Tuesday, May 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి“వాళ్లు” వ్యవస్థనెలా ఎదిరించగలిగారు?

“వాళ్లు” వ్యవస్థనెలా ఎదిరించగలిగారు?

- Advertisement -

సమాజాన్ని మార్చడానికి కలిసి పనిచేసిన వారిలో కార్ల్‌మార్క్స్ – ఫ్రెడరిక్ ఎంగెల్స్, మావో -ఛూటే (చైనా సైన్యాధికారి, రాజకీయ విప్లవకారుడు), ఫిడెల్ కాస్ట్రో- చేగువేరా జంటలు, జ్యోతిరావు ఫూలే -సావిత్రిబాయి ఫూలే దంపతులు చరిత్రను సృష్టించారు. కార్ల్ – జెన్ని మార్క్స్ దంపతుల కృషి ప్రత్యేకం. వామపక్ష విప్లవోద్యమంలో కలిసి పనిచేసిన దంపతులు, ఉద్యమంలో దంపతులుగా మారినవారు చాలామంది ఉన్నారు. కలిసి కషిచేయడంలో వ్యక్తుల విడివిడి శక్తులు కలిసి ఎక్కువ మోతాదు సమాహార శక్తిగా మారుతుంది. జీవిత సహచరితో కలిసి విప్లవిస్తే ఉద్యమానికి కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల మాన్యత, సహాయసహకారాలు లభిస్తాయి. జెన్ని, సావిత్రిబాయిల మధ్య కొంత సామ్యత ఉంది. జెన్ని ప్రభువర్గ ఉన్నత సామాజిక తరగతి మహిళ. సావిత్రి తండ్రి గ్రామాధికారి. సావిత్రి పెళ్లికి ఉన్నత తరగతులవారికి, సంపన్నులకు మాత్రమే సాధ్యమైన ఏనుగు అంబారీని ఏర్పాటు చేశారు.

ఇండియాలో ఇద్దరు మహాత్ములున్నారు. జ్యోతిరావు ఫూలే, మోహనచంద్ గాంధీ. జోతిబా బాల్యం నుండే “తక్కువ” కులాల, అణగదొక్కబడినవారి శ్రేయోభిలాషి. భార్యను సామాజిక విప్లవకారిణిని చేశారు. భారత తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు కావడంలో ఫాతిమా షేక్‌ను ప్రోత్సహించారు. కేరళ, కొట్టాయం జిల్లా వైక్కోం పట్టణంలో, నాలుగు వీధుల్లో అంటరానివారు తిరగరాదని, ఆ చుట్టుపక్కల కనిపించకూడదని కట్టడిచేశారు. దీనికి నిరసనగా పెరియార్ సత్యాగ్రహం చేపట్టారు. ఆయన సత్యాగ్రహాన్ని మాన్పించ డానికి 09మార్చి1925 న మహాత్మా గాంధీ వైక్కోం వెళ్లారు. పెరియార్ ప్రశ్నలకు సమాధానంగా గాంధీ, “ఈరోజు వీధుల్లో తిరగనిస్తే రేపు గుడిలోకే వస్తామంటారేమో! అప్పుడెలా?” అన్నారు. అయితే గాంధీ కాలక్రమేణా సామ్రాజ్యవాదతత్వం, మతకుల వివక్షతలను వదిలి మహాత్ముడయ్యారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసినవారిని (మగవాళ్లు) మహాత్ములు అన్నారు. మహాత్మురాళ్లు లేకపోవడం మగ సంస్కృతికి సంకేతం.

ఆకలితో అలమటించేవారు సొంత సమస్యలనే గుర్తించలేరు. స్వీయ, సామాజిక సమస్యల పరిష్కార పోరాటాలు వారి నుంచి ఆశించ లేము. అయితే గదిలో బంధించబడి కొట్టబడుతున్న పిల్లి తిరగబడినట్లు మితిమీరిన హింసలకు గురయిన వ్యక్తులు ఒంటరిగానో, సంఘాలు నిర్మించుకునో అన్యాయాలను ఎదిరించిన ఘటనలు కొల్లలు. హరిజన పదాన్ని గాంధీ, దళిత పదాన్ని జ్యోతిబా ఫూలే సష్టించారు. హరిజన పదప్రయోగాన్ని కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. దళిత పదాన్ని అన్ని సందర్భాల్లో వాడరాదు. వీటికి బదులు రాగం అనుమతించిన అదిసూచిత కులాలు, తెగలు (ఎస్సీ,ఎస్టీ) అని వాడాలి. మూలవాసులు పదప్రయోగం సార్థం, శ్రేష్టం. మూలవాసుల నాయకులు జోతిబా, ఆంబేడ్కర్‌లు బాల్యంలో సామాజిక అన్యాయానికి గురయ్యారు. యౌవనం నుండి వారికీ ఆర్థిక వివక్ష లేదు. జోతిబా అరవై ఎకరాల యాజమాని. పది జతల ఎద్దులు, మూడు ఆవులు, ఇల్లు, సౌకర్యాలు, మేలుజాతి గుర్రం, గుర్రబ్బండి కలవాడు. “ఉన్నత” కులస్తుల ఆదరాన్ని, బరోడా (శూద్ర) రాజు సాయాజి గైక్వాడ్ గౌరవాన్ని పొందినవాడు. జోతిబా వ్యాపారి, గుత్తేదారు, పూనా మునిసిపాలిటి నియమిత సభ్యుడు.

బ్రహ్మ, ఆర్య, ప్రార్థనా సమాజ్ సంస్థలన్నిటికీ జాతీయ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయి. కాంగ్రెస్ నాయకుల్లో పలువురు హిందు సంస్థల సభ్యులు, నాయకులు. కాంగ్రెస్ తాత్వికవాదుల భక్తివిశ్వాసాలు, హిందు జాతీయవాదం బ్రాహ్మణత్వ దక్పథాలతో నిండి ఉన్నాయి. హిందుత్వశక్తులు దళితులకు వ్యతిరేకం.అయితే జాతీయోద్యమకాలంలో శూద్రులు మొదట కులవ్యవస్థకు వ్యతిరేకంగా సంఘటిత పడ్డారు. బ్రాహ్మణత్వ ఆచారాలకు, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మత సాంస్కృతిక నిరసనలను ప్రోత్సహించడానికి శూద్రులను, అతి శూద్రులను చైతన్యపరిచి, సంఘటితపరిచే ఉద్దేశాలతో ఫూలే 1873 లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ఇది కాంగ్రెస్ రాజకీయాలకు, హిందువాద ఆలోచనలకు భిన్నమైంది. బ్రాహ్మణవాదాన్ని పరాకరించింది.
జోతిబా ఇరుగుపొరుగు ముస్లిం పిల్లలతో ఎక్కువగా ఆడుకునేవారు. వారి సాంగత్యంలో మతం ముసుగులో జరుగుతున్న వంచన, కపట నైపుణ్యతలు, తప్పుడు ప్రచారాలు, మూఢనమ్మకాల గురించి తెలిసింది. జోతి ఉత్సాహం గమనించిన ఇరుగుపొరుగువారు – పర్షియన్ పండితుడు మున్షీ గఫార్ బేగ్, బ్రిటిష్ ఉద్యోగి లిజిత్ సాహబ్ లు – ఆలస్యమయినా ఆంగ్లంలో చదవమని సలహా ఇచ్చారు. జోతికి చదువు అవసరమని గోవిందరావుకు నచ్చచెప్పారు. జోతి మనో వికాసానికి, బంగారు భవిష్యత్తుకు అవకాశమివ్వమని కోరారు. గోవిందరావు ఒప్పుకున్నారు. జోతిబాకు ఉస్మాన్ షేక్ మంచి మిత్రుడు. జోతిబా ఆంగ్లో-అమెరికన్ రాజకీయ సిద్దాంతవేత్త, తాత్వికుడు, విప్లవకారి థామస్ పెయిన్ రాసిన ‘మనిషి హక్కులు’ పుస్తకం చదివారు. ఇది ఫ్రెంచ్ విప్లవ చరిత్ర. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావాల ప్రాధాన్యతను వివరించింది. సామాజిక పరివర్తనకు అంతరదృష్టిని కలిగించింది. థామస్ పెయిన్ రచనల నుండి భౌతిక ప్రపంచ దృక్పథం, మానవ హక్కులను గురించి తెలుసుకున్నారు ఫూలే.

ఒక బ్రాహ్మణ వితంతువు కాశీబాయి, ఫూలేల సంరక్షణ కేంద్రంలోనే మగ శిశువును ప్రసవించి చనిపోయారు. ఫూలే దంపతులు ఆ పసికందును పెంచుకున్నారు. ‘యశ్వంతరావు’ అని పేరుపెట్టారు. యశ్వంతరావు వైద్యుడయ్యారు. మూలవాసులూ శుభాశుభకార్యాలను బ్రాహ్మణులతో చేయించుకుంటారు. అయినా బ్రాహ్మణుడయిన యశ్వంత్ తమ కులస్తుడు కానందున ఆయన జోతిబా అంత్యక్రియలు చేయరాదని బంధువులు వాదించారు. ఈ విషయంపై బంధువుల మధ్య పెద్ద చర్చ, ఒక మోస్తరు గొడవ జరిగాయి. పోలీసులను పిలిచి బంధువులను వెళ్లగొట్టవలసివచ్చింది. చివరికి విభిన్న కులస్తులు జోతిబా శవాన్ని మోశారు. యశ్వంత్, బంధువుల కుర్రవాడు గజానన్ ఇరువైపులా చేతులు పట్టుకోగా సావిత్రిబాయి నీటి కుండను మోసుకెళ్లారు.
భీంరావు ఆంబేడ్కర్ ఆంగ్ల సైన్యంలో సైన్యాధికారి రాంజి కొడుకు. మహర్ (మాల) కులస్తులైన వీరి ఇంటిపేరు సక్పాల్. ఒక బ్రాహ్మణ గురువు తన ఇంటిపేరు ఆంబేడ్కర్‌ను భీంరావుకు ఇచ్చారు. శూద్ర రాజులైన బరోడా రాజు సాయాజి గైక్వాడ్, కొల్హాపుర్ రాజు సాహు ఛత్రపతిల ఆర్థిక సహాయంతో విదేశాల్లో ఆనాడు ఎవరూ చదవనంతటి ఉన్నత చదువులు చదివారు భీంరావు ఆంబేడ్కర్. ఆర్థిక వెసులుబాటు కలవారు కనకునే మూలవాసి నాయకులు జోతిబా, ఆంబేడ్కర్‌లు తమ కోసం కాకపోయినా, ఇతర దళితుల కోసం, స్త్రీలోకం కోసం, భవిష్యత్తరాల కోసం కులమత వివక్షతలను, పీడనలను, అన్యాయాలను ఎదిరించారు. వాటి నిర్మూలనకు విశేష కృషిచేశారు. విద్య తెలివిని, తెలివి ప్రగతిని, ప్రగతి సంపదను ఇస్తాయని, సంపద దళితుల సర్వస్వమని జోతిబా అన్నారు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -