ఈ దేశంలో సమానత్వానికి ప్రతీక వయోజన ఓటుహక్కు మాత్రమే. ఎందుకంటే పోలైన ఓట్లను లెక్కించినప్పుడు వాటి విలువ సమానంగా ఉంటుంది. స్త్రీ, పురుష, ధనిక, పేద, పట్టణ, పల్లెటూరు, చదువుకున్న వాళ్లు, చదువులేని వాళ్లు, అధికారులు, అనధికారులు అని ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా ”ఒక మనిషికి ఒక ఓటు – ఆ ఓటుకు ఒకటే విలువ” అన్న సమానత్వ సిద్ధాంతానికి హక్కును ప్రసాదించింది కేవలం స్వతంత్ర భారత దేశం మాత్రమే. ఇది సాధ్యపడడానికి కూడా రాజ్యాంగంలో ఆ విషయాన్ని పటిష్టంగా పొందుపరచడమే. ‘చట్టం ముందు అందరూ సమానులే, న్యాయం అందరికీ ఒకేలా వెలువరించబడుతుంది, ప్రాథమిక హక్కులు అందరికీ ఒకే విధంగా అందివ్వబడతాయి, ఆదేశిక సూత్రాలు అందరికోసం వినియోగించబడతాయి’ అనేవన్ని కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నవి. కానీ వాటి అమలు ఆశ్రిత పక్షపాతంతో జరుగుతున్నది. ఇది వాస్తవం. అయితే ఓటుహక్కు మొదటినుండి తీవ్ర ప్రభావానికి గురవుతున్నది. అది ఓటర్ చేతిలో ఆయుధమే అయిన ప్పటికీ దాన్ని ఎక్కుపెట్టే విధానాన్ని ఓటర్ స్వేచ్ఛకు వదిలిపెట్టలేదు. అందుచేత ప్రతి సందర్భంలోనూ అది అన్యాక్రాంతం అవుతూనే ఉంది. ఓట్లు దొంగిలించబడుతున్నాయని, మన ఓటు అధికారాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ, ఇండియా కూటమి- పలు రాజకీయ పార్టీల సమూహం- ద్వారా జరుగుతున్న ప్రయత్నాల వల్ల ఓటు అస్తిత్వం ప్రశ్నార్థకంలో ఉన్నదని మాత్రం దేశానికి స్పష్టమైంది.
కర్నాటక రాష్ట్రంలోని మహాదేవపురా నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్‌లో నమోదైనా పేర్లు వాటి చిరునామాలు, అనేకమంది ఓటర్లకు ఒకటి కన్నా ఎక్కువచోట్ల ఓటు హక్కు ఉండడాలు, బతికున్న వారి పేర్లు చనిపోయిన ఓటర్ లిస్ట్‌లో ఉండడాలు, ఎనభై ఏండ్ల వృద్ధులకు యువతీ యువతులుగా ఓటుహక్కులు కల్పించడాలు వంటివనేకం రాహుల్ గాంధీ ఎత్తిచూపడంతో దేశమంతా దిగ్భ్రాంతి చెందింది. అయితే ఇలాంటి తప్పిదాలు అనేకచోట్ల ఉండవచ్చు. కానీ ఇండియాబ్లాక్ వారు దీన్ని ఓటు చోరీగా ప్రస్తుతిస్తూ జరిపిన ప్రచారంతో ఎన్నికల కమిషన్ మొదట్లో స్పందించడానికి నిరాకరించినప్పటికీ తర్వాత తప్పలేదు. ఓటర్ లిస్ట్ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తబడుతున్న కారణంగా అది మాకు సంబంధమే లేదన్నట్లు పాలక పెద్దలు వ్యవహరిస్తున్నారు. అయితే ఇది అనవసరపు రాద్ధాంతం అని, దీని ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తమ సోషల్ మీడియా ద్వారా ప్రతిదాడికి దిగడానికి మాత్రం వెనుకాడలేదు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఓటర్ లిస్టులలో తప్పుడు పేర్లు, తప్పుడు చిరునామాల ద్వారా అనేక అవకతవకలతో నమోదవుతున్నదీ వాస్తవమే. అంతే కాకుండా ఓటర్ లిస్టులను అధికారంలో ఉన్న పాలకపార్టీలు ఎన్నికల సంఘాలతో కుమ్మక్కై తారుమారు చేస్తూ ఉన్నది కూడా నిజమే. వీటితో పాటు ఎన్నికల అనంతరం పోలయిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడాలు ఉన్నట్లు కూడా అనేక సందర్భాలలో బహిర్గతమవుతుంది కూడా.
గత సాధారణ ఎన్నికలప్పుడు మహారాష్ట్రలో ఎన్నికైన ఓట్లను మించి లెక్కించిన ఓట్లు ఉన్నవి. లోక్‌సభ తర్వాత జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 72 లక్షల ఓట్లు అధికంగా నమోదయ్యాయి. అయితే ఈ కాలంలో 39లక్షల ఓట్లు అదనంగా చేర్చబడ్డాయి. 118 నియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్ల చేరికలు బయటపడితే అందులో 102 సీట్లను ఇప్పుడున్న అధికార కూటమి గెలుచుకున్నది. ఇది కచ్చితంగా అనుమానాలకు తావిచ్చే అంశమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నియోజకవర్గంలో దాదాపు యాభై శాతం వరకు ఓటర్ల పెరుగుదల నమోదైంది. ఆ తర్వాత జరిగిన మధ్య ప్రదేశ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గణాంకాలతో కూడిన ఆరోపణలు ఎన్నో వచ్చాయి. వీటన్నింటిపై ఎన్నికల కమిషన్ సమాధానం దాటవేసింది. ఇవన్నీ విస్మరించేంత చిన్న తప్పిదాలు కావు. ఎన్నికల్లో సేవాతత్పర మేధావులు పోటీ చేసినంత కాలం విధానాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. ఆ తర్వాత దౌర్జన్యానికి ప్రతీకగా ఉండే పలుకుబడి దార్లు, రౌడీలు, గుండాల నుండి పెట్టుబడిదారుల ద్వారా కార్పొరేట్ కనుసన్నల్లోకి ఎన్నికల ప్రక్రియ జారిపోయింది. అందుచేతనే ఎన్నికల ప్రక్రియ ఒక వ్యాపార సామ్రాజ్యాలకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే సాధనంగా కార్పొరేట్ కనుసన్నల్లో ఉన్నది. ఇలాంటప్పుడు ఓటర్ లిస్టుల తయారీ నుండి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి సందర్భాన్ని కార్పొరేట్ సంస్థలు తమ కనుసన్నల్లో పెట్టుకుంటున్నాయి. అందుకే ఎన్నికల అనంతరం కూడా ఓట్లు పొందినవారు కాకుండా సీట్లను కొనుగోలు చేసిన వారు అధికారాన్ని చేపట్టగలుగుతున్నారు.
దీనిద్వారా, జరిగిన ఓటింగ్‌లకు, ఎన్నిక కాబడిన అభ్యర్థులకు ఎలాంటి విలువ లేకుండా పోతున్నది.
ఇక మరో రకమైన అన్యాక్రాంతం చూద్దాం. మొత్తం ఓటర్లలో సగటున 65, 66శాతం మాత్రమే ఓటింగ్ నమోదవుతున్నది. ఇందులో పట్టణవాసులు కేవలం 25శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనగనగా దాదాపు ఎనభై శాతానికి మించి పల్లె వాసులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విచక్షణతో, పోటీ చేస్తున్న అభ్యర్థుల, రాజకీయ పార్టీల విధానాలపై అవగాహన కలిగి ఉండి, ఓటు హక్కు వినియోగించుకున్నపుడే దానికి సార్థకత ఉంటుంది. పట్టణాల్లో ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వల్ల ఫలితాలలో వాస్తవిక ఉద్దేశాలు దెబ్బతిన్నట్లే. పల్లెటూర్లలో ఓటర్లను చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది: స్థానిక ప్రభావశీలురు, డబ్బుతో జరుపుతున్న ఓట్ల కొనుగోళ్లు. ఓటుకు నోటు దేశమంతటా సర్వసాధారణమైన అంశం. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఓటు హక్కు గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే ఉద్దండులకు ఈ విషయం తెలియదా? తెలిసి కూడా ఇలాంటి అనైతిక పద్ధతులను ప్రోత్సహిస్తున్నారంటే ఓటుహక్కుకు గౌరవమిస్తున్నారా లేదా సీట్ల సాధనకు రాఖీ కడుతున్నారా అనేది స్పష్టం.
ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు గురించి స్పష్టంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా బహిర్గతమైన అంశం ఏమిటంటే కమిషన్ నిర్దేశించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని. ఇలా జరుగుతుందన్న విషయం ఎన్నికల కమిషన్‌కు తెలియదా? తెలిసినప్పటికీ ఎన్నో ప్రభావాలను అధిగమించి ఎదుర్కొంటే తమ భవిష్యత్తు ఎంత అధికారం అవుతుందో స్పష్టంగా వాళ్ల కండ్ల ముందు కదలాడుతది. ఈ విధంగా పరుల పాలౌతున్న ఓటు అన్యాక్రాంతమైనట్లు కాదా? బీహార్ రాష్ట్రంలో అతి త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నఫలంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరున జరుగుతున్న ఓటర్ లిస్టుల ప్రక్షాళన దేశవ్యాప్త వివాదాంశంగా మారింది. వలస వెళ్లిన వారికి సరైన అవకాశాలు ఇవ్వకుండా, ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ కాకుండా సమర్పించ వలసిందిగా కోరడంతో అనేకమంది తమ ఓటును తిరిగి నమోదు చేసుకోలేకపోయారు.ఆవిధంగా 65లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని తేలింది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కొంతమేర సరిదిద్దే పనికి ఈసి పూనుకున్నది. బాధ్యతారహితంగా అకస్మాత్తుగా చేపట్టిన ఈ ఎస్‌ఐఆర్ కూడా ఈసికి అపకీర్తి తెచ్చినట్లే. అయితే తీసుకున్న చర్యల కన్నా స్పందించిన తీరువల్ల ఈసి మరింత చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఎస్‌ఐఆర్ పట్ల వ్యక్తమైన వ్యతిరేకతలను నివృత్తి చేయడంలో బాధ్యతారహితంగా వ్యవహరించింది. అందుచేతనే చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలాంటి చర్యల ద్వారా కూడా ఓటు అన్యాక్రాంతమవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు అక్టోబర్ 25, 1951లో నిర్వహించబడ్డాయి. 489 పార్లమెంటు స్థానాలకు గాను 364 స్థానాల్లో జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ పోలయిన ఓట్లలో 45శాతం పైన పొంది ఘన విజయాన్ని సాధించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మొదటి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ చరిత్రలో నిలిచిపోయారు. 17.3 కోట్ల అర్హతగల ఓటర్లకుగాను 8.4 కోట్ల ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ అఫ్ ఇండియా 16 సీట్లను గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థులు 37 స్థానాల్లో గెలుపొందారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినా మొదటి సందర్భం అని చెప్పవచ్చు. ఆ తర్వాతి కాలాల్లో అధికారానికి పాకులాడే పరిస్థితులు ఊపందుకున్నాయి. అయితే భారతదేశంలో ప్రతి ఎన్నికల అనంతరం అధికార మార్పిడి వివాదరహితంగా జరిగింది. ఇది గర్వించదగినది. ప్రస్తుత కాలంలో అధికారమే పరమావధిగా మారి, దానికోసం ఎన్నికలను మితి మీరి ప్రభావితం చేయడమే కాకుండా చివరికి ఓటర్ లిస్టులను కూడా తారుమారు చేసి పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత భవిష్యత్తులో గెలిచిన పార్టీకి అధికార మార్పిడి సజావుగా సాగుతుందన్న నమ్మకం సన్నగిల్లడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందుచేత ఎన్నికల ప్రక్రియనే ప్రజాస్వామ్యానికి ప్రాణాధారంగా ఉన్నందున ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతిస్థాయిని కూడా గౌరవ మర్యాదలతో కాపాడుకోవాలి దురదృష్టవశాత్తు, ఈ మధ్య కాలంలో, ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారిగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలను ప్రజా బాహుళ్యంలోకి సమాధానాలివ్వమని ప్రభుత్వ పెద్దలే పంపిస్తున్నారు.
ఉదాహరణకు బీహార్‌లోని ఎస్‌ఐఆర్ మరి ఓటు చోరీ అంటూ తలెత్తిన వివాదాలను వివరించడానికి ఎన్నికల కమిషన్ ఒక ఆదివారం రోజు పత్రికా సమావేశం నిర్వహించి రాజకీయపరమైన సమాధానమిచ్చే ప్రయత్నం చేసింది. అంతటితో ఆగక ఓటర్ లిస్టులను తప్పుబట్టిన రాహుల్‌గాంధీని ”అయితే అఫిడవిట్ ద్వారా కంప్లైంట్ చేయాలి లేదంటే క్షమాపణ చెప్పాలని” కోరింది. రాజ్యాంగ బద్ధమైన, చట్టాన్ని అమలుపరిచే ఈసి క్షమాపణ చెప్పించుకొని దోషులను వదిలివేయడానికి అవకాశముందా? ఇలాంటి భావోద్వేగపు పరిష్కారానికి ఈసి ఎందుకు ఒడిగ ట్టినట్టు? ఇలాంటి పోకడలు మితిమీరితే భవిష్యత్తులో ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ప్రజలతో, ప్రతిపక్షా లతో, ఇతర సంస్థలతో నేరుగా వ్యవహారాలు నేరిపే అవకాశ ముంది. అలాగే జరిగితే, పాకిస్తాన్ ప్రభుత్వ పగ్గాలను ఏ క్షణమైనా హస్తగతం చేసుకోగలిగే మిలటరీకి తీసిపోని విధంగా మన రాజ్యాంగ సంస్థలు కూడా తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే విధంగా ఈ సంస్థ పనిచేసి ఉండవచ్చు, కానీ దీని పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అందుచేత రాజ్యాంగ మూల స్తంభాలైన శాసన నిర్మాణం, కార్యనిర్వహణ మరియు న్యాయవ్యవస్థలు పరిధిని దృష్టిలో ఉంచుకొని తమ విధులను నిర్వహించడమే సర్వశ్రేష్టం.
జి.తిరుపతయ్య 9951300016
వయోజన ఓటుహక్కు స్వతంత్రమెంత?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES