Sunday, January 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికిత్‌నే వోటర్స్‌ థే!

కిత్‌నే వోటర్స్‌ థే!

- Advertisement -

”కిత్‌నే వోటర్స్‌ థే!”
”99 కరోర్‌ వోటర్స్‌ సర్కార్‌…”
”కిత్‌నే వోటర్స్‌ కో నికాలా గయా హై…”
”దస్‌ కరోర్‌ వోటర్స్‌ సర్కార్‌…”
”ఊ.. అబ్‌ కిత్‌నే వోటర్స్‌ బచా హువా హై…”
”89 కరోర్‌ సర్కార్‌…”
”సర్కార్‌ ఖుష్‌ హువా… ”
”ఆప్కా హుకుం సర్కార్‌…”

”అరె హో సాంబా అబ్‌ కిత్‌నే రాజ్యోమ్మే చునావ్‌ హై…”
”పాంచ్‌ సర్కార్‌…”
”హం కిత్‌నే రాజ్యోమ్మే ఆయేగా…”
”మాలూం నహీ సర్కార్‌….”
”..వ్వర్‌కే బచ్చో…. పాంచ్‌ మే పాంచ్‌ ఆనాహై… ఏ హమారా హుకుం…”
”అచ్ఛాహై … సర్కార్‌”
”అబ్‌ సర్‌ కో లేకే ఆగేభడో…”
”ఆప్‌ కా హుకుం సర్కార్‌…..”

యాద్గిరి కల మధ్యలో ఆగింది. సడెన్‌గా మెలకువొచ్చింది. ఎప్పుడు పండ్లు తోముకున్నాడో, ఎప్పుడు టీ తాగాడో తెలియదు. బావ నర్సింగ్‌ దగ్గరికి బయలుదేరాడు.
”బావా బావా….” పరుగు పందెంలో లాగ వస్తున్నాడు యాద్గిరి.
”ఏమైంది యాదూ” అడిగాడు వాళ్ల బావ నర్సింగ్‌
”ఏముంది బావా కొంప మునిగింది…”
”ఊరికే ఆయాసపడకుండా అదీ ఇదీ చెప్పొద్దు. సర్‌ వస్తాడిప్పుడు ఆయనతో మాట్లాడాలి మనం”
”ఆ సరే కొంప ముంచింది బావా”
”సర్‌ ఏమిటి? కొంపముంచడమేమిటి?” నర్సింగ్‌ అడిగాడు

”అదే బావా, మనం ఓటర్ల జాబితా లో లేమిప్పుడు. సర్‌ అంట, మన ఓట్లను తొలగిస్తుందంట. రకరకాల కారణాలు చెప్పి తమకు గిట్టనోళ్లు ఓట్లు తీసేస్తున్నారంట” అసలు విషయం తనకు తెలిసింది, విన్నది చెప్పాడు యాద్గిరి.
”దానికీ కొన్ని రూల్సు ఉన్నాయి యాదూ. మనం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కదా, మన ఓట్లెట్లా తీస్తారు నువ్వే చెప్పు”
ఇంతలో రామారావ్‌ సార్‌ వచ్చాడు. ఇద్దరూ లేచి నమస్తే పెట్టి కూచోమన్నారు.
”ఎలాగున్నారు సర్‌..” నర్సింగ్‌
”ఏమోనయ్యా… ఆ సర్‌యే కొంప ముంచింది” సర్‌ అన్నాడు
”మీరు కూడా ఇదే మాటేనా…” యాద్గిరి చెప్పిన మాటలు చెప్పాడు సర్‌తో
”నిజమే నర్సింగ్‌… మన ప్రమేయం లేకుండానే మన ఓట్లు తీసేస్తున్నారు”

”ఎలా చేస్తారు సార్‌, రాజ్యాంగముంది, ఎన్నికల సంఘం ఉంది…” నర్సింగ్‌
”అవన్నీ ఆటలో అరటి పండైపోయా యిప్పుడు. పథకాల్లో గాంధీ పేరే మారుస్తున్నారిప్పుడు”
”ఇది అన్యాయం కద సార్‌…”
”అని నువ్వు, నేను అరిస్తే సరిపోదు”
”మరేం చేయమంటారు సార్‌”
”చెబుతా…. వోట్లున్న ప్రజలందరూ మేలుకో వాలిప్పుడు. ప్రజలనుకుంటే జరగనిదేదీ లేదు”
”ప్రజలకెట్లా తెలుస్తుంది సార్‌, ఏ పత్రికలోనూ దీని అసలు స్వరూపం చెప్పడం లేదు”

”ఎందుకు చెప్పడం లేదు, చూడు..” అంటూ రెండు మూడు న్యూస్‌పేపర్లు చూపించాడు సారు.
”అవును కద సార్‌… పెద్ద పత్రికల్లో రానంత మాత్రాన ప్రజలకు పోకుండా ఉంటుందా ఈ వార్త” కొద్దిగా ధైర్యం వచ్చింది నర్సింగ్‌కు.
అలా సంభాషణ జరుగుతూ ఉంది.
ఇంగ్లీషులో ఒక కోటేషనుంది, అదేమంటే
రూల్‌ నెంబర్‌ ఒకటి బాస్‌ ఎప్పుడూ కరెక్ట్‌,
రూల్‌ నెంబర్‌ రెండు ఒకవేళ బాస్‌ తప్పైతే రూల్‌ నెంబర్‌ ఒకటి చూడండి,

అంటే మళ్లీ బాస్‌ ఎప్పుడూ కరెక్టేనని అర్థం. ఇలాగుంది ప్రస్తుత సమాజం. అక్కడేమో ట్రంప్‌ ఏది చేసినా రూల్‌ నెంబర్‌ ఒకటి చూడవలసిందే అలాగే మన నాయకుల పనులు కూడా. వాటిలో ఈ సర్‌ ఒకటి. మీరు దేశభక్తులన్నా, దేశద్రోహులన్నా, బాస్‌ ఏది చెబితే అదే నిజం. అలాగే ఈ ఎస్‌.ఐ.ఆర్‌ సర్‌ దేశానికి చాలా మంచిదంటే మంచిదే మరి. కాదంటే నీ ఓటే కాదు నీవూ గల్లంతు కావచ్చునన్నది నేటి ప్రజాస్వామ్య సూచీ చెప్పే నిజం. ఎన్నికల్లో నిలబడడానికి ఫారాలు నింపాలిగాని ఓటర్ల జాబితాలో ఉండాలంటే కూడా ఎన్నో ఫారాలు నింపాలట. అది ఈ సర్‌ ప్రత్యేకత. ఒకవేళ ప్రశ్నిస్తే, జాబితాలో ఉండాలంటే అవి నింపు లెదంటే పక్కకుపో అనేలాగ ఉంది పరిస్థితి. ఇన్నేళ్లుగా ఉన్న ఓట్లు ఇంత అకస్మాత్తుగా తప్పుడు ఓట్లు ఎలా అవుతాయి అని గట్టిగా అనరాదు. అనేవాళ్లు అందులో ఉండరాదు. ఇది ప్రభుత్వ పాలసి. ఏ పెళ్లికో లేదా యాత్రలకో మీరు పోకూడదు. ఎందుకంటే అప్పుడు అధికారులు మీ వివరాలకోసం వస్తే ఇక మీ ఓటుజారి గల్లంతైనట్టే. కరువుకాలంలో నెలలు నెలలు వలసలుపోతారు కార్మికులు. అప్పుడూ ఇదేగతి. ఇంతే సంగతి.

సతీ సావిత్రి కథ అందరికీ తెలుసు. దాన్నే అన్న రామారావు ఉమ్మడి కుటుంబం సినిమాలో నాటకం రూపంలో కొద్దిగా తమాషాగా చూపారు. తన భర్త సత్యవంతుడి ప్రాణాలను తీసుకుపోతున్న యముడివెంట పడుతుంది సావిత్రి. మూడు వరాలిస్తాడు యముడు, ఇచ్చేముందు బుజ్జగించి, ఊరడించి, లాలించి మరలించెద అంటాడు. అదే విధంగా ఈ సర్‌లో ఓట్లను గాలించి, తొలగించి, తరలిస్తారట. వీటిలో ఏది జరుగుతుందో, జరగబోతోందో అందరికీ తెలుసు. తొలగించడం, తరలించడం వారి అంతిమ లక్ష్యం. ఐతే ఇందులో యముడిలాగ బోల్తా పడతారో లేక తామనుకున్నది సాధిస్తారో ఈ జనవరి 25 ఓటర్ల దినోత్సవం నాడు నిర్ణయించుకోవలసింది బాధ్యతాయుతమైన ఓటర్లు, వారి వెనుక ఉండే నాయకులే. ఓటర్ల దినోత్సవంనాడు వారికి దండం పెట్టి ఓటర్ల జాబితాకు దినం పెట్టే సంస్కృతిని ఏమనాలి. ఏమీ అననివాళ్లని ఏమనాలి? ఎదిరించి నిలబడి ప్రశ్నించేవారిని ఏమనాలి? ప్రశ్నించేవాళ్లనే కాదు ప్రశ్నించి పోరాటాలు చేసేవాళ్లను ఏమనాలి? ఇవి ఈ ఓటర్ల దినోత్సవంనాడు వేసుకోవలసిన ప్రశ్నలు. సమాధానం కావాలంటే రూల్‌ నెంబర్‌ ఒకటి చూడండి.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -