సిట్ చీఫ్ సజ్జనార్ తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం
పోలీసుల పని విచారణ మాత్రమే… తీర్పులివ్వడానికి న్యాయమూర్తులా?
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వకముందే సిట్ చీఫ్ సజ్జనార్ అధికారికంగా ‘ఇల్లీగల్’ అని ప్రకటించడం బాధ్యతారాహిత్యమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కోర్టు తీర్పు రాకముందే ఇల్లీగల్ అని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని విచారణ చేయడం మాత్రమేనని పేర్కొన్నారు. తీర్పులివ్వడానికి వారు న్యాయమూర్తులా? అని ప్రశ్నించారు. విచారణ ఇంకా నడుస్తుండగానే ఇల్లీగల్ అని నిర్ణయించారంటే పోలీసులు ముందే ఒక నిర్ణయానికి వచ్చారా?అని తెలిపారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌కు గౌరవం ఇవ్వకపోవడమేనా? సంస్కారం అని ప్రశ్నించారు. ఖాకీ డ్రెస్ వేసుకుని రాజకీయ ఎజెండాలు అమలు చేయడం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రూల్స్‌కు విరుద్ధమని సజ్జనార్‌కు తెలియదా?అని అడిగారు. తీర్పులు చెప్పాల్సింది కోర్టులనీ, పోలీసులు కాదని సూచించారు.
ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదనేది కనీస న్యాయ సూత్రమని వివరించారు. ఈ న్యాయ సూత్రాన్ని పాటించకపోవడం శోచనీయమని విమర్శించారు. దీన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుల్లో స్పష్టం చేస్తుందని గుర్తు చేశారు. పోలీసుల పని కేవలం దర్యాప్తు చేయడం మాత్రమేననీ, విచారణ దశలోనే ఒక అంశాన్ని చట్టవిరుద్ధమంటూ ప్రకటించడానికి వారు న్యాయమూర్తులా?అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 5(2), ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందనే విషయం ఆయనకు తెలియదా?అని తెలిపారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే అది కోర్టు విచారణ ద్వారానే తేలాలి తప్ప, పోలీసుల అధికారిక ప్రకటనల ద్వారా కాదని స్పష్టం చేశారు. సజ్జనార్ విడుదల చేసిన అధికారిక ప్రకటన (ట్విట్టర్)లో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడటం చూస్తుంటే, దర్యాప్తు ఫలితంపై వారు ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోందని తెలిపారు. సీనియర్ అధికారుల నుంచి ఆశించే నిష్పాక్షికతకు, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారం ఇది తప్పు అని తెలియదా?అని ప్రశ్నించారు.
ఇది రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన అంశంలో ఇలాంటి తొందరపాటు ప్రకటనలు చూస్తుంటే ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అని స్పష్టమవుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. దర్యాప్తు అనేది నిష్పాక్షికంగా ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందని గుర్తు చేశారు. సిట్ చీఫ్ సజ్జనార్ విచారణకు ముందే దోషులు ఎవరో నిర్ణయిస్తే చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. ఆయన ట్విట్టర్ ప్రకటనలో కనీసం కేసీఆర్‌ను ప్రతిపక్ష నాయకులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని అడిగారు. మాజీ ముఖ్యమంత్రికి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకపోవడం ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు.



