ఇరాన్ యుద్ధం నుంచి ‘సురక్షిత నిష్క్రమణ’కు ట్రంప్ ముమ్మర యత్నాలు
మరోపక్క ఒప్పందానికి రాకపోతే భీకరదాడులంటూ హెచ్చరికలు
విజేతగా నిరూపించుకునేందుకు తహతహ
వాషింగ్టన్ :అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం చేసిన ప్రకటన ఇరాన్ యుద్ధం నుంచి ఎలాగైనా బయటపడాలనే తన ఆత్రుతను కనబరిచింది. ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే రెండూ మూడు వారాల్లో ఆ దేశంపై భీకర దాడులు చేస్తామని, ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ కొనసాగుతుందని చెప్పడం వెనుక ఆయన ద్వంద్వ బుద్ధి బయటపడింది. అంతేకాక ఆయన ప్రసంగం స్వీయ సంతృప్తిని, ఇప్పుడు ప్రపంచ వేదికపై కోల్పోతున్న తన ప్రభావాన్ని కప్పిపుచ్చే పాత హెచ్చరికల మిశ్రమంగా కనబడింది. దీన్ని సైనిక దృక్కోణం నుంచి చూస్తే ఇదొక వ్యూహాత్మక ప్రణాళిక కాదని, పరువు నిలుపుకుంటూ నిష్క్రమించేందుకు వేసిన బాటని తెలుస్తోంది.
ఓటమిగా ముద్రపడకుండా….
తన షరతులపై యుద్ధాన్ని ముగించానని ప్రపంచానికి తెలియజేసేందుకు ట్రంప్ చివరిసారిగా ఒక పెద్ద బాంబు దాడి లేదా వైమానిక దాడిని ప్రారంభించాలనుకుంటున్నారు. అంతేకాక ‘ఓటమి’గా ముద్రపడకుండా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పించే ఒక ‘విజయాన్ని’ రచించడానికి ఆయన ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. దీని ద్వారా ఆయనొక విజేతగా నిరూపించుకోవాలనుకుంటున్నారని స్పష్టమవుతోంది.
ఇరాన్ యుద్ధంపై విసుగు.. మాటల వెనుక దాగిన నిజం
ప్రసంగం మధ్యలో ట్రంప్ వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల కాలక్రమాలను పోల్చడాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంతో ఆయన తీవ్రంగా విసిగిపోయారని అర్థమవుతుంది. ఈ 33 రోజుల పోరాటాన్ని చరిత్రలోనే ‘గొప్ప సైనిక విజయం’ అని పిలవడం ద్వారా ఆయన అమెరికా ప్రజలకు ‘ఇక చాలు’ అనే మానసిక సందేశాన్ని పంపుతున్నారు. మధ్యప్రాచ్యంలో మరో సుదీర్ఘ యుద్ధం తన దేశీయ ఆర్థిక వ్యవస్థకు, తన ”అమెరికా ఫస్ట్” ప్రతిష్టకు హాని కలిగిస్తుందని ట్రంప్‌నకు బాగా తెలుసు. పెరుగుతున్న చమురు ధరలు , దేశీయ స్టాక్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు అమెరికా అధ్యక్షుడి ఆందోళనలను పెంచాయి. దీంతో తన ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఆయన దీనిని ”స్వల్పకాలికం” అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్ట పోయిందని, వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆ దేశ కీలక నాయకత్వాన్ని తొలగించామని దీంతో ‘ఇకపై ఇరాన్ ముప్పు కాదు’ అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.
అవే పాత వాదనలు.. ‘ట్రూత్ సోషల్’ ప్రతిధ్వనులు
ట్రంప్ ఈ ప్రసంగంలో చేసిన వాదనలు కూడా వాస్తవానికి కొత్తవి కావు. ఇరాన్ నాయకత్వాన్ని నిర్మూలించడం, ”ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్” ద్వారా అణు కర్మాగారాలను ధ్వంసం చేయడం, లేదా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తామని బెదిరించడం వంటి వాదనలేవైౖనా ఆయన తన సోషల్ మీడియా వేదిక ”ట్రూత్ సోషల్”లో గత కొన్ని రోజులుగా పునరావృతం చేస్తున్నవే. ఒక దేశాధినేత తన సైనిక బెదిరింపులను సోషల్ మీడియాలో పదేపదే ప్రసారం చేసినప్పుడు, వాటిలోని సంచలనం తగ్గిపోతుంది. ట్రంప్ వాదనలు ఎంతగా పాతబడిపోయాయంటే, వాటిని కేవలం ప్రచారంగా మాత్రమే పరిగణిస్తున్నారు. అంతేకాక ఈ వాదనలను పదేపదే చేయడాన్ని చూస్తే ట్రంప్ వద్ద చెప్పడానికి కొత్తగా ఏమీ మిగల్లేదని స్పష్టమవుతోంది.
హార్ముజ్ నుంచి వైదొలగడానికి సన్నాహాలు
‘ఇతర దేశాలు ఇప్పుడు హార్ముజ్ జలసంధిని రక్షించాలి’ అని ట్రంప్ చేసిన ప్రకటన కూడా ఈ వ్యవహారం నుంచి తను నిష్క్రమిస్తున్నాడనడానికి స్పష్టమైన సాక్ష్యం. మధ్యప్రాచ్య భద్రతా భారాన్ని మోసే పరిస్థితిలో ట్రంప్ లేరు. ఆ విషయాన్ని చెప్పలేకే ఆయన అమెరికా తన పనిని (ఇరాన్‌ను బలహీనపరచడం) పూర్తి చేసిందని, ఇప్పుడు ఈ ఖరీదైన గందరగోళం నుంచి బయటపడాలని కోరుకుంటోందని స్పష్టంగా సంకేతం ఇచ్చారు. అందులో ట్రంప్ యొక్క విలక్షణమైన నాటకీయత కనిపించింది. రాబోయే కొన్ని రోజుల్లో ట్రంప్ ఒక బూటకపు ‘సంపూర్ణ విజయం’ ప్రకటించి ఈ యుద్ధం నుంచి వైదొలుగుతారు.
అమెరికా ఏ దాడి చేసినా తిప్పికొడతాం.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్
టెహ్రాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధం 34వ రోజుకు చేరుకుంది. ఇరుదేశాల పరస్పర దాడుల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా జరిపే ఏ భూతల దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ గురువారం ప్రకటించారు. ఇందుకోసం 7 మిలియన్ల ఇరానీయులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అమెరికాతో సంప్రదింపుల భాగస్వామిగా పేరు వినిపిస్తున్న మహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు సవాలు విసురుతూ వరుసగా ఆన్‌లైన్ పోస్టులు పెడుతున్నారు.



