పిల్లలను బాగా పెంచి ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే పిల్లలను పెంచడమంటే వారిని నియంత్రించడం కాదని, మార్గనిర్దేశం చేయడమని నిపుణులు అంటున్నారు. వారికి క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కానీ, ఆ పని ఇలా చేయాలి, అలా చేయకూడదని బలవంతం చేయడం వల్ల పిల్లల్లో కోపం, భయం వంటి వాటికి దారితీస్తాయని చెబుతున్నారు. ఇలాంటప్పుడు పెద్దవాళ్లు చేయాల్సిన పనులేంటే తెలుసుకుందాం…
బలవంతం వద్దు: పిల్లలు చేసే చిన్న చిన్న పనులపై కూడా పేరెంట్స్ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారి ప్రవర్తనను సరిగ్గా గమనించకపోతే తప్పు దారి పట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అయితే క్రమశిక్షణ పేరుతో మీ కోరికలను పిల్లలపై రుద్దడం మంచిది కాదంటున్నారు. దీని వల్ల వారి జీవితంలో ఈ విషయం మానని గాయంగా మారుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే పిల్లలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో వారు మిమ్మల్ని శత్రువుగా భావించే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
క్షమాపణ చెప్పడం : సాధారణంగా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పమని పేరెంట్స్ చెబుతుంటారు. అయితే ఇలా సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు చెప్పుతున్నారో వారికి తెలియజేయాలి. వారి ప్రవర్తన వల్ల ఇతరులు ఎలా ఇబ్బందిపడ్డారో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. లేకపోతే పిల్లలు దాన్ని నెగిటివ్‌గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఆహారం విషయంలో: నచ్చినా, నచ్చకపోయినా అన్నం తినాల్సిందే అని పిల్లలపై చాలా మంది ఒత్తిడి తెస్తుంటారు. ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. అందుకే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినేలా చూడాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పోషకాలు కూడా అందుతాయి. అలాగే భోజనం చేసే టైంలో వారితో స్నేహపూర్వకంగా, ఆనందంగా ఉండాలి.
కెరీర్ విషయంలో: పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రతిభ, ఆసక్తులు కలిగి ఉంటారు. విద్య, వృత్తి విషయంలో తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటారు. అయితే కెరియర్ విషయంలో వాళ్లను బలవంతపెట్టొద్దని నిపుణులు అంటున్నారు. వాళ్లకు నచ్చిన కోర్సులు ఎంచుకునేలా ప్రోత్సహించాలి. ఒకవేళ వారు తీసుకున నిర్ణయాలలో తప్పులుంటే వాటి వల్ల వివరించాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల తమకు తల్లిదండ్రులు అండగా ఉన్నారనే భావన పిల్లల్లో ఏర్పడి, వారు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.