Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎట్లుండె తెలంగాణ.. ఎట్లయ్యిందో

ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయ్యిందో

- Advertisement -

కాంగ్రెస్‌ వచ్చాక అభివృద్ధి ఖతం
అమలుకాని హామీలతో ప్రజలు ఆగం..
ఇచ్చింది 30పైసలైతే.. ఎగ్గొట్టింది 70 పైసలు :
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు
నవతెలంగాణ-గజ్వేల్‌ రూరల్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి ఖతమైందని, బతుకుల తెలంగాణను గతుకుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అమలు కాని హామీలతో ప్రజలను ఆగం చేశారన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ ఎస్‌ఎల్‌ఎన్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు పనుల్లేకుండా, అభివృద్ధి లేక అల్లాడుతున్నారన్నారు. 30 పైసల అభివృద్ధి చేసి.. 70 పైసల అభివృద్ధి ఎగ్గొట్టిన మహోన్నత వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అంటూ విమర్శించారు. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 పరిషత్‌లు బీఆర్‌ఎస్‌ సొంతం చేసుకోబోతుందన్నారు. జిల్లాలోని 26 మండలాల్లో మెజారిటీ స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉందనీ, అందరూ కలిసి ఒక కుటుంబంగా పని చేయాలన్నారు. ఆత్మ విశ్వాసం ఉండాలి కానీ, అతి విశ్వాసం ఉండకూడదని తెలిపారు. ఎట్లుండె తెలంగాణ, ఎట్లయ్యిందో అనేది ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పాలని కార్యకర్తలకు హరీశ్‌రావు తెలిపారు. చెత్త ఎత్తెటోళ్లు లేరు, బుగ్గలు వేసేవాళ్లు లేరు, మంచి నీళ్ల పైపు పగిలిపోతే అతుకపెట్టేవాడు లేడన్నారు. రాహుల్‌ గాంధీ పత్తాలేడని, రేవంత్‌రెడ్డి పోలీసు వలయం పెట్టుకుని తిరుగుతున్నడని ఆరోపించారు. కొత్తగా ఒక్క పింఛన్‌ ఇవ్వలేదని, కాని రకరకాల కారణాలు చెప్పి 2లక్షల పింఛన్లు కోత పెట్టిండని తెలిపారు. యూరియా కోసం పాస్‌ పుస్తకాలు, చెప్పులు లైన్‌లో పెట్టాల్సిన దుస్థితి మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరావృతం చేసిందన్నారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చని నాడు చంద్రబాబు అన్నాడని.. కేసీఆర్‌ సీఎం అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే, ఆంధ్రాలో పది ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు రేవంత్‌ సీఎం అయ్యాక సీన్‌ మళ్లా రివర్స్‌ అయ్యిందన్నారు. అందరూ కలిసి పని చేసి, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి, నాయకులు వంటేరు ప్రతాపరెడ్డి, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -