Friday, October 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅప్పు పుట్టేదెలా?

అప్పు పుట్టేదెలా?

- Advertisement -

అష్టకష్టాల్లో అన్నదాతలు
బ్యాంకులు నమ్మవు… సర్కారు హామీ ఇవ్వదు
నెరవేరని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యం
కాగితాలకే పరిమితమైన రిజర్వుబ్యాంకు నిబంధనలు
రైతుల ఉసురు తీస్తున్న ప్రయివేటు అప్పులు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
టీ కొట్టు పెట్టుకుంటామన్నా. టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుంటామన్నా..రరుమంటూ పరుగెత్తుకుంటూ వచ్చి రుణాలిచ్చే బ్యాంకులు…వ్యవసాయం చేస్తాం.. రుణాలివ్వండి మహాప్రభో అంటే మాత్రం ఆమడ దూరం పారిపోతున్నాయి. బ్యాంకులు తామిచ్చే రుణాల్లో పంటలకు 18 శాతం అన్నదాతల సాగు కోసం ఇవ్వాలనే నిబంధనల్ని బ్యాంకులు గాలికొదిలేశాయి. ఇచ్చే అరకొర రుణాలనూ వ్యవసాయం పేరిట భూస్వాములకు, కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి. సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. చిన్న కమతాలున్న రైతులు రూ. లక్ష లేదా రూ. రెండు లక్షలకు మించి అప్పు అడగరు.

చాలా చోట్ల బ్యాంకులు అవి కూడా ఇవ్వకుండా సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. పాత రుణాల్లో ఏవైనా కారణాలతో ఒకటి లేదా రెండు కిస్తీలు కట్టకుంటే, సామాన్య రైతుల్ని రుణ ఎగవేతదారులుగా చిత్రీకరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం చేస్తున్నా, ఆ సొమ్ము దేనికీ చాలట్లేదు. బ్యాంకులు చిన్న రుణాలు ఇచ్చేందుకు తిరస్కరిస్తుండటంతో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనేందుకు వెనుకాడట్లేదు.

కాగితాల్లోనే లక్ష్యాలు
బ్యాంకులు తమ వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి పంట రుణాలు 18 శాతం, వ్యవసాయ అనుబంధరంగాలకు (పౌల్టీ, డైయిరీ, యంత్రాలు తదితరాలు) 22 శాతం రుణాలు ఇవ్వాలి. మొత్తంగా ఈ రెండు రంగాలకు కలిపి 40 శాతం రుణాలు ఇవ్వాలనేది రిజర్వుబ్యాంక్‌ నిబంధన. దానికి అనుగుణంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) రుణ లక్ష్యాలను నిర్దేంచుకుంటుంది. కానీ ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పుడూ వంద శాతం పూర్తి చేయలేదు. పంట రుణాలు 60 నుంచి 75 శాతానికి లోపే ఉంటున్నాయి. అవీ దాదాపు కాగితాల్లో అడ్జస్ట్‌మెంట్‌ రుణాలుగానే ఉంటున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో సీఎం లేదా ఆర్థిక శాఖా మంత్రుల సమక్షంలో బ్యాంకర్లు తలలూపి, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు.

పంట రుణాలు అంటే అవి తిరిగి రావు అనే భావనలోనే బ్యాంకర్లు ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల మినిట్స్‌ ప్రకారం 2025-26 వార్షిక బడ్జెట్‌లో అన్ని రంగాలకు రూ. 7.65 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. దానిలో వ్యవసాయానికి రూ. 1.87 లక్షల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు రూ. 41,051 కోట్ల (25శాతం) రుణాలను మాత్రమే బ్యాంకర్లు ఇచ్చారు. 2024-25లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 64,940 కోట్లు కాగా, ఇచ్చింది రూ. 49,500 కోట్లు మాత్రమే. నిర్దేశించుకున్న లక్ష్య ం కంటే రూ. 15,440 కోట్లు తక్కువగా ఇచ్చారు.

పంటరుణాలు చాలా రిస్క్‌ – బ్యాంకర్లు
వ్యవసాయంలో చాలా రిస్క్‌ ఉందని బ్యాంకరు చెప్తున్నారు. ముఖ్యంగా పంట గ్యారంటీ లేదు. వచ్చిన పంటను అమ్ముకోవడం కూడా రైతులకు సవాలే. అధిక వర్షాలు, వరదలు, తుఫాన్లు, కరువు వంటి పరిస్థితులు వ్యవసాయాన్ని స్థిరంగా ఉంచలేకపోతున్నాయనే కారణాలను చూపుతున్నారు. అందువల్ల రైతుకు బ్యాంకులు రుణం ఇస్తే, వాటిని తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనే సందేహాల్ని వ్యక్తంచేస్తున్నాయి. దీనివల్లే రైతులకు రుణం ఇచ్చే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సి వస్తున్నదని బ్యాంకర్లు చెప్తున్నారు. రైతులకు భూమి హక్కు పత్రాలు సరిగా ఉండకపోవడం, భూ బదలాయింపుల్లో ఆలస్యం వంటివి రుణం అందకపోవడానికి కారణాలు కనిపిస్తున్నాయి. కొన్ని సమయాల్లో బ్యాంకులు రైతులకు అండగా ఉంటున్నప్పటికీ, ఎక్కువ సమయాల్లో రైతును ఆదుకోవడం లేదు.

లక్ష్యాలను చేరుకొనే సమయంలో ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో కచ్చితమైన బృందాలు లేకపోవడం, ఫీల్డ్‌ ఆఫీసర్ల లెక్కలేనితనం, రుణ పరిశీలన సామర్థ్యం లేకపోవడం వంటి కారణాలు కూడా రైతులకు అప్పుపుట్టకుండా చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా కొన్ని పంటల్ని మాత్రమే కొంటున్నాయి. వాటినీ సకాలంలో కొనట్లేదు. ఫలితంగా వర్షాలు, వరదలతో రైతులు పంటను నష్టపోతున్నారు. గత్యంతరం లేక రైతులు తక్కువ ధరకే దళారులకు పంటల్ని అమ్మేస్తున్నారు. దీనివల్ల పంట పెట్టుబడికి, అమ్మిన తర్వాత వచ్చిన సొమ్ముకు మధ్య భారీ అర్థిక అంతరం ఏర్పడుతోంది. రైతుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది. బ్యాంకర్లు తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తే, రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. ఆ పని జరగట్లేదు.

పంటకు సరిపడినంత రుణం అందట్లేదు
దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయ విధాన విశ్లేషకులు
సంస్థాగత పంట రుణాలు రైతులకు సరైన సమయంలో, పంటల ఖర్చులకు సరిపోయేంతగా అందట్లేదు. ఎస్‌ఎల్‌బీసీ ఇచ్చే లెక్కలకు, వ్యవసాయ శాఖ లెక్కలకు పొంతనే లేదు. రుణాలు అందక రైతులు ప్రయివేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు వడ్డీ వ్యాపారుల ప్రాబల్యం పెరిగిపోయింది. రైతులు వీరికి ఊడిగం చేయాల్సి వస్తున్నది. మార్కెట్లో పంట అమ్ముకుంటే వచ్చే అరకొర లాభాల వీరికే అప్పజెప్పాల్సి వస్తున్నది.

ప్రభుత్వ చొరవ పెరగాలి
రైతులకు పంట రుణాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వ చొరవ పెరగాలి. ప్రణాళికలు అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు రుణాలు ఇవ్వడాన్ని ప్రభుత్వం భారంగా చూడరాదు. రైతు సకాలంలో రుణాలు చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీపై రాయితీని ఇస్తాయి. కానీ బ్యాంకర్లు పంట రుణాలను బుక్‌ అర్జెంట్‌మెంట్లు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు కొత్త రుణాలు లభించట్లేదు. రైతు రుణాలపై మూడు నెలలకోసారి పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహించాలి. ఎస్‌ఎల్‌బీసీ నిర్వహించే సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి హాజరు కావాలి.
టి. సాగర్‌, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -