”ఏమీ లాభం లేదమ్మా! చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాను! ఆయన కోమాలో కెళ్ళిపోయాడు!” అని డాక్టర్ గారు విచారంగా చెప్పారు.
తులసమ్మ, కూతురు భవానీలు ఒకేసారి గొల్లుమన్నారు! ‘నాన్నా!’ అంటూ కూతురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, భార్య తులసి ‘ఏమండి’ అంటూ శోకాలు పెడుతోంది! తమ అందరికీ ఆప్త మిత్రుడైన కేశవుల్ని చుడడానికి వచ్చిన సత్యనారాయణ కూడా కన్నీళ్లు ఆపుకోలేక కర్చీఫ్ తీసుకుని కళ్ళు వొత్తుకోసాగాడు! మనవడు ఆకాష్ చిన్నపిల్లాడవడంతో ఏమైంది తెలీక వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని ఏమైందమ్మా అంటూ గోల చేయసాగాడు. వీళ్ళ గోలతో డాక్టర్‌గారి క్లినిక్‌లోని వాతావరణమంతా గంభీరంగా మారిపోయింది.
”ఆగండి!” అని డాక్టర్ గారు ఒక్క అరుపు అరిచారు. దానితో ఉలిక్కిపడి వాళ్లంతా ఏడుపులు ఆపేసి డాక్టరు వైపు ఏమిటన్నట్టు చూసారు.
”నేను చెప్పింది మీకేమైనా అర్థమైందా! అప్పుడే ఏమో అయిపోయినట్టు ఏడుపులు మొదలెట్టారు! ఆయన ఎప్పుడైనా స్పహలోకి వచ్చి మామూలు మనిషి కావచ్చు!” అని అన్నాడు.
అక్కడున్న వాళ్లందరిలో ఆ మాటకు మొహాలు కొంత వికసించాయి.
”దానికోసం మనం ఏమి చేయాలి డాక్టర్ గారు!” అని ఆతతగా అడిగింది తులసమ్మ. భర్త బతికే అవకాశం ఉందని తెలిసి మళ్లీ ఆమె ముఖంలో జీవం వచ్చింది.
”ముందు మీరంతా ధైర్యంగా వుండండి. మనం ఒక ఆఖరి ప్రయత్నం చేద్దాం. మీరంతా ఆయనకు బాగా కావలసిన వాళ్లే! ఒక్కొక్కరుగా ఆయన చెవిదగ్గర ఆయనకు ఇష్టమైన ఒకమాట చెప్పండి. ఒకోసారి ఆ మాటకు ఆయన మనసు చలించి స్పహలోకి వచ్చే అవకాశం ఉంటుంది.!” అని డాక్టర్ అన్నారు.
ఆ మాటలకు అందరు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. ముందు ఎవరు మొదలెట్టాలని మాట్లాడుకోసాగారు.
ఇంతలో డాక్టర్ గారే కల్పించుకుని ”ఎక్కువ ఆలస్యం చేయకండి! నేనే చెబుతాను” అని ”ఒరేరు చిన్నూ! నువ్వు ముందుకు రారా! తాతయ్య దగ్గరకెళ్ళి చెవిలో ఆయన కిష్టమైన మాట చెప్పు!” అని అన్నాడు డాక్టర్.
”ఆగాగు! ఏమని చెబుతావ్ నాకు ముందు చెప్పు!” అని అడిగాడు.
”అలాగే! తాతయ్య! చాకొలెట్ కొనివ్వు అని అడుగుతా!” అని అన్నాడు.
”గుడ్! అలాగే చెప్పు. గట్టిగా చెప్పాలి.!” అన్నాడు డాక్టర్.
చిన్నూ తాతయ్య పడుకున్న బెడ్ పక్కకు వెళ్లి చెవిలో ”తాతయ్య చాకొలెట్ కొనివ్వు!” అని గట్టిగా అరిచాడు. అందరు ఉపిరి బిగపట్టి, ఆతతగా కేశవులు మొహాన్నే చూస్తున్నారు. మూడుసార్లు అరిచాడు ఆ పిల్లాడు. అయినా కేశవులులో చలనం లేదు.
అందరిలో నిరాశ. అయినా డాక్టర్ మోహంలో ఏ భావం లేదు.
”సరే! నువ్వెళ్లమ్మా!” అని కూతురుకి సైగ చేసాడు.
కూతురు భవాని ఒకసారి దేవుడికి దణ్ణం పెట్టుకుని తండ్రి పడుకున్న బెడ్ దగ్గరకు వెళ్ళింది.
”నాన్న! నేను చిన్నూ వచ్చాము. ఈసారి పండగకు చీర కొనిపెడతాయన్నవుగా! షాప్‌కు వెళదాం నాన్న! ఆలస్యమైపోతోంది!” అని గట్టిగ అరిచి చెప్పింది. అదే మాట మరో రెండు సార్లు చెప్పింది. అయినా తండ్రి మోహంలో చలనం లేదు. నిరాశగా వెనక్కు వచ్చేసింది.
”సత్యనారాయణ గారు! మీరెళ్ళి ప్రయత్నించండి!” అని డాక్టర్ గారు గంభీరంగా అన్నాడు.
”ఒరేరు కేశవులు లేరా! ఆఫీస్‌కు వెళ్లే టైం అవుతోంది. తొందరగా వెళ్ళాకపోతే బస్ మిస్ అవుతుంది!” అని గట్టిగా అరిచి చెప్పాడు. ఇంకో రెండుసార్లు చెప్పినా లాభం లేదు. సత్యనారాయణ కళ్ళలో నీళ్లతో వెనుతిరిగారు.
డాక్టర్ గారు చివరగా, ”నువ్వు ప్రయత్నించమ్మ!” అని తులసితో అన్నాడు.
తులసి మొహాన సన్నటి నవ్వు విరిసింది. అది చూసి అందరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భర్త చావు బతుకుల్లో ఉంటే ఆమె మోహంలో నవ్వా! అందరికి మతిపోయినట్టయింది. అందరు ఉగ్గబట్టుకుని ఆమె ఏం చేస్తుందోని చూడసాగారు!
తులసి చెక్కుచెదరకుండా భర్త పడుకున్న బెడ్ దగ్గరకు నడిచింది.
”ఏమండి! మీరు లేవండి! మీరు కోరుకున్న ఈ పి యస్ హయ్యర్ పెన్షన్ బ్యాంకులో పడింది. తొందరగా వెళ్లి డ్రా చేసుకుని రండి!” అని గట్టిగా అరిచింది. ఆ ఒక్క అరుపుకు కేశవులు బెడ్ మీద దిగ్గున లేచి కూర్చున్నాడు.
”నిజమేనా !పెన్షన్ బ్యాంకులో పడిందా ఇప్పుడే వెళతాను” అని దిగబోయాడు.
ఇంతలో డాక్టర్ గారు పరిగెత్తుకుని వచ్చి ”ఆగండి కేశవులుగారు! మీరు హాస్పిటల్‌లో వున్నారు. ఈ సెలైన్ అయిపోయాక బ్యాంకుకు వెలుదురుగాని!” అని రెండు చేతులు పట్టుకుని బెడ్ దిగకుండా ఆపాడు.అ ందరి మొహాలలో ఆనందం వెళ్లి విరిసింది.
”ఇక గండం తప్పినట్టే అమ్మ! ఇంతకీ నువ్వు పేషెంట్‌కు చెప్పింది నాకు అర్ధం కాలేదమ్మా! అదేంటి!?” అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ తులశమ్మని!
”మా బాధ ఏమి చెప్పుకునేను డాక్టర్ గారు! మా ఆయన పనిచేసింది పెద్ద కంపెనీలోనే! వచ్చిన జీతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సంసారం ఖర్చులకే సరిపోయాయి. తీరా రిటైర్ అయ్యాక మాకు వచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు దాటటడం లేదు. అదేదో ఈ.పి.యస్-95 దిక్కుమాలిన పెన్షన్ స్కీం వుంది. దాన్ని రద్దు చేసి పెన్షన్ పెంచాలని ఏళ్లతరబడి పోరాడుతున్నారు. ఈ మధ్యనే సుప్రీమ్ కోర్టులో కూడా గెలిచారు. అయినా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెంచకుండా కుంటి సాకులు చెబుతూ సతాయిస్తూ వాయిదాలు వేస్తోంది. ఈయనకు ఆ పెన్షన్ ఎప్పుడు పెరుగుతుందాని ఒకటే ధ్యాస! తెల్లవార్లూ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌తో కలిసి తిరుగుతుంటారు. ఇందిరాపార్కు, ఈ.పి.ఓ ఆఫీస్ ధర్నాలు మీటింగులు పెడుతుంటారు. దానికోసం ఢిల్లీ దాక కూడా వెళ్లొచ్చారు. అందుకే నేను ఆ హయ్యర్ పెన్షన్ బ్యాంకులో పడిందని చెవిలో గట్టిగా అరిచా దెబ్బకు లేచి కూర్చున్నారు!” అని నవ్వుతు చెప్పిందావిడ! అందరు కేశవులు కోమా నుండి బయట పడడంతో ఊపిరి పీల్చుకుని నవ్వు మొహం పెట్టారు.
”మంచి పని చేశావమ్మా! సమయానికి నీకు ఆ విషయం గుర్తుకు రావడంతో మీ ఆయనకు పెద్ద గండం తప్పింది. ఇన్ని లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది!” అన్నారు డాక్టరుగారు.
- సత్యభాస్కర్ ఆత్కూరు, 9848391638