Tuesday, September 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసోషలిజం ఆర్థిక మాంద్యాన్ని ఏ విధంగా నివారించగలుగుతుంది?

సోషలిజం ఆర్థిక మాంద్యాన్ని ఏ విధంగా నివారించగలుగుతుంది?

- Advertisement -

భారతదేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాలంలో పలువురు కార్యకర్తలు సోషలిజం వైపు ఆకర్షితులయారు. ఒకవైపున పెట్టుబడిదారీ ప్రపంచం యావత్తూ మహామాంద్యంలో పడి భారీ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూంటే, సోవియట్‌ యూనియన్‌ మాత్రం మహామాంద్యం ప్రభావం ఏమీ పడకుండా ముందుకు సాగింది. ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపించడంతో ఆ కార్యకర్తలు సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. అలా సోషలిజం వైపు వచ్చినవారిలో కామ్రేడ్‌ ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఒకరు. ఆ సంగతి ఆయనే పేర్కొన్నారు. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలోనే అంతర్గతంగా ఉన్న ఏదో ఒక లక్షణం వలన అది ఆర్థిక మాంద్యాన్ని నివారించగలుగుతోందని వారు భావించారు. అదే విధంగా వ్యవస్థ మొత్తంగా అధికోత్పత్తి జరిగే పరిస్థితిని కూడా సోషలిజం నివారించగలుగు తోందని వారు గుర్తించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈరెండు వ్యవస్థలకూ తేడా ఎక్కడుంది?
అందుబాటులో ఉన్న మొత్తం ఉత్పత్తి సాధనాలను అన్నింటినీ పూర్తి సామర్ధ్యం మేరకు వినియోగించి గరిష్ట స్థాయి ఉత్పత్తి సాధించినప్పుడు అది ఆనాటి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు అధికోత్పత్తి సమస్య తలెత్తినట్టు పరిగణిస్తాం. అందుచేత ఈ పరిస్థితిని నివారించడానికి ఉత్పత్తి జరిగేచోట్ల అవసరం లేని ఉత్పత్తుల జాబితాలు చేరుతాయి. వాటి ఆధారంగా ఉత్పత్తులను పరిమితం చేస్తారు. మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో అంత మేరకే సరుకులు ఉత్పత్తి అయేట్టు చూస్తారు.

కార్మికులకు డబ్బు రూపంలో చెల్లించే జీతాలు, ధరలు రెండూ ఎప్పటికప్పుడు మార్చుకోదగ్గట్టు ఉంటే అధి కోత్పత్తి సమస్య తలెత్తకుండా నివారించవచ్చునని బూర్జువా ఆర్థిక పండితులు అంటారు. వారి వాదన ఈ విధంగా ఉంటుంది: అధికోత్పత్తి జరిగి సరుకులు చెల్లుబాటు కాకుండా మిగిలిపోయినప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది. దాని వలన కార్మికులకు చెల్లించే వేతనాలు తగ్గుతాయి. అప్పుడు మార్కెట్‌లో ఉన్న సరుకుల ధరలు తగ్గి దాని వలన ప్రజల దగ్గర ఉండే నగదు విలువ పెరుగుతుంది. అప్పుడు వారు మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దాని వలన మొత్తంగా చూసినప్పుడు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగి పూర్తి సామర్ధ్యం తో ఉత్పత్తి మళ్ళీ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ ఉత్పత్తికి తగిన డిమాండ్‌ కూడా ఏర్పడుతుంది. ఐతే ఇది కొత్త రేట్లతో వేతనాలు పునర్‌ నిర్ణయం చబడేందుకు, సరుకుల ధరలు కొత్తగా నిర్ణయించబడేందుకు దారితీస్తుంది. అందుచేత పూర్తి ఉత్పత్తి సామర్ధ్యం మేరకు ఉత్పత్తి సాగకపోవడానికి, ఉపాధి పూర్తి స్థాయిలో కల్పించబడకపోవడానికి కారణం కార్మికుల వేతనాలు, సరుకుల ధరలు ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా లేకపోవడమే కారణం అని వారంటారు. క్లుప్తంగా చెప్పాలంటే, మార్కెట్లను వాటివరకూ అవి నడుచుకునేట్టు వదిలిపెట్టకుండా నియంత్రించడం వల్లే అధికోత్పత్తి సమస్య వస్తుందని వారు వాదిస్తారు. ఇలా జరగడానికి కారణం కార్మిక సంఘాలు ఉనికిలో ఉండడమేనని, ఆ సంఘాలు కార్మికుల వేతనాలను ఒక స్థాయి కన్నా తక్కువకు పడిపోకుండా అడ్డుపడతాయని, ఆ విధమైన జోక్యం కారణంగానే అధికోత్పత్తి ఒకవైపు, భారీ నిరుద్యోగం మరోవైపు తలెత్తుతాయని వారు అంటారు. అందుచేత అధికోత్పత్తి సమస్యను పరిష్కరిం చాలంటే ముందు కార్మికసంఘాలు లేకుండా చేయాలని, అప్పుడే మార్కెట్లు స్వేచ్ఛగా తమ పని తాము చేయగలుగు తాయని వారు చెప్తారు. మార్గరెట్‌ థాచర్‌ తదితరులు చెప్పినది ఇదే.

అయితే ఈ బూర్జువా ఆర్థిక పండితులు చెప్పిన సిద్ధాంతం యావత్తూ ఒట్టి బూటకం మాత్రమే. అధికోత్పత్తి సమస్యను పరిష్కరించడానికి కార్మికుల వేతనాలను తగ్గించడం, సరుకుల ధరలను తగ్గించడం వంటి చర్యలు చేపడితే అది ఉత్పత్తిని పెంచడం, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి ఫలితాలకు దారి తీయదు సరికదా, పెట్టు బడిదారీ ఆర్థిక వ్యవస్థలో వినాశకర పరిణామాలకు దారితీస్తుంది. అనేక పరిశ్రమలు రుణాలు తీసుకుని పని చేస్తాయి. ఈ రుణాలు డబ్బు రూపంలోనే లెక్కించబడతాయి. ఒకసారి వేతనాలతోపాటు సరుకుల ధరలు కూడా తగ్గి పోతే అప్పుడు ఈ పరిశ్రమలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు ఆ పరిశ్రమలు తాము చెల్లించవలసిన రుణా లను తిరిగి చెల్లించలేని స్థితిలో పడిపోయి వారిలో చాలామంది దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత కార్మికుల వేతనాలను, సరుకుల ధరలను తగ్గించడం వంటి చర్యలు డిమాండ్‌ను పెంచలేవు సరికదా ఉపాధి అవకా శాలు తగ్గిపోతాయి. చాలా పరిశ్రమలు మూత పడడం వలన ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒకవేళ ధరలు తగ్గి జీతాలు మాత్రం తగ్గకుండా యూథాతథంగా కొనసాగితే అప్పుడు నిస్సందేహంగా డిమాండ్‌ పెరుగుతుంది. కాని పరిశ్రమల లాభాలు తగ్గిపోతాయి. అందుకే ఈ పరిష్కారానికి పరిశ్రమలు ఒప్పుకోవు. పైగా కొన్ని పరిశ్రమలకు నష్టాలు కూడా వస్తాయి. అప్పుడవి మూతబడతాయి. దాని వలన అటు ఉత్పత్తి, ఇటు ఉపాధి రెండూ తగ్గుతాయి. మొత్తమ్మీద చూస్తే పెట్టుబడివారీ వ్యవస్థలో అధికోత్పత్తి సమస్యను మార్కెట్‌ యంత్రాంగం ద్వారా ఎన్నటికీ పరిష్కరించలేం.

సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ ఉత్పత్తి సాధనాలన్నీ సామాజికపరంగానే ఉంటాయి. అంటే ప్రభుత్వ యాజమాన్యంలోనే పరిశ్రమలన్నీ నడుస్తాయి. అన్ని పరిశ్రమల లాభాలూ ప్రభుత్వానికే చెందుతాయి. అందుచేత ఏదో ఒక పరిశ్రమకు లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా అన్నది ఆ పరిశ్రమ యజమానికి, అంటే ప్రభు త్వానికి పెద్ద సమస్యగా మారదు. మొత్తం మీద అన్ని పరిశ్రమలనూ కలిపి చూసుకున్నప్పుడు తగినంత లాభం వచ్చిందా లేదా అన్నదే ప్రధానం ఔతుంది. అక్కడ నష్టాలు వచ్చినంత మాత్రాన పరిశ్రమను మూసివేయరు. అక్కడ ప్రభుత్వం అన్ని పరిశ్రమలనూ వాటి పూర్తి సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేయమని ఆదేశించవచ్చు. అదే సమయంలో కార్మికుల వేతనాలను తగ్గించకుండా యధాతథంగా కొనసాగిస్తూ సరుకుల ధరలను తగ్గించవచ్చు, తద్వారా మార్కెట్‌ డిమాండ్‌ ను పెంచి సరుకులన్నీ చెల్లిపోయేట్టు చేయవచ్చు. ఈ క్రమంలో కొన్ని పరిశ్రమలకు నష్టం కూడా రావచ్చు. లాభాలార్జించే పరిశ్రమల నుండి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. నష్టాలు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి ఆదుకుంటుంది. మొత్తం మీద పరిశ్రమలన్నీ పూర్తి సామర్ధ్యంతో పని చేస్తాయి. ఇలా పూర్తి సామర్ధ్యంతో ఉత్పత్తి చేసినప్పుడు లాభాలను ఆర్జించే పరిశ్రమల లాభాలు బాగా పెరుగుతాయి. అవి నష్టాలు వచ్చే పరిశ్రమల వలన బడ్జెట్‌ కు కటిగే లోటును సైతం భర్తీ చేయగలుగుతాయి. దేశ బడ్జెట్‌ ఎప్పుడూ లోటులో పడదు.

ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాం? పెట్టుబడిలో పెరుగుదల ఉన్నంత కాలమూ ఆర్థిక వ్యవస్థలో పొదుపు కూడా పెరుగుతూనే వుంటుంది (ఇక్కడ విదేశీ పెట్టుబడులను పక్కన పెడదాం). కార్మికులకు చెల్లించే వేతనాలను వారు పూర్తిగా ఖర్చు చేసేస్తారని, పరిశ్రమల నుంచి వచ్చే లాభాలన్నీ పొదుపు రూపంలో ప్రభుత్వం దగ్గర చేరుతాయని అనుకుంటే, ఉత్పత్తిని పెంచడానికి పెట్టే పెట్టుబడులు అన్నీ అంతిమంగా లాభాలు పెరగడానికి దారి తీస్తాయని బోధపడుతుంది. మొత్తం మీద చూసినప్పుడు లాభాలార్జించే సంస్థలు నష్టాలలో ఉండే సంస్థల నష్టాలను అధిగమించే స్థాయిలో లాభాలను సాధిస్తాయి. అందుచేత సోషలిస్టు సమాజంలో అన్ని పరిశ్రమలనూ వాటి వాటి పూర్తి ఉత్పత్తి సామర్ధం మేరకు ఉత్పత్తి చేసేలా నడిపించవచ్చు, వాటిలో నష్టాలొచ్చే పరిశ్రమలకు సబ్సిడీలు కూడా అందించవచ్చు.

దీన్ని బట్టి సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ తన పూర్తి ఉత్పత్తి సామర్ధ్యంతో పని చేయగలుగుతుంది అని స్పష్టం ఔతోంది. ఏ పరిశ్రమకు ఆ పరిశ్రమ విడివిడిగా లాభాలను ఆర్జించితీరాలన్న నియమం లేదు. ఐతే సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూడా మార్కెట్‌లో డిమాండ్‌లో ఎగుడుదిగుడులు ఉంటాయి. ఎందుకంటే పెట్టే పెట్టుబడులలో ఎక్కువ తక్కువలు చోటు చేసుకుంటాయి. దానికి ఉన్న కారణాలలో ఒక ముఖ్యమైన కారణం ఇలా ఉంటుంది: సోష లిస్టు నిర్మాణం ప్రారంభం అయినప్పుడు పరిశ్రమల స్థాపనకు కావల్సిన యంత్రాల కోసం, పరికరాల కోసం ఎక్కు వగా పెట్టుబడులు అవసరం అవుతాయి. కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ యంత్రాలు, పరికరాలు పాతబడిపోయి కొత్త వాటి కోసం మళ్లీ ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతాయి. ఆ విధంగా పెట్టుబడుల్లో ఎక్కువ తక్కువలు చోటు చేసుకోవడం అనేది స్థూల డిమాండ్‌లో పెద్దగా మార్పులకు దారి తీయదు. ఎందుకంటే సరుకుల ధరలు (కార్మికుల వేతనాలతో సాపేక్షంగా పోల్చినప్పుడు) పెట్టుబడులు తగ్గినప్పుడు తగ్గుతాయి. అప్పుడు డిమాండ్‌ పెరుగుతుంది. అదే పెట్టుబడులు పెరిగినప్పుడు దానితోబాటు డిమాండ్‌ కూడా పెరుగుతుంది. మొత్తం మీద మార్కెట్‌లో డిమాండ్‌ ఎప్పుడూ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్ధ్యానికి అనుగుణంగా కొనసాగుతూ వుంటుంది.

ఇదేదో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అమూర్తమైన సిద్ధాంతం వంటిది కాదు. ఈ విధంగా సోవియట్‌ యూనియన్‌లోను, తర్వాత తూర్పు యూరప్‌ దేశాలలోను జరిగింది. ఆ దేశాల్లో పెట్టుబడుల్లో సంభవించే ఎక్కువ తక్కువల వలన మార్కెట్‌లు పెద్దగా మార్పులకు లోనవలేదు. అదే పెట్టుబడిదారీ వ్యవస్థలోనైతే, పెట్టు బడుల్లో ఎగుడు దిగుడులు పలు దొంతరలలో ప్రకంపనలకు దారితీస్తాయి. అదే సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఎగుడుదిగుడులనైనా మార్కెట్‌ డిమాండ్‌ సమస్థితికి తీసుకువస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పూర్తి ఉత్పత్తి సామర్ధ్యంతో నడుస్తుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడులలోని ఎగుడు దిగుడులు అదే మాదిరి ఎగుడు దిగుళ్లు వినిమయంలో కూడా ఏర్పడేందుకు దారితీస్తాయి. అదే సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులలోని ఎగుడుదిగుళ్ల దిశకు ప్రతికూల దిశలో వినిమయంలో మార్పులు జరుగుతాయి. తద్వారా ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోవడం సాధ్యమౌతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం విడివిడిగా ఉండే ప్రయివేటు వ్యక్తులది కావడం చేత అక్కడ డిమాండ్‌ తగ్గితే అప్పుడు నేరుగా ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఆ పెట్టుబడి దారులలో కొంతమంది గుత్తాధిపత్యం కలిగివున్నందున వాళ్లు డిమాండ్‌ తగ్గినా సరుకుల ధరలు తగ్గకుండా మార్కెట్‌ను అదుపు చేస్తారు. అప్పుడు కొంతమంది చిన్న పెట్టుబడిదారులు నష్టపోయి రంగంనుండి తప్పుకుంటారు. దాని వలన ఉత్పత్తి తగ్గుతుంది. అందుచేత పెట్టుబడిదారీ విధానంలో డిమాండ్‌ తగ్గితే అనివార్యంగా ఉత్పత్తి తగ్గు తుంది. అదే సోషలిజంలోనైతే ఆ తగ్గిన డిమాండ్‌ పర్యవసానాన్ని ఆర్థిక వ్యవస్థ ఇముడ్చుకుని ఉత్పత్తి యధాతథంగా పూర్తి స్థాయిలోనే కొనసాగేట్టు చూస్తుంది.

ప్రముఖ మార్క్సిస్టు ఆర్థిక వేత్త, పోలండ్‌కు చెందిన మిచల్‌ కాలెక్కి పెట్టుబడివారీ వ్యవస్థకు, సోషలిస్టు వ్యవస్థకు తేడాను ఈ విధంగా చెప్పాడు.”పెట్టుబడిదారీ విధానంలో ఎప్పుడూ డిమాండ్‌కు లోటు ఉంటుంది. సోష లిజంలో సరఫరాకు లోటు ఉంటుంది.” అందుచేత పెట్టుబడివారీ విధానంలో డిమాండ్‌ పెరిగితే దానికి అనుగు ణంగా ఉత్పత్తి పెరుగుతుంది. అదే సోషలిజంలోనైతే ఎప్పుడూ ఉత్పత్తి పూర్తి సామర్ధ్యంతో కొనసాగుతూ వుంటుంది కనుక డిమాండ్‌ పెరిగితే ధరలు పెరుగుతాయి. సోషలిజంలో నిరుద్యోగం అనేది ఉండదు. కనుక డిమాండ్‌ పెరిగిన ప్పుడు అదనంగా ఉద్యోగులను నియమించి ఉత్పత్తిని పెంచడం అనేది వెంటవెంటనే సాధ్యం కాదు. కోరుకున్నవారందరికీ ఉపాధి కల్పించగలగడం అనేది పాత సోషలి స్టు సమాజాలు సాధించిన గొప్ప విజయం. అటువంటి విజయాన్ని ఈ ఆధునిక కాలంలో ఇంతవరకూ ఎవరూ చేరుకోలేక పోయారు.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -