Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకూల్చిన చోటే ఇండ్లివ్వాలి

కూల్చిన చోటే ఇండ్లివ్వాలి

- Advertisement -

వెలుగుమట్ల భూదాన్‌ బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుంది
గతంలో ఇండ్లు కూల్చేందుకు బీఆర్‌ఎస్‌ పాపాలను కడుక్కునే యత్నం
ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఖమ్మంలోని అంబేద్కర్‌ భవన్‌లో వెలుగుమట్ల బాధితులకు పరామర్శ
కవితతో పాటు భూదాన్‌ నిర్వాసితుల అరెస్టు, విడుదల
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:

వెలుగుమట్ల భూదాన్‌ బాధితులకు కూల్చిన చోటే ఇండ్లు కట్టించి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి, నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని అన్నారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదని.. అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు. ఖమ్మంలోని అంబేద్కర్‌ భవన్‌లో వెలుగుమట్ల బాధితులను ధర్మ సమాజ్‌ పార్టీ అధ్యక్షులు విశారదన్‌ మహారాజ్‌తో కలిసి కల్వకుంట్ల కవిత సోమవారం పరామర్శించారు. తెలంగాణ జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్‌ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా అంబేద్కర్‌ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం ఖమ్మం ఆర్డీవో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పిల్లల ఎగ్జామ్స్‌ సమయంలో తల్లితండ్రులు ఎంతో ఆందోళనతో ఉన్నారని తెలిపారు. ‘నేను ఏదో మిమ్మల్ని చూసి వెళ్లటానికి ఇక్కడకు రాలేదు. మీ సమస్యలు సావదానంగా విని.. వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించేందుకు వచ్చాను’ అని అన్నారు. గతంలో ఇండ్లు కూల్చేసే ప్రయత్నం చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు భోజనాలు, హెల్త్‌ క్యాంప్‌లు పెట్టి పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేశారని తెలిపారు. కలెక్టర్‌ ఒక్క రోజు కూడా రాకపోవడం దారుణమని అన్నారు. ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే ఒక్కరికి కూడా సోయిలేదన్నారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలపై జులుం నడుస్తోందని, పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదాన్‌ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి అని తెలిపారు.

కవిత అరెస్టు.. విడుదల
వెలుగుమట్ల బాధితుల పక్షాన ధర్నాకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెను ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు, నాయకులు, వెలుగుమట్ల బాధితులను రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవిత సహా మహిళా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు గాయపడగా.. మరికొందరు సొమ్మసిల్లిపడిపోయారు. తోపులాటలో గాయపడ్డ బాధితురాలు లలితను వెంటనే ఆస్పత్రికి తరలించాలని కవిత డిమాండ్‌ చేశారు. పోలీసుల తీరుపై జాగృతి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా మహిళలను ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై మహిళా కమిషన్‌కు నేతలు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -