రోజుకు 15గంటలపాటు గొడ్డుచాకిరీ
పోరాడితేనే ఉద్యోగ భద్రత
మోడీ విధానాలతోనే ఆ కష్టాలు : ఎస్‌బీఐ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సులో పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘పెరుగుతున్న ధరలతో..చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని సాకటం కష్టమవుతోందని పలు మార్లు ఎస్‌బీఐ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు యజమాన్యానికి, ప్రభుత్వాధినేతలకు మోరపెట్టుకున్నా వారితో చట్ట విరుద్దంగా 15గంటల పాటు గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. ఇచ్చే జీతానికి చేసే పనికి బోలెడంత వ్యత్యాసం ఉంది. పేరుకు అన్‌స్కిల్డ్ ఉద్యోగులు..చేసే పని మాత్రం స్కిల్డ్ పనే.. గొర్రెతోక బెత్తెడు జీతాలతో ఇంకేన్నేండ్లు కష్టాలతో బతుకుదాం..’ అందుకే ‘ పోరాడి ఉద్యోగ భద్రతను సాధించుకుందాం’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌బీఐ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సును ఆ సంఘం అధ్యక్షుడు నగేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు.వారు రోబోల్లా పనిచేస్తున్నారు..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రోజురోజుకు ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పోయాయన్నారు. విద్యా, వైద్యం ఖరీదైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వినోదం అందని ద్రాక్షలా మిగిలిందని చెప్పారు. ఆక్ట్రాయిడ్ లెక్క ప్రకారం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని వేతనాలు నిర్ణయించాలి కదా! మరి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను అలా ఎందుకు నిర్ణయించటం లేదని ప్రశ్నించారు. కార్మిక చట్టాల ప్రకారం 8గంటలు మాత్రమే పని చేయాలి..కానీ..15గంటలు పని చేస్తున్నా లేబర్ అధికారులు ఎందుకు తనిఖీలు చేయటం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆ సంస్థలో ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు వేతన వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించిందని గుర్తు చేశారు.దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని గుర్తు చేశారు. చట్టాలను, న్యాయస్థానాలను ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు..ఇక పోరు బాట తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్థిక విధానాల వల్ల ఈ దేశంలో శాశ్వత ఉద్యోగులుండొద్దనే విధానాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ నియామకాలకు మంగళం పాడిందని గుర్తు చేశారు.వీటి స్థానంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్,క్యాజువల్, టెంపరరీ పేరుతో వెట్టి చాకిరి చేయించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తుమ్మితే ఊడుపోయే ముక్కులాగా ఉండే ఉద్యోగాలు కాదు..15,20ఏండ్లుగా పని చేస్తున్న వాళ్లను పర్మినెంట్ చేయాలని లేదంటే ఆందోళన బాట పట్టాలని సూచించారు. పోరాడే వారే విజేతలుగా నిలుస్తారని చెప్పారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్లచట్టాలను విరమించుకునేంత వరకు సమరశీల పోరాటాన్ని నిర్వహించిన రైతు పోరాట స్ఫూర్తితో ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. ఆ పోరాటంలో సీఐటీయూ అండగా ఉంటుందని హామినిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్, క్యాజువల్, టెంపరరీ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీలను రద్దు చేసి ఎస్‌బీఐ నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. దీంతో ప్రతి ఉద్యోగి మీద రూ. మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు నెలకు ఎస్‌బీఐకి ఆదా అవుతుందని గుర్తు చేశారు. నెలకు రూ. 26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పనివిధానాన్ని, గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. ఆర్‌బీఓ కేంద్రంగా బిల్లులు చెల్లించాలనీ, ఎంప్లాయీస్‌కు చెల్లిస్తున్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐలను ఎస్‌బీఐ అధికారుల చెక్ చేయాలని డిమాండ్ చేశారు.
సదస్సులోతమ డిమాండ్ల పరిష్కారం కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు.ప్రతి బ్రాంచ్ మేనేజర్ ద్వారా చైర్మెన్‌కి వినతి పత్రాన్ని పంపాలనీ, పార్లమెంట్ సభ్యులకు విజ్ఞాపన పత్రాలివ్వాలని నిర్ణయించారు. వేతనాలు పెంచాలనీ,పీఎఫ్,ఈఎస్‌ఐ, బోనస్‌పై సీలింగ్ ఎత్తేయాలని కోరుతూ సెంట్రల్ లేబర్ అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు.
సదస్సులో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సీనియర్ నాయకులు బి వెంకట్రామయ్య, రవికాంత్, సతీష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనుంజరు, అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర నాయకులు క్రాంతి, అహ్మద్‌పాష, వీరన్న, అశోక్, లెనిన్, మల్లేశ్, సాయికుమార్, స్వామి, నర్సింగ్, సతీష్, శ్రీకాంత్, రాజు, నాగేంద్ర, నరేశ్, తిరుపతి రెడ్డి, జ్ఞానేశ్వర్, రమేష్, అంకుశ్, రాజయ్య, సత్యనారాయణ, ధర్మ, భవానీ తదితరులు పాల్గొన్నారు.
గొర్రెతోక బెత్తెడు జీతాలతో ఇంకెన్నేండ్లు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



