Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెలుగుమట్ల బాధితులందరికీ ఇండ్లు కట్టించాలి

వెలుగుమట్ల బాధితులందరికీ ఇండ్లు కట్టించాలి

- Advertisement -

రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
అక్రమ కేసులన్నీ ఎత్తేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి.చలపతిరావు డిమాండ్‌
ధర్నాచౌక్‌లో పేదల ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో కూల్చేసిన ఇండ్ల స్థలాల్లోనే బాధితులందరికీ ప్రభుత్వం ఉచితంగా గృహాలు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి చలపతిరావు డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య అధ్యక్షతన వెలుగుమట్లకు చెందిన సుమారు 300 మంది బాధితులు బుధవారం హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు రవికుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి పేదల హక్కులను, రాజ్యాంగ హక్కులను కాలరాసిందన్నారు. వెలుగుమట్లలో పేదలందరికీ నివాసాలను కల్పించడం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు మద్దతు తెలపాలని కోరారు.

జెవి చలపతిరావు మాట్లాడుతూ.. కొంతమందికి మాత్రమే ఇండ్లు కట్టించి సమస్య పరిష్కారమైందని ప్రభుత్వం భావించడం అన్యాయమన్నారు. కేవలం 400 మందికి గృహాలు కట్టించి మిగిలిన 700 మందిని విస్మరించడం దారుణమన్నారు. పేదల భూములు పేదలకు దక్కేవరకు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వడంతోపాటు అక్రమ కేసులన్నింటినీ ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. పేదల ఇండ్లను అక్రమంగా కూల్చేసిన అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు.

ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర నాయకులు బోస్‌, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, ఎంసీపీఐయూ రాష్ట్ర నాయకులు వరి కుప్పల వెంకటన్న, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాజా రమేష్‌, జర్నలిస్టులు రఘు, దాసరి శ్రీనివాస్‌ సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వెంకటేశ్వరరావు, ఆవూరినూరి మధు, గోవర్ధన్‌, వి.సంధ్య జి.ఝాన్సీ, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -