– సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో అమ్మకానికి పెట్టిన హౌసింగ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి శనివారం నర్సిరెడ్డితోపాటు టీపీఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం లేఖ రాశారు. ఆయా మండలాల్లోని హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఆరు స్థలాలను నోటిఫికేషన్ 11 ద్వారా అమ్మకానికి పెట్టారని తెలిపారు. కుత్బుల్లాపూర్ మండలంలో 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుంటే, 166 ప్రయివేటు పాఠశాలలున్నాయని వివరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేక చాలా మంది తల్లిదండ్రులు ప్రయివేటు ఉన్నత పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మకానికి పెట్టిన ఒక స్థలం పాఠశాలకు పనికి వస్తుందని నోటీసులో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆ స్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మిస్తే కనీసం వెయ్యి మందికిపైగా విద్యార్థులకు చదువు అందించొచ్చని తెలిపారు. మహేశ్వరం మండలంలో 15 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 30 ప్రయివేటు ఉన్నత పాఠశాలలున్నాయని వివరించారు. ఈ మండలంలో నాలుగు స్థలాలు అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఏదో ఒక స్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మిస్తే విద్యార్థులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ రంగంలో అదనంగా ప్రభుత్వ పాఠశాలలు స్థాపించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను పాఠశాలల స్థాపనకు కేటాయించాలని కోరారు.
హౌసింగ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ బడుల నిర్మాణానికి వాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES