Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలుగు రాష్ట్రాల్లో హోటళ్లు బంద్‌..!

తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లు బంద్‌..!

- Advertisement -

– వంట గ్యాస్‌ కొరతతో విలవిల
– దేశవ్యాప్తంగా సంక్షోభం..
– ముంబయిలో 20 శాతం హోటళ్లు మూత
– హైటెక్‌ సిటీలో హాస్టళ్ల పరిస్థితి అంతంతే..
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: అమెరికా యుద్ధోన్మాద దుశ్చర్యలతో పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత హోటల్‌, రెస్టారెంట్‌ రంగాన్ని కల్లోలంలోకి నెట్టాయి. కమర్షియల్‌ ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది రెస్టారెంట్లు మూతపడే స్థితికి చేరుకు న్నాయి. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ)తో పాటు పలు రాష్ట్రాల హోటల్‌ అసోసియేషన్లు ఈ సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే పరిశ్రమ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూతపడగా, బెంగళూరులో చిన్న రెస్టారెంట్లు కేవలం టీ, కాఫీలకు మాత్రమే పరిమితమయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ గడ్డుకాలం..
గ్యాస్‌ కొరత ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా తీవ్రంగా పడింది. విశాఖపట్నంలో కమర్షియల్‌ సిలిండర్ల కొరత తీవ్రమైందని విశాఖ హోటల్‌ మర్చంట్‌ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌ నడుపుతున్నారని, దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల బంద్‌ చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్పీజీ దిగుమతులు పడిపోవడం పరిశ్రమ మనుగడనే ప్రశ్నార్థకం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ హాస్టళ్లలో ఆంక్షలు..
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి ఐటి హబ్‌లలోని పేయింగ్‌ గెస్ట్‌ (పిజి) హాస్టళ్లలో గ్యాస్‌ సరఫరా 75 శాతం పడిపోయింది. దీంతో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులకు మూడు పూటలా భోజనం ఎలా వండాలో తెలియక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మాదాపూర్‌ వంటి ప్రాంతాల్లోని వేలాది హాస్టళ్లలో భోజన సదుపాయాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో తాము నెలకు 100 సిలిండర్లు ఆర్డర్‌ చేస్తే, ఇప్పుడు కేవలం 20 నుంచి 25 మాత్రమే అందుతున్నాయని ఓ హాస్టల్‌ నిర్వాహకురాలు వాపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మా హాస్టల్‌లో ఉండే వందలాది మందికి భోజనం వండటం అసాధ్యమన్నారు. ఈ క్రమంలోనే ఐటి కారిడార్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ తమ సభ్యులకు కీలక సూచనలు జారీ చేస్తూ.. సెల్ఫ్‌ కుకింగ్‌ను నిలిపివేయాలని, ఎక్కువ గ్యాస్‌ వినియోగించే దోశ, పూరీ వంటి టిఫిన్లను పరిమితం చేయాలని కోరింది.

కేంద్రానికి రాష్ట్రాల లేఖలు..
వంటగ్యాస్‌ కొరత కేవలం హోటల్‌ రంగానికే పరిమితం కాకుండా పారిశ్రామిక, విద్యుత్‌, విద్యా రంగాలకు పాకుతోంది. ఈ సంక్షోభంపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యవసర లేఖ రాశారు. యుద్ధం వల్ల తలెత్తిన ఈ కొరత సామాన్య ప్రజలను, వాణిజ్య సంస్థలను, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను దెబ్బతీయకుండా కేంద్రం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి అత్యవసర లేఖ రాశారు. బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరతకు కేంద్రం మార్చి 9న జారీ చేసిన తాజా ఉత్తర్వులే కారణమని ఆయన తన లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని వాణిజ్య అవసరాలకు అనాలోచితంగా తీవ్ర కొరతను సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ రాష్ట్రంలో ఆహార, పౌర సరఫరాల పరిస్థితిని సమీక్షించి, గ్యాస్‌, నూనె వంటి నిత్యావసరాల సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. భోపాల్‌లో గత రెండు రోజులుగా కంపెనీల నుండి సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్‌ అత్యవసర సమావేశం పిలిచారు. మరోవైపు పంజాబ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ జోరుగా సాగుతున్న సమయంలో గ్యాస్‌ కొరత ఏర్పడటంపై హోటల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌ కుమార్‌ అరోరా ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -