సాగు భూములపై తహసీల్దార్ తప్పుడు నివేదిక
బెటాలియన్ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
బాధిత రైతులతో కలిసి భూముల పరిశీలన
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
తహసీల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా పేదల భూములను పోలీస్ బెటాలియన్‌కు కేటాయించడం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ఎంత మాత్రం తగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రం సర్వే నెంబర్ 255లోని భూములను సోమవారం నాయకులు, బాధిత రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. తమ భూములను మీరే కాపాడాలని బాధిత రైతులు ఆయన్ను వేడుకున్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) అండగా ఉంటుందని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ సాగుకు పనికిరాని భూమి కాదన్నారు. 144 ఎకరాలున్న ఈ భూమిలో సుమారు 120 మంది పేదలు అర ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు పట్టాలు కలిగి ఉండి పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ భూమిలోనే మరో 30 కుటుంబాలకు చెందిన గాంధీనగర్ తండా ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఇలాంటి సాగు భూములను సాగుకు పనికిరాని భూములుగా తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్న తహసీల్దార్ పేదలకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తున్నారని విమర్శించారు. ఈ భూముల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటును రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ బెటాలియన్ రద్దు కోసం కలిసొచ్చే పార్టీలతో సీపీఐ(ఎం) ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదల భూములు గుంజుకునే కార్యక్రమాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. పోలీసు బెటాలియన్ ఏర్పాటును రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటన చేయకపోతే ఆయన్ను ఈ ప్రాంతంలో తిరగనివొవ్వద్దని రైతులకు పిలుపునిచ్చారు. పోలీసు బెటాలియన్ ఏర్పాటుకు సీపీఐ(ఎం) వ్యతిరేకం కాదన్నారు. మరోచోట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే డబ్బులు పెట్టి ప్రయివేట్ భూములను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసచారి, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ఈ.ముత్యాలు, పార్టీ నాయకులు దొంతగొని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల నరసింహ, రైతుసంఘం మండల కార్యదర్శి కొమ్ము మల్లేష్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు చిలువేరు అంజయ్య, నాయకులు రాచకొండ కృష్ణయ్య, ఉడుత గాలయ్య, గాజుల అంజయ్య, దొంతగోని శంకరయ్య పాల్గొన్నారు.



