కోర్టు తీర్పు ఇచ్చినా కొనసాగుతున్న కన్ఫ్యూషన్
మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు
ఈ వారంలో ప్రొసీడింగ్స్ వెలువడే అవకాశం
రాష్ట్రంలో 9.80 లక్షల మంది రైతుల దరఖాస్తులు
ఖమ్మం జిల్లాలోనే 1.11 లక్షల మంది నిరీక్షణ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెల్లకాగితాలపై కాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణ మార్గదర్శకాల కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. సాదాబైనామాపై న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ తదుపరి ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. 2020 నవంబర్ 10వ తేదీ నుంచి నిలిచిపోయిన ప్రక్రియను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై స్పష్టత లోపించింది. రాష్ట్రవ్యాప్తంగా 9.80 లక్షల మంది రైతులు, ఖమ్మం జిల్లాలో 1.11లక్షల మంది సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ వారంలోనే ప్రొసీడింగ్స్ వెలువడొచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
అనేక సందేహాలు..
సాదాబైనామాల క్రమబద్ధీకణపై అనేక సందేహాలు నెలకొన్నాయి. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులకు యాక్సెప్ట్, రిజెక్ట్ ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. సాగుదారులకు, యాజమాన్యహక్కులు కలిగిన వారికి పంపించే నోటీసులపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేదు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే కారణం తెలియజేయాల్సి ఉంటుంది. ఆ కారణం సహేతుకంగా లేకపోతే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు.
2025 ఆర్వోఆర్ చట్టం ప్రొసీడింగ్స్ ఎలా..!
2025 ఆర్వోఆర్ చట్ట ప్రకారం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినా.. ఏ విధానాన్ని అమలు చేయాలనే దానిపై స్పష్టత లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఆర్వోఆర్ 1971 చట్టంలో 11, 12 సెక్షన్ల ఆధారంగా దరఖాస్తుదారుకు, భూ యజమానికి నోటీసులు జారీ చేసేవారు. వాంగ్మూలం నమోదు చేసి క్షేత్రస్థాయి విచారణ అనంతరం నోటిఫికేషన్ ఇచ్చి, 13బీ ప్రొసీడింగ్స్ ద్వారా పట్టాలు ఇచ్చేవారు. కానీ 2025 ఆర్వోఆర్ చట్టం మార్గదర్శకాల్లో స్పష్టత లోపించిందని రెవెన్యూ అధికారుల మాట. సాదాబైనామాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగానా? లేక ఫీజులు తీసుకోవాలా? అనేదానిపైనా స్పష్టత లేదు. ఒకవేళ ఫీజు తీసుకుంటే 1971 ఆర్వోఆర్ చట్ట ప్రకారమా? లేక 2025 ఆర్వోఆర్ చట్ట ప్రకారం తీసుకోవాలా? అనే విషయంలోనూ సందేహాలున్నాయి. అంతేకాదు, 2021 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 4.04 లక్షల సాదాబైనామా దరఖాస్తులను సీసీఎల్‌ఏ కలెక్టర్ల లాగిన్‌కు పంపింది. వీటిలో సుమారు 1.50 లక్షలకు పైగా దరఖాస్తులను కలెక్టర్లు తిరస్కరించారు. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి? అనేదానిపైనా స్పష్టత లేదనేది సమాచారం.
2020లోని దరఖాస్తులకే పరిష్కారమా?
సాదాబైనామాల క్రమబద్ధీకరణపై జీవో 106ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దీనిప్రకారం 2014కు పూర్వం సాదాబైనామాల ద్వారా క్రయవిక్రయాలు చేయటంతో పాటు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిష్కరిస్తారని రెవెన్యూవర్గాలు అంటున్నాయి. 12 ఏండ్లుగా భూమి తమ స్వాధీనంలో ఉన్నట్లు దరఖాస్తుదారులు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నాయి. సెక్షన్ 6ను అనుసరించి కటాప్ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు వీల్లేదని అంటున్నారు. కానీ, కటాప్ తేదీ తర్వాత అందిన దరఖాస్తులపై మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతలేదు. భూ భారతి వచ్చిన తర్వాత నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఖమ్మం జిల్లాలో వివిధ రెవెన్యూపరమైన సమస్యలపై 75వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 45,254 సాదాబైనామాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఇందులో 2020లో చేసుకున్న దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తారనే చర్చ నడుస్తోంది. 2014కి ముందు తెల్లకాగితాలపై కొనుగోలు చేసిన ఐదెకరాల లోపు కుష్కీ, రెండున్నర ఎకరాల తరి ఉన్న చిన్న, సన్నకారు రైతుల భూములు రెగ్యులరైజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 2020తో పాటు జూన్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లోనూ చేసిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటామంటున్నారు. 2020 కటాఫ్ తేదీ ప్రకారమే దరఖాస్తుల పరిశీలన ఉండొచ్చని భావిస్తున్నారు.
మార్గదర్శకాలు వచ్చాకే ముందుకు..
సాదాబైనామాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గైడ్‌లైన్స్ వచ్చాకే తదనుగుణంగా ముందుకు వెళ్తాం. రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు వస్తాయని అనుకుంటున్నాం. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లోనూ రెవెన్యూపరమైన అంశాలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా సాదాబైనామాలపైనే ఎక్కువ ఉంటున్నాయి.
పి.శ్రీనివాసరెడ్డి, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఖమ్మం జిల్లా