– పిచ్ వద్దకు వెళ్లనివ్వని గ్రౌండ్స్‌మన్
ది ఓవల్ మైదానంలో వాతావరణం వేడెక్కింది. అసమాన పోరాట పటిమతో మాంచెస్టర్ టెస్టును డ్రాగా ముగించి.. లండన్‌కు చేరుకున్న భారత జట్టుకు ప్రాక్టీస్ సెషన్లో ఇంగ్లాండ్ క్యూరేటర్ ఇబ్బందులు సృష్టించాడు. సర్రే కౌంటీ గ్రౌండ్స్‌మన్, క్యూరేటర్ లీ ఫోర్టీస్ భారత సహాయక కోచ్‌లతో దురుసుగా ప్రవర్తించగా.. చీఫ్ కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఐదో టెస్టు ముంగిట సరికొత్త వివాదం భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌ను రక్తికట్టిస్తోంది.
నవతెలంగాణ-లండన్
భారత్, ఇంగ్లాండ్ ఐదు టెస్టుల ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కాలయాపన చేస్తున్నారని గిల్ ఆరోపించగా.. మాంచెస్టర్ టెస్టులో స్టోక్స్ డ్రా ఆఫర్‌ను జడేజా, సుందర్ తిరస్కరించారు. దీంతో టెస్టు సిరీస్‌లో ఇరు వైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం నుంచి ఐదో టెస్టు ఆరంభం కానుండగా.. ది ఓవల్ క్యూరేటర్ లీ ఫోర్టీస్ సరికొత్త వివాదానికి ఆజ్యం పోశాడు. భారత జట్టు సహాయక సిబ్బందితో ది ఓవల్ గ్రౌండ్స్‌మన్ దురుసుగా ప్రవర్తించటంపై చీఫ్ కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్,ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఆఖరు మ్యాచ్ ముంగిట ‘ది ఓవల్’లో వాతావరణం వేడెక్కింది.
గొడవ మొదలైందిలా..
గురువారం నుంచి ఐదో టెస్టు ఆరంభం కానుండగా.. మంగళవారం భారత క్రికెటర్లు ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్లో సాధన చేశారు. ఆటగాళ్ల కంటే ముందుగా సహాయక సిబ్బంది మైదానానికి చేరుకున్నారు. భారత అసిస్టెంట్ కోచ్‌లు పిచ్ దగ్గరకు వెళ్లి పరిశీలిస్తుండగా.. గ్రౌండ్స్‌మెన్ పిచ్‌కు 2.5 మీటర్ల దూరంలో నిలబడి చూడాలని సూచించారు. క్యూరేటర్ లీ ఫోర్టీస్ కలుగజేసుకుని పిచ్ చుట్టూ ఉన్న రోప్ ఆవల నిలబడి చూడాలని దురుసుగా చెప్పాడు. క్యూరేటర్ సహాయక కోచ్‌లను అమర్యాదగా మాట్లాడటం గౌతం గంభీర్‌కు నచ్చలేదు. దీంతో వెంటనే క్యూరేటర్ ఫోర్టీస్ వైపు వేలు చూపిస్తూ.. ‘మేము ఏం చేయాలో నువ్వు చెప్పోద్దు. నువ్వొక గ్రౌండ్స్‌మన్, అంతవరకే ప్రవర్తించు. మా సిబ్బందిలో ఎవరికీ.. ఏం చేయాలో చెప్పాల్సిన పని లేదు. నీకు ఆ హక్కు లేదు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నువ్వు కేవలం ఓ గ్రౌండ్స్‌మన్‌వి’ అని గంభీర్ అన్నాడు. గంభీర్ ఆవేశంగా మాట్లాడిన తర్వాత ఫోర్టీస్‌తో భారత బ్యాటింగ్ కోచ్ కొటక్ సంభాషిస్తుండగా.. ఛీఫ్ కోచ్ మరోసారి అతడితో మాటలేంది.. వదిలేరు అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ది ఓవల్ పిచ్‌కు పక్కన మూడు పిచ్‌లు ఉండగా.. భారత క్రికెటర్ల ప్రాక్టీస్‌కు వాటిని కేటాయించారు. ప్రధాన పిచ్ సైతం పక్కనే ఉండటంతో సహజంగానే సహాయక సిబ్బంది పిచ్‌ను పరిశీలించేందుకు ఆసక్తి చూపించారు. పిచ్ స్క్వేర్ వద్ద టీమ్ ఇండియా ఐస్ బాక్స్‌లు, డ్రింక్స్ బాక్స్‌లు పెట్టడానికి సైతం మైదాన సిబ్బంది అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. గౌతం గంభీర్ ప్రవర్తనను మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తానని క్యూరేటర్ పలుమార్లు హెచ్చరించినా.. మీడియాతో సాధారణంగానే మాట్లాడాడు. లీ ఫోర్టీస్ పర్యాటక జట్లతో కాస్త దురుసుగానే ప్రవర్తిస్తాడని, అతడి గత రికార్డులు అందుకు నిదర్శమని కొందరు చెబుతున్నారు.
పట్టుకుంటే పగిలిపోవడానికి పురాతన వస్తువు కాదు. అది ఓ క్రికెట్ పిచ్. నా క్రికెట్ కెరీర్‌లో పిచ్‌ను చూడవద్దని ఇప్పుడే వింటున్నాను’
– సితాన్షు కోటక్, భారత బ్యాటింగ్ కోచ్
చెప్పడానికి అక్కడేమీ జరగలేదు. దాచడానికి అక్కడేమీ లేదు’
– లీ ఫోర్టీస్,క్యూరేటర్
గంభీర్, ఫోర్టీస్ ఇద్దరూ ముక్కుసూటి మనుషులు. వాదన చిన్నదైనా, పెద్దదైనా.. ఇద్దరూ వెనక్కి తగ్గరు. ఈ సిరీస్‌లో తీవ్ర భావోద్వేగాలకు ఇదొక నిదర్శనం’
– బీబీసీ క్రికెట్ అనలిస్ట్
వేడెక్కిన ఓవల్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES