అది చట్టవిరుద్ధం : ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తప్పుపట్టిన ఫెడరల్ జడ్జి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానాలలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మాసాచుసెట్స్‌లోని ఫెడరల్ జడ్జి తప్పు పట్టారు. అర్థవంతమైన నోటీసు ఇవ్వకుండా లేదా అభ్యంతరం తెలిపే అవకాశం ఇవ్వకుండా అక్రమ వలసదారులను హడావుడిగా మూడో దేశానికి పంపడం చట్ట విరుద్ధమని బుధవారం తీర్పు చెప్పారు. న్యాయ బద్ధంగా రక్షణ పొందేందుకు వలసదారులకు ఉన్న వెసులుబాటును ఈ చర్య ఉల్లంఘిస్తోందని ఫెడరల్ జడ్జి బ్రియాన్ మర్ఫీ స్పష్టం చేశారు.
వలసదారుల ఏరివేత పేరిట ట్రంప్ చేపట్టిన చర్యలలో భాగంగా గత సంవత్సరం మార్చిలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి కొట్టివేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తమకు తెలియని, సంబంధం లేని ప్రమాదకరమైన దేశానికి వలసదారులను పంపడం సరికాదని న్యాయమూర్తి మర్ఫీ అభిప్రాయపడ్డారు. వలసదారులకు రక్షణ కల్పించడంలో ట్రంప్ విధానం విఫలమైందని తెలిపారు. ముప్పు ఉన్నదని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియనంత కాలం వలసదారులను మూడో దేశానికి పంపడం అంగీకారయోగ్యమేనని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనతో న్యాయమూర్తి విభేదిస్తూ ‘అది మంచిది కాదు. చట్టబద్ధమూ కాదు’ అని వ్యాఖ్యానించారు. మూడో దేశానికి పంపే ముందు అర్థవంతమైన నోటీసును అందుకునేందుకు లేదా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాన్ని పొందేందుకు వలసదారులు అర్హులని తేల్చి చెప్పారు.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని న్యాయ మూర్తి మర్ఫీ కొట్టివేసినప్పటికీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆదేశాల అమలును పదిహేను రోజుల పాటు నిలిపివేశారు. గతంలో ఈ వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను జారీ చేసిన తాత్కాలిక ఇంజక్షన్ ఆదేశాన్ని గతంలో సుప్రీంకోర్టు ఎత్తివేసిందని, వలసదారులను దేశం నుంచి పంపేయడాన్ని అనుమతించిందని గుర్తు చేశారు. తమను దక్షిణ సూడాన్, ఎల్ సాల్వడార్, కోస్టారికా, గ్వాటెమాలా వంటి దేశాలకు పంపే అవకాశం ఉన్నదని, అయితే వాటి పేర్లను ఒరిజినల్ ఆదేశాలలో ప్రస్తావించలేదని కొందరు వలసదారులు దాఖలు చేసిన వ్యాజ్యం ఆధారంగా న్యాయమూర్తి ఈ రూలింగ్ ఇచ్చారు. కాగా మాసాచుసెట్స్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది.



