Thursday, October 30, 2025
E-PAPER
Homeకరీంనగర్తుది దశలో ఉన్న ఇండ్లను పూర్తి చేయాలి

తుది దశలో ఉన్న ఇండ్లను పూర్తి చేయాలి

- Advertisement -

గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జిల్లాలో తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం హౌసింగ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 7918 ఇండ్లు మంజూరు చేయగా, 5361 ఇండ్లకు ముగ్గు పోయడం జరిగిందని, 2042 బేస్ మెంట్ లెవెల్, 1011 గోడల లెవెల్, 962 స్లాబ్ లెవెల్ ఉండగా, 8 ఇండ్లు పూర్తి అయ్యాయని, ఇండ్ల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటిదాకా రూ. 49 కోట్ల 85 లక్షల ఆర్థిక సహాయం జమ అయిందని తెలిపారు.

నిరుపేదలకు ఇండ్లు ఖచ్చితంగా ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని వెల్లడించారు. అన్ని మండలాల్లో నిర్మాణం పూర్తయిన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు
ప్రతీ మండలంలో వారం రోజుల్లో కనీసం ఒక్కో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన కోనరావుపేట మండల అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, అన్ని ఇండ్లను పూర్తి చేసేలా చూడాలని పిలుపు ఇచ్చారు.
జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇండ్ల నిర్మాణం కోసం మార్కింగ్ తప్పనిసరిగా చేయాలని, పనులు వేగంగా పూర్తి చేసేలా రోజు పర్యవేక్షణ చేస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకోవడం, పనులు వేగవంతం చేసేందుకు అధికారులు స్వయంగా వెళ్ళి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. లబ్దిదారులకు పనులు ప్రారంభించేందుకు అవసరమైన వారికి ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఇండ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, వారం తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తాను, వచ్చే సమీక్ష వరకు ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. ప్రతీరోజూ తమ పరిధిలోని గ్రామాలను ఎంపీడీఓ లు సందర్శించి, ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా పర్యవేక్షించాలని,  ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి ధరల నియంత్రణ, తదితర అంశాలపై యజమానులతో లేబర్ అధికారి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఇసుకకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తహశీల్దార్లతో సమన్వయం చేసుకుని ఇండ్ల నిర్మాణాల ప్రగతిని పెంచాలని, ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణాలు ఏయే గ్రామాల్లో ప్రారంభించలేదో దానికి సంబంధించిన వివరాలను గృహనిర్మాణ శాఖ పీడీకి సూచించారు. ప్రతి అధికారి తమ హయాంలో ఇండ్లు నిర్మించి ఇస్తే అది మర్చిపోలేని అనుభూతి అని వివరించారు. సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -