లేకుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
పట్టాలిస్తామని గత ప్రభుత్వం మోసగించింది : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య
వరంగల్‌లో గుడిసెవాసుల భారీ ధర్నా
నవతెలంగాణ- వరంగల్
తాము వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని పేదలు ఆందోళన బాటపట్టారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. గుడిసెలేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, దేవాదాయ భూముల్లో 25 ఏండ్ల కింద పేద ప్రజలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. వేలాది కుటుంబాలు గుడిసెలేసుకొని జీవిస్తున్నాయన్నారు. ఐదు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ఇండ్లు లేని వారి కష్టాలను వివరిస్తే, ఇంతవరకు గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటీశ్వరులు, బడా వ్యాపారులు శిఖం భూముల్లో బహుళ అంతస్తులు కట్టుకుంటే ప్రభుత్వానికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమి ప్రజల కోసం కాకుండా కబ్జాదారులు, బడా రాజకీయ నాయకులకు కట్టబెట్టడానికా? అని ప్రశ్నించారు. 2022 డిసెంబర్ వరకు సొంత ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టిస్తామని ప్రధానమంత్రి ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. పేదలకు ఇల్లు, స్థలాలు ఇవ్వని ప్రధానమంత్రి రూ.465 కోట్లతో ఇల్లు కట్టించుకున్నారని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ.. 20ఏండ్లుగా గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న పేదలకు గత ప్రభుత్వంలో అధికారులు నోటీసులు ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వమైనా గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. 25 ఏండ్లుగా వరంగల్ నగరంలో గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బాబు, నలిగంటి రత్నమాల, ఆరూరి కుమార్, ఎండి బషీర్, వలదాసు దుర్గయ్య, యారా ప్రశాంత్ జక్కలుద్ది నాయకులు రామా సందీప్, లక్ష్మీపురం నాయకులు ధర్మారపు సాంబమూర్తి, మల్లు స్వరాజ్యం నాయకులు గున్నాల ప్రభాకర్, గాలయ్య, జానీ, అప్పాజీ వాణి, రాజు, భవాని, రాజేష్, కవిత, దివ్య, విజయ, వేలాదిమంది గుడిసెవాసులు పాల్గొన్నారు.
ఇండ్ల పట్టాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



