రిటైర్మెంట్ తర్వాత ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి
అప్పుడే ఈహెచ్‌ఎస్‌కు 1.5 శాతం చందా కడతాం: టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అరకొర సీపీఎస్ పెన్షన్‌తో వృద్ధాప్యంలో వైద్య ఖర్చులను ఎలా భరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌లో కొనసాగించేందుకు మూల వేతనం నుంచి 1.5 శాతం చందాను మినహాయించాలని ప్రభుత్వం భావిస్తున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపింది. ఈ మేరకు టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్ విధానం వల్ల రిటైర్మెంట్ తర్వాత వచ్చే నామమాత్రపు పెన్షన్‌తో వృద్ధాప్యంలో పూట గడవడమే కష్టంగా మారిందని తెలిపారు. ఇలాంటి దుస్థితిలో రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఉచిత ఆరోగ్య భద్రత కల్పించకుండా ఇప్పుడు తమ జీతాల నుంచి 1.5 శాతం చందా వసూలు చేయడం దారుణమని విమర్శించారు.
ఇప్పటికే సీపీఎస్ విధానం కోసం 10 శాతం మూలవేతనం డీఏలో కోత విధిస్తున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఈ అరకొర పెన్షన్‌తో రూ.లక్షల వైద్య ఖర్చులు ఎలా భరించాలి? ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తేనే, మూలవేతనం నుంచి 1.5 శాతం మొత్తాన్ని చందా ఇవ్వడానికి 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు సమ్మతి తెలుపుతారని తెలిపారు.
ఈ పథకం కోసం ప్రభుత్వం తన వంతుగా చెల్లించే 1.5 శాతం కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అయ్యాక ‘హెల్త్ అల్లోవన్స్’గా జమ చేసి, ఈహెచ్‌ఎస్ ద్వారా ఉచిత ఆరోగ్య భద్రత సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించినట్టు అవుతుందని తెలిపారు. ప్రభుత్వం చర్చలు జరిపే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాల్లో ఒక్కరు కూడా సీపీఎస్ సంఘం నుండి ప్రతినిధి లేకపోవడం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఎలా భరించాలి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



