మురికివాడల పేదలకు అక్కడే జీ-ప్లస్3 పద్ధతిలో నిర్మాణం చేయాలి
అసంపూర్తిగా ఉన్న 35వేల 2బీహెచ్‌కే ఇండ్లను పూర్తిచేయాలి :
సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వెంకటశ్
హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో అర్హులైన పేదలకు వెంటనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న 35వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి పేదలకు అప్పగించాలన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా నగరంలో పేదల ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని విమర్శించారు. లక్షలాది మంది పేదలు సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పేదల ఇండ్ల సమస్య మరింత జటిలమైందని, పదేండ్ల కాలంలో 70 వేల ఇండ్లు మాత్రమే నిర్మించి పేదలకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. నగర శివారుల్లోకి తరలించిన పరిశ్రమల స్థలాలను, నగరంలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదల ఇండ్ల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేదల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. భోజగుట్టలో బస్తీలో ఏండ్లుగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి.. ఆ బస్తీ వాసులకే కేటాయించాలని సీపీఐ(ఎం) నాయకులు సి.మల్లేష్ డిమాండ్ చేశారు. బతుకుమ్మ కుంట బస్తీలో మిగిలిన ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అంబర్‌పేట కన్వీనర్ ఎం.మహేందర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ డీఆర్వోకు వినతి
అనంతరం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ప్రజావాణిలో హైదరాబాద్ డీఆర్వో ఈ.వెంకటాచారిని కలిసి, వివిధ బస్తీలలో ఇండ్ల నిర్మాణ సమస్యలపై, కొత్తగా నిర్మిం చాల్సిన ఇందిరమ్మ ఇండ్లపై చర్చించారు. ఈ ధర్నాకు సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్ అధ్యక్షత వహించారు. నాయకులు సి.మల్లేష్, ఆర్.వెంకటేశ్, పి.నరేష్, ఎం.అజరు బాబు, బి.కిరణ్, టి.శేషగిరిరావు, ఆర్.మల్లేష్, ఎం.సత్యనారాయణ, షబానా ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ధర్నాలో భోజగుట్ట బస్తీ, బతుకమ్మకుంట, భరత్‌నగర్, మొదలగు బస్తీల నుంచి పేదలు పెద్దఎత్తున పాల్గొన్నారు.



