సంక్లిష్టంగా సెమీఫైనల్ మార్గం
రెండు విజయాలూ సరిపోని పరిస్థితి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇండియా సూపర్8లో ఒక్క ఓటమితో రేసులో వెనుకంజ వేసింది. 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. ఆతిథ్య జట్టును దారుణంగా దెబ్బతీసింది. ఈ ఓటమి డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో చిచ్చు రేపటంతో పాటు సెమీఫైనల్ రేసులో భారత్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. లోపం లేని జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు ఎందుకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు? ఈ ఓటమిని అధిగమించి సెమీఫైనల్‌కు చేరుకునేందుకు భారత్ ముందున్న మార్గాలేమిటి?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో పుంజుకునే అవకాశం ఉండేలా ఉండగా, సూపర్8లో అటువంటి వెసులుబాటే లేదు. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించే సూపర్8లో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. సెమీఫైనల్ రేసు సంక్షిష్టంగా మారుతుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇండియా ఇప్పుడు ఈ గడ్డు స్థితినే ఎదుర్కొంటుంది. సూపర్8 గ్రూప్-1లో భారత్, దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. ఈ నాలుగు జట్లూ గ్రూప్ దశలో ఒక్క ఓటమి చవిచూడలేదు. సూపర్8లో భారత్‌పై విజయంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువైంది. తొలి పోరులోనే ఓడిన టీమ్ ఇండియా.. జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయాలు సాధిస్తే సరిపోదు. గురువారం చెన్నైలో జింబాబ్వేతో, ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది.
భారత్, వెస్టిండీస్ మ్యాచ్ సూపర్8 దశలో ఆఖరు. అంతకముందే.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ కూడా ముగియనుంది. దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్, జింబాబ్వేలపై నెగ్గితే గ్రూప్-1 నుంచి మరో సెమీస్ బెర్త్ కోసం పోటీ ఉంటుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో దారుణ ఓటమితో భారత్ నెట్‌రన్‌రేట్ బుణాత్మకం అయ్యింది. జింబాబ్వేపై 100 ప్లస్ పరుగుల తేడాతో నెగ్గితేనే.. భారత్ నెట్‌రన్‌రేట్ మళ్లీ మెరుగు కానుంది. అప్పుడు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ అప్పటి సమీకరణాలకు అనుగుణంగా విజయం సాధిస్తే సెమీఫైనల్‌కు చేరుకునేందుకు వీలుంటుంది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా సైతం వెస్టిండీస్, జింబాబ్వేలపై కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడే గ్రూప్-1లో దక్షిణాఫ్రికా తర్వాత భారత్ ఉత్తమ జట్టుగా నిలుస్తుంది. కానీ.. దక్షిణాఫ్రికాను వెస్టిండీస్ ఓడిస్తే.. భారత్ సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరైనట్టే భావించాలి.
వరుస విజయాలతో మెరుగైన రన్‌రేట్‌తో ఉండే వెస్టిండీస్.. భారత్‌తో మ్యాచ్‌లో ఓడినా.. అంతరం తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. లేదంటే, సెమీఫైనల్ బెర్త్‌ను వెస్టిండీస్ ఎగరేసుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను చిత్తు చేసిన జింబాబ్వేను సైతం అటు భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా తేలిగ్గా తీసుకునే పరిస్థితి కనిపించటం లేదు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే సూర్యకుమార్ సేనకు ఇది కఠిన పరీక్ష. అలవోక విజయాలు, ఏకపక్ష మ్యాచ్‌లు, ఎదురులేని జోరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన టీమ్ ఇండియా.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో తనదైన జోరు చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చెమట పట్టకుండా సాధించే విజయాల కంటే.. ఒత్తిడిని చిత్తు చేస్తూ టైటిల్ అందుకుంటే ఆ మజానే వేరు. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కోచ్, కెప్టెన్‌లు వ్యూహం సిద్ధం చేయాలి. ప్రత్యర్థి జట్లు బలాబలాలకు అనుగుణంగా మ్యాచ్ ప్రణాళికలను మార్చుకుంటే ముందుకెళ్తే.. సెమీఫైనల్ రేసులో టీమ్ ఇండియాకు తిరుగుండదు!.
- నవతెలంగాణ క్రీడావిభాగం



