ఈ మధ్య కాలంలో రకరకాల సమస్యలతో పిల్లలు పుట్టడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటప్పుడు ఇద్దరూ అవసరమైన చికిత్స చేయించుకోవాలి. కానీ కాలం ఎంత మారుతున్నా చాలా మంది పిల్లలు పుట్టకపోతే సమస్య ఆడవాళ్లదే అనే భావనలో ఉంటున్నారు. పరీక్షలు, చికిత్స ఆమెకే చేయిస్తున్నారు. మగవాడిలో సమస్య ఉన్నా అంగీకరించడం లేదు. అతనే కాదు కుటుంబ సభ్యులు కూడా సమస్య అతనిలోనే ఉందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీ కోసం…
ఫాతిమాకు 28 ఏండ్లు ఉంటాయి. ఆమెకు సలీమ్‌తో పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఇద్దరూ అంగీకరించే పెండ్లి చేసుకున్నారు. రెండేండ్లు అయినా ఇంకా పిల్లలు కావడం లేదు అంటూ ఫాతిమా అత్త రోజూ ఆమెను సూటిపోటి మాటలతో బాధపెడుతుంది. దాంతో ఫాతిమా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పింది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు చేసి చికిత్స కూడా చేశారు. ఏడాది అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. దాంతో డాక్టర్ సలీమ్‌ను తీసుకురమ్మని చెప్పారు. అతను ఆస్పత్రికి రావడానికి ఇష్టపడలేదు. అయినా ఏదో చెప్పి ఒప్పించి ఆస్పత్రికి తీసుకెళ్లింది ఫాతిమా. వైద్య పరీక్షల్లో అతనికి సమస్య ఉన్నట్టు తేలింది. అతనికి పిల్లలు కలిగే అవకాశం లేదు. దాంతో ఫాతిమా ఐయూఐ, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంది. కానీ దానికి కూడా సలీమ్ పనికి రాడు అని తేలింది. దాంతో ఏం చేయాలో ఫాతిమాకు అర్థం కాలేదు.
భర్తను వదిలేసి వేరే పెండ్లి చేసుకొమ్మని అందరూ సలహా ఇచ్చారు. కానీ ఫాతిమాకు అది ఇష్టం లేదు. అందుకే ‘మనం ఒక పాపనో, బాబునో దత్తత తీసుకుందాం. పిల్లలు లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది’ అంది ఫాతిమా. దీనికి సలీమ్ ఒప్పుకున్నా అతని కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోలేదు. సలీమ్ తల్లి అయితే పెద్ద గొడవ చేసింది. ‘నా కొడుక్కి పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు. కచ్చితంగా పుడతారు. ఫాతిమాలోనే ఏదో లోపం ఉంది. మా వాడు మగాడు వాడిలో లోపం ఎందుకు ఉంటుంది. దత్తతకు నేను ఒప్పుకోను. ఎవరికో పుట్టిన బిడ్డను నేను ఎలా అంగీకరిస్తాను? అంతగా అయితే నా కొడుక్కు ఇంకో పెండ్లి చేస్తాను. అంతేకాని దత్తతకు మాత్రం అస్సలు ఒప్పుకోను’ అని ఫాతిమాను ఇంట్లో నుండి గెంటేసింది. సలీమ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఫాతిమా పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు అవుతుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. అయితే ఈ మధ్యనే తెలిసిన విషయం ఏమిటంటే సలీమ్‌కి ఇంకో పెండ్లి చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెండ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. దాంతో ఫాతిమా వెంటనే భర్తకు ఫోన్ చేసింది.
దానికి అతను ‘నీకు పిల్లలు పుట్టరు కాబట్టి నేను ఇంకో పెండ్లి చేసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది’ అన్నాడు. ‘మరి నా పరిస్థితి ఏంటి, ముందు నాకు ఓ దారి చూపించి తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో’ అంది ఫాతిమా. ‘నువ్వు కూడా ఆమెతో పాటు నా భార్యగా ఉంటావు’ అన్నాడు. దాంతో ఆమె తెలిసిన వాళ్లు చెబితే ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చి ‘నా భర్త నా జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇన్ని రోజుల నుండి ఏదో ఒక రోజు నన్ను తీసుకెళతాడనే నమ్మకం ఉంది. కానీ ఇంకో పెండ్లి చేసుకోడానికి నిర్ణయించుకున్నాడు. మీరే నాకు న్యాయం చేయండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత సలీమ్‌ను, అతని తల్లిని పిలిపిస్తే ఫాతిమాను తీసుకెళ్లడానికి ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు. తన కొడుకులోని లోపాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. దాంతో మేము ‘ముందు మీరు మీ కొడుక్కు పరీక్షలు చేయించి అప్పుడు మాట్లాడండి.
సమస్య అతనిలో ఉంచుకొని ఎన్ని పెండిండ్లు చేసినా పిల్లలు ఎలా పుడతారు. నిజాన్ని ఒప్పుకోకుండా సలీమ్‌కు ఇంకో పెండ్లి చేస్తే మీపై కేసు పెట్టాల్సి వస్తుంది. ఫాతిమా మంచిది కనుక అతనిలోని లోపాన్ని అర్థం చేసుకొని పిల్లల్ని దత్తత తీసుకుందామంది. కానీ మీరు ఒప్పుకోకుండా అనవసరంగా అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఇప్పటికైనా మీరు మీ కొడుకులోని లోపాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఫాతిమాకు నష్టపరిహారం ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు’ అన్నాము. దాంతో సలీమ్ తల్లి ఇక మాట్లాడలేకపోయింది. ‘నా కొడుక్కి పిల్లలు పుట్టరని తెలిస్తే బంధువుల్లో మా పరువు పోతుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను’ అంది. దానికి మేము ‘ఇందులో పరువు పోవడానికి ఏముంది. మనుషులన్న తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని గుర్తించి అంగీకరించి ఎలా బయటపడాలో ఆలోచించాలి.
పిల్లల్ని దత్తత తీసుకోవడానికి సలీమ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాబట్టి మీరు అడ్డు చెప్పకుండా ఉంటే మంచిది. ఎవరి పిల్లలైతే ఏంటీ మీ దగ్గర పెరిగితే మీ పిల్లలే అవుతారు. ఈ రోజుల్లో కూడా మీరు ఇలా మాట్లాడితే ఎలా?’ అన్నాము. దాంతో ఆమె కూడా దత్తతకు ఒప్పుకుంది. సలీమ్‌తో ‘ముందు మీరు ఆర్థికంగా కొంత స్థిరపడండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి. అప్పుడు పాపనో, బాబునో దత్తత తీసుకోండి. ఇప్పుడే తొందరపడితే ఆర్థిక ఇబ్బందులతో కొత్త సమస్యలు వస్తాయి. ఇద్దరూ ఉద్యోగం చేయండి. అప్పుడు కొంత డబ్బు ఆదా చేయవచ్చు. దాంతో పిల్లలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచవచ్చు’ అని చెప్పాము. సలీమ్ తల్లితో మాత్రం ఆలోచనా విధానం మార్చుకొని, లోపాలను అంగీకరించడం నేర్చుకోమని కాస్త గట్టిగానే చెప్పాము. దాంతో ఆమె కూడా దత్తతకు మనస్ఫూర్తిగానే అంగీకరించింది.
వై వరలక్ష్మి,
9948794051
లోపం ఆమెదే అంటే ఎలా?
- Advertisement -
- Advertisement -



