Sunday, April 5, 2026
E-PAPER
Homeకథఎన్నాళ్ళిలా

ఎన్నాళ్ళిలా

- Advertisement -

రాత్రి పడుకునే సమయంలో సెల్‌ఫోన్‌ దూరంగా పెట్టాలనే విషయం పెడచెవిన పెట్టినందున ఉదయం 4-30కు మెసేజ్‌ నిద్రలేపింది. సెల్‌ తెరచి చూశాను.
”నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే మా దంపతులం కాలకృత్యాలు తీర్చుకొని దంతధావనం చేసుకున్న తరువాత మేం చేసే మరోపని హరిత తేనీరు (గ్రీన్‌టీ) సేవించి పక్కా ఐదుగంటలకు ఉదయపు నడకకు బయలుదేరి వెళతాం. తిరిగి ఇల్లు చేరే సరికి ఆరుంబావు అవుతుంది దేవరా! మిత్రులకు ఆరోగ్యశుభోదయం!”
మెసేజ్‌ చదవగానే చిలిపి ఆలోచన వచ్చింది.
”తేనీరు ఎవరు తయారు చేసెదరు” చాట్‌ చేశాను.
”ఆవిడ తలదువ్వుకుంటుంది. నేనే చేస్తాను” కబురు అందింది.
వారి నియమబద్ద జీవితానికి ఛోదకశక్తులయిన అనారోగ్య సమస్యలు గుర్తుకొచ్చాయి. నిత్యం పాటించే క్రమశిక్షణ పట్ల సంతోషం కలిగింది.

ఉదయత్పూర్వం 4-45.
కుంటుతూ, కుదేలవుతూ దినచర్య మొదలయింది. కాలకృత్యాలు, స్నానాదికాలు పూర్తయ్యాయి. సమయం తరుముతుంది. మోకాలు పట్టీతో కాలు మూలుగుతుంది. సాగాల్సిన ఆరోగ్యనడక కాస్తా ఆహార పరుగుగా మారింది. ఖాళీ కడుపుతో రోడ్డెక్కాను. ఎప్పటిలాగే నన్ను భుజాన వేసుకొని బైక్‌ బయలుదేరింది. రోడ్డు, బైక్‌ ముచ్చట్లాడాయి. కళ్ళు ట్రాఫిక్‌ సిగల్స్‌తో ఊసులాడాయి. మనసు కాలం కంటే వేగంగా బస్టాండ్‌ చేరింది.
”నువ్వెప్పుడూ మనసుకంటే వెనకనే ఉంటావెందుకు” బైక్‌ అడిగింది.
”అట్లా ఉండకుంటే నువ్వూ నేను ఇద్దరం ఉండం” అన్నాను.
కాలం కిచకిచా నవ్వింది. బైక్‌ బిక్కపోయి బస్టాండ్‌లో దిగజార్చింది.

ఉదయం 6 గం||లు :
వచ్చిపోయే బస్సులు, కదిలీ కదలని బస్సులు, మొరాయించే బస్సులు, ఊగులాడే బస్సులు, ఎలక్ట్రిక్‌ బస్సులు, డీలక్స్‌లు, రాజధానులు, పల్లెవెలుగులు, లగ్జరీలు, గరుడలు ఇలా అనేకం బస్టాండ్‌లో కొలువుదీరాయి. కావాల్సిన బస్సుకోసం కళ్ళు వెదకాయి. కాళ్ళు కదిలాయి. ఫ్లాట్‌ఫామ్‌ మీదుంటే సీట్‌ దొరకదని గ్రౌండ్‌ వైపు వచ్చాను. అందినట్టే అంది బస్సు తుర్రుమంది. రోజువారీ యుద్దంలో యాతన ఎక్కువ.
ఉదయం 6-20 గం||లు
రుమాళ్ళకు రెక్కలచ్చాయి. కిటికీల గుండా వెళ్ళి సీట్లలో పడ్డాయి. పదిమందైనా తోపులాట ఎక్కువే. మొత్తానికి కిటికీ సీటు దొరికింది.
”సారూ ఎన్కకు కూసోకపోయినవు” అందొకామె.
”ఎందుకు”
”ఇక్కడ ఆడోళ్ళు కూర్చుంటరు”
”ముగ్గురు కూర్చునే సీటు మీదే. ఇద్దరు కూర్చునేదీ మీదేనా? డబ్బులిచ్చి టికెట్‌ కొనుక్కునే మేము అనాధలమా” ఆగ్రహించాను.

ఉదయం 6-30 గం||లు.
సముద్రాన్ని ఈదుతున్న వాడిలా కండక్టర్‌ వచ్చాడు. హన్మకొండకు టికెట్‌ తీసుకున్నాను. చూస్తుండగానే బస్సు పట్నం పొలిమేర దాటింది. కిటికీ నుండి దృశ్యాలు వేగంగా మారుతున్నవి. రోడ్డుపక్కన ఊర్లు కుదురుకున్నవి. ఒక ఇంటి బయట నీటి డ్రమ్ము పైనున్న మూత తీసింది కోతి. కోతిలో మనిషి కనిపించాడు. చెట్టు కొమ్మలు సయ్యాటలాడుతున్నవి. కొండ ఒకటి సూర్యుని కోసం తలుపు తెరిచింది. పత్రహరితం ముద్దొచ్చింది. ఆకు కొసనే వేలాడే బిందువు హరివిల్లును అందించింది. మైమరచే వేళ బస్సు బ్రిడ్జి కిందినుండి వెళ్ళింది. ఒకింత చీకటి అలుముకుంది. వెలుగునీడలు అవగతమయ్యాయి. వంతెన గోడలు తొలగి వెలుగువచ్చింది. గోడల చివరన బక్కచిక్కి అందవికారంగా ఉన్న కుక్క కనిపించింది. పెచ్చులూడిన గోడలా శరీరంపై మచ్చలతో ఉన్నది.

ఏ మాత్రం కండలేని ఆ కుక్క పాలిండ్లు మాత్రం నిండుగా బరువుగా ఉన్నవి. నాలుగు కుక్క పిల్లలు ఎగబడి పాలుతాగుతున్నవి. దాని స్థితి హృదయవిదారంగా ఉంది. అది మాత్రం అర్ధనిమీలిత నేత్రాలతో ఆకాశం వైపు చూస్తుంది. దాని స్థితి, గతి అవగతం కాలేదు. స్టేజి స్టేజికి జనం ఎక్కువవడంతో బస్సు కిక్కిరిసింది. ఎక్కేవారిలో మహిళల సంఖ్య ఎక్కువుంది. నిలబడటానికి జాగలేని దశ వచ్చింది. బస్సు డ్రైవర్‌ పక్కన గల బానెట్‌పై కూర్చున్న యువతిపై దృష్టి పడింది. చూపు మరల్చుకోలేని చక్కదనం. ఉద్యోగిస్తున్నట్లుంది. నాగరికం ఉట్టిపడుతుంది. కళ్ళల్లో అసహనం, కదలికల్లో అసౌకర్యం కనిపించింది. చంకలోని బిడ్డ ఎత్తుకున్నా ఆగడం లేదు. అరుస్తున్నది. పాలిండ్ల కేసి అదుముకున్నది. కుక్క కళ్ళల్లో కదిలింది. తల్లి బాధ్యత ఎంత కష్టమైనదో? ఆలోచనల తుట్టె కదిలింది.

ఉదయం 8-00 గం||లు
బస్సు దిగాను. తలనొప్పి, ఆకలి బాధ మొదలయ్యాయి. టైం చూశాను. గంట టైం ఉంది. నిత్యం జీవకళ ఉట్టిపడే సెంటర్‌. పేద, ధనిక తేడా లేకుండా ఎవరికి కావల్సింది వారికి అందించే క్రాస్‌రోడ్‌. అదే కాకతీయ యూనివర్శిటీ క్రాస్‌. ఇడ్లీ వడతో కడుపు నింపి, కాఫీ పొగలలో తలదూర్చాను. మొత్తానికి రిలీఫ్‌ దక్కింది. ఇంకా అరగంట టైం ఉంది. షేరింగ్‌ ఆటో కోసం చూసాను. నిదానంగా నడిచే ఆఫీస్‌ నోట్‌ ఫైల్‌ లా ఆటో వచ్చింది. ఎక్కి కూర్చొని పోచమ్మ మైదాన్‌ అని చెప్పాను.

”ఇంకో నలుగురు ఎక్కితే పడతల పడుతది సార్‌” అన్నాడు.
”పోతుంటే ఎక్కుతరు పా”
”ఈ సెంటర్‌లనే ఎక్కువ ఎక్కుతరు”
”పోచమ్మ మైదాన్‌ వరకు పోవాలె” అన్నాను అసహనంగా.
”వినవచ్చింది సార్‌” అన్నాడు.
ఆటో డ్రైవర్‌ముఖం ఓడిపోయిన జట్టు కెప్టెన్‌లా ఉంది. అతడిలాగే ఆటో దడదడ మంటూ భారంగా చప్పుడు చేసింది. జబ్బలు జారేసి డ్రైవింగ్‌ చేయసాగాడు.
”ఎంత చేసినా ఇంతే సార్‌. ఇరవై ఏండ్ల నుండి ఈ పని చేస్తున్న” అన్నాడు.

”ఫ్రీ బస్‌ తో మీ గిరాకి తగ్గిందా”
”తగ్గింది.” అంటూనే కాలేజీ పిల్లల కోసం ఆటో ఆపాడు. వారిని రమ్మన్నాడు. ఇద్దరు మగ పిల్లలు వచ్చారు. వాళ్ళు అడిగినంత కిరాయికి ఒప్పుకున్నాడు. అయిష్టంగా కదిలింది ఆటో.
”అంత తక్కువకు ఒప్పుకుంటే ఎలా?” పిల్లలకు వినపడేటట్టు అన్నాడు.
”మీకెందుకు అంకుల్‌” అన్నారు వాళ్ళు
”అతని కడుపెట్లా నిండాలె” అన్నాను.
”జానెడు పొట్ట ఎంతకూ నిండది సార్‌. ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు. ఇద్దరికి పెండ్లి జేసిన రోజుకు మూడు వందలు ఆటోకు కట్టాలె. నా లెక్క ఇది కూడా ముసల్దయింది. ఎప్పుడు రిపేర్‌కు పోతది”
ఏమనాలో తోచక ఊ కొట్టాను. అతనిలో సుళ్ళు తిరుగుతున్న బాధ కనపడింది. గణగణ గంట మోగింది. జేబులో నుండి చిన్న సెల్‌ఫోన్‌ తీసి చెవికి ఆనించాడు.
”అయ్యో! పోయిండా” అంటూ సెల్‌ఫోన్‌ ఆటో హ్యాండిల్‌ పై జారవిడిచాడు.

”ఏమైంది ఆత్రంగా అడిగాను”
”మా నాయిన సచ్చిపోయిండట. జనగామ పోవాలె” పీలగా అన్నాడు.
”ఎన్నేండ్లుంటయి.”
”నాకు అరవై, మా నాయనకు ఎనభై”
నేను దిగాల్సిన స్టేజి వచ్చింది. ఆటో ఆగింది. చిల్లర లేక వందనోటు తీసాను.
”ఏమైనా సహాయం చేయి బాబు” అంటూ దోసలి పట్టాడు.
వంద కాగితం దోసిట్లో పడింది.

ఉదయం 8.45
పరుగు లాంటి నడకతో బడి చేరాను. ఎప్పుడూ ముందే వచ్చే పని మనిషి రాలేదు. ఎక్కడి దుమ్ము అక్కడే ఉంది. తాళాలు తీయలేదు. పక్కనే వాళ్ళ ఇల్లు. పిలవడానికి వెళ్ళాను. ఇరుకు వాడ, ఇరుకు బాట, ఇరుకు బతుకులు. ఈవల ఆవల ఆసరా లేని మనుషులు. బతుకు దెరువు కోసం ఇరుకు ఫ్యాక్టరీల్లో, దుకాండ్లలో, ప్రదేశాల్లో పనిచేసేవారు ఉండే చోటు అది. సమస్త జీవజాలం, మనుషులు కలిసి బతికే మురికివాడ. నన్ను చూసి వచ్చి నమస్కరించింది.
”ఇవ్వాళ ఎందుకు లేటయింది”
”అటే వస్తున్న సార్‌” నా వెనకే బయల్దేరింది.

గట్టిగా అనడానికి అందరి లాంటిది కాదు. అమాయక నలుపు. కుడుమిస్తే పండగ చేసుకునే రకం. ఆమెది మోసపోయిన చరిత్ర. మొగుడు తాగొచ్చి కొడితే సగం చచ్చింది. తాగితాగి వాడు పూర్తిగా చచ్చిండు. చిన్నపిల్లను చేతపట్టుకొని కాలం వెళ్ళదీసింది. వెళ్ళదీసిన కాలమంతా సగం కడుపుకే తిన్నది. చూస్తుండగానే ఆమె బిడ్డ పెద్దదయింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ రకరకాల యాప్స్‌ల మధ్య రంగుల జీవితాన్ని ఊహించింది బిడ్డ. అందులోనే వరుణ్ణి వెతుక్కుంది. ఒక ఉషోదయాన ఫేస్‌బుక్‌ నుండి నేరుగా వచ్చి ఇంటి ముందునిలిచాడు. అతనెవరో పిల్ల తెలిపింది. తల్లి అయోమయంతో నోరు తెరిచింది. నోరు మూసేలోపు బిడ్డపెళ్ళి చేసుకుంది. ఆ గుడిసెలో ముగ్గురు. కొంతకాలం గడిచింది.

గాలికెగిరే బతుకులకు స్థిరత్వం ఉండదు. సుఖదు:ఖాలు వాళ్ళతో ఆడుకుంటాయి. ఒకరోజు గుడిసెపై దాడి జరిగింది. అల్లునికి ఇది రెండో పెళ్ళి అని తెలిసే సరికి తలపై దెబ్బ పడింది. అల్లుని మొదటి భార్య గుడిసెలోని తల్లీకూతుళ్ళను బండకేసి బాదింది. వాడు తన మొదటి భార్యతో కలిసి పారిపోయాడు. కొన్నాళ్ళకు వాడి గుర్తుగా పిల్లవాడు వచ్చాడు. ఈమెకు అమ్మమ్మ గౌరవం దక్కింది. తన ప్రమేయం, అనుమతి లేకుండానే జరిగిన సంఘటనకు బాధ్యత వహించింది. నిస్సహాయత, తెలియనితనంతో కష్టాల కూడలిగా మారింది. ఆమె గురించి ఆలోచిస్తుండగానే బడి వచ్చింది. తాళం తీసి ఊడ్చి నీళ్ళు పెట్టింది. పరిసరం కళకళలాడింది.

ఉదయం 10.30 గం||లు
స్టాఫ్‌ కోసం ఆమె కాఫీ కలుపుతుంది. ఆమెతో మాటలు కలిపాను.
‘పొద్దున టిఫిన్‌ చేసావా’
‘చేయలేదు’
‘ఎందుకు’
‘ఇంట్లో సామాను లేదు’
‘తెచ్చుకోకపోయావా’
‘డబ్బులు లేవు’ అంటూనే కూలబడింది. నాలుక బయట పెట్టింది. రెండు చేతులు కలిపి గుండ్రంగా తిప్పుతూ పిచ్చి పిచ్చిగా అరవసాగింది. ఈ గొడవ విని స్టాఫ్‌ అంతా వచ్చారు.

”ఆమెకు దేవుడచ్చింది”
”ఆరోగ్యం బాగాలేక అట్లయింది”
”పైస లేక పోయే సరికి పరేషాన్‌ చేస్తుంది”
”ఆర్థిక సంక్షోభం దేవుడికి దగ్గర చేసింది”
రకరకాల మాటలు అక్కడ రాజ్యమేలాయి. ఆమె కూతురుకి ఫోన్‌ వెళ్ళింది. ఆమె వచ్చి తల్లిని తీసుకెళ్ళింది.

పగలు 12.30 గం||లు
మధ్యాహ్నం భోజన సమయం. పిల్లలు బారులు తీరి నిలబడ్డారు. వడ్డించడం మొదలైంది. ఆమె మళ్ళీ వచ్చింది. ఎప్పటిలా ఏమీ ఎరగనట్టుంది. ”ఎందుకలా చేశావు” అని అడగాలనిపించింది. అడగలేకపోయాను.
”సార్‌ భోజనం చేస్తారా” అడిగింది.
ఆమె మర్యాదకు చలించిపోయా. పేదరికం ఆమెను పిప్పిచేసింది. అమాయకత్వం అగాధంలో తోసింది. ప్రాక్టికల్‌ సొసైటీ పాపం అనదు. గతం గుర్తుకు వచ్చింది. ఈమె బడిలో చేరడం వెనక పెద్ద ప్రయత్నమే జరిగింది. బడిలో పర్మనెంట్‌ పనివారు లేరు. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి ఈమె ఒప్పుకుంది. ఇచ్చినంత తీసుకోవడానికి సమ్మతించింది. ప్రతినెలా చందా వేసుకొని జీతం ఇచ్చేది. చాలా చోట్ల ఇది జరుగుతున్నదే. నోట్లో నాలుకలా పనిచేసేది ఎప్పటికైనా ప్రభుత్వం ఎక్కువ జీతం ఇస్తదనే ఆశతో పనిచేసింది. ఈమెకు సహాయంగా కూతురు పనిచేసింది. అనేకుల ఒత్తిడిల మేరకు మూడు నెలలకోసారి కొంత మొత్తాన్ని వీరి కోసం విడుదల చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. బడి సంఖ్య మేరకు ఇద్దరికి డబ్బులు మంజూరయ్యాయి. వచ్చిన డబ్బును తల్లీకూతుర్లకు ఇవ్వాలని అందరం నిశ్చయించాము.

పదినెలల కాలానికి ప్రభుత్వం వేతనం పంపింది. వారికది పెద్ద మొత్తంగా కనిపించింది. గతంలో నెలనెలా మేము డబ్బును ఆమె జీతం నుండి మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ఆమెకు ఇచ్చాను.
”నీ కూతురి జీతం మా వద్దే పెట్టుకొని అందులో నుండి ప్రతినెలా గతంలోలాగా ఇస్తాను. ప్రభుత్వం ప్రతినెల ఠంచనుగా ఇవ్వదు. మూడు నెలలకోసారి ఇస్తదట. వచ్చాక అవి కూడా ఇస్తం’ అన్నాను.
”బాకీలు బాగా ఉన్నాయి. బిడ్డ జీతం కూడా ఇవ్వు” అంది.
”ఇది వరకు ఇచ్చినట్లు నెల నెలా మా జేబు నుండి డబ్బులు ఇవ్వడానికి ఎవరూ సుముఖంగా లేరు. నీకు కష్టమైతది. ఆలోచించు” అన్నాను.
”మూడు నెలలకోసారి ఇవ్వండి”
”ప్రభుత్వం ఎప్పుడు ఎట్లా ఇస్తె అట్లా ఇస్త”

”ఇప్పుడైతే అవ్వి ఇవ్వండి.” అంటూ టేబుల్‌పై ఉన్న డబ్బుల్ని తీసుకొంది. అట్లా తీసుకుంటున్నప్పుడు ఆమె కంటిలో వెలుగు, మొహంలో నవ్వు, చేతుల్లో తొందర ఆమె అవసరాల్ని తెలిపాయి. నాకు ఆమె రేపటి పట్ల భయం కలిగింది. నేడు గడిస్తే చాలన్నట్లుంది.
క్రమంగా ఆమె మొహంలో వెలుగు మాయమైంది. చింత చెదపురుగులాంటిది. బక్క చిక్కింది. పరధ్యానం పనికి అడ్డంకి అయింది. మానసికంగా, శారీరకంగా భర్త, అల్లుడు వేసిన దెబ్బల ప్రభావం చూపసాగాయి. దానికి తోడు వయసు మీదపడింది. కళ్ళలో బెదురు వచ్చి చేరింది. చాలా రోజులుగా ఆమె ఏదో అడగాలని అడగలేకపోవడాన్ని గమనించాను. ఒక రోజు ఇలా అడిగింది.
”సారూ ఎములాడపోవాలె, పైసలియ్యరా”
”వేములవాడకు పోవుడెందుకు”
”దేవుణ్ణి నమ్ముకుంటె కష్టాలు పోతయి”
ఇలా అనేక సార్లు అంతూ పొంతూ లేని జవాబులు ఇచ్చింది. కొద్ది రోజుల్లోనే మూర్తీభవించిన వేదనలా మారింది.

”సారు అన్నం తినరా” ఆమె మాటలతో వర్తమానం లోకి వచ్చాను.
”పొద్దున అలా ఎందుకు చేశావు.”
”దేవుడచ్చింది”
”ఎందుకొస్తది”
”మా తాత వాళ్ళు రాయేశుని దగ్గరికి పోయేటోల్లు. మొక్కులు చెల్లించెటోల్లు. మా నాయన మాత్రం పోలేదు. ఎందుకు పోలేదో తెలియదు. తరువాతనే నాకు దేవుడచ్చుడు మొదలైంది.”

”దేవుడు నీ మీదికే ఎందుకొచ్చిండు”
”ఆడబిడ్డ మీదికి రాకపోతె ఎక్కడికి పోతడు”
ఆమె అవగాహన ఆశ్చర్యపరచింది.
సాయంత్రం 5 గం||లు.
ప్రయాణం తప్పని బాటసారివలె బ్యాగ్‌ భుజానికేసుకొని బస్సెక్కాను. కూర్చోను జాగలేక నిల్చున్నాను. హన్మకొండ నుండి హుజూరాబాద్‌ వరకు నిలబడి అప్పుడు కూలబడ్డాను. ఎప్పటిలాగే కరీంనగర్‌లో బస్సు రాత్రి 7-20కి దింపింది. రాత్రి ఎనిమిది వరకు శరీరానికి ఆహారాన్ని ఎక్కించాను. అచేతనంగా కళ్ళుమూసాను. ఫోన్‌ నోటిఫికేషన్‌ విసిరింది. ఎప్పటిలాగే నిద్ర చెట్టెక్కింది. సెల్‌ఫోన్‌ దూరం పెట్టాను.

డా.బి.వి.ఎన్‌. స్వామి, 9247817732

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -