అజేయ సెంచరీ, అర్ధ సెంచరీతో జోరు
ముస్తాక్‌అలీ హెచ్‌సీఏ ప్రాబబుల్స్
హైదరాబాద్ : యువ బ్యాటర్ హృషికేశ్ సింహా ధనాధన్ దంచికొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ హెచ్‌సీఏ ప్రాబబుల్స్‌లో వరుస మ్యాచుల్లో అజేయ సెంచరీ, అజేయ అర్థ సెంచరీతో విరుచుకుపడ్డాడు. శుక్రవారం ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో జరిగిన ప్రాబబుల్స్ మ్యాచ్‌లో హెచ్‌సీఏ గ్రీన్‌పై 52 బంతుల్లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. పది ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టిన హృషికేశ్ హెచ్‌సీఏ బ్లూకు అలవోక విజయాన్ని అందించాడు. సింహా జోరుతో బ్లూ టీమ్ తొలుత 20 ఓవర్లలో 245/2 పరుగులు చేయగా.. గ్రీన్ టీమ్ 20 ఓవర్లలో 208/6 పరుగులే చేసింది. 37 పరుగులతో బ్లూ టీమ్ విజయం సాధించింది. ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లోనే జరిగిన మరో మ్యాచ్‌లో హృషికేశ్ సింహా (83 నాటౌట్, 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) విశ్వరూపం చూపించాడు. దీంతో రెడ్ టీమ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని బ్లూ టీమ్ 15.5 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రాబబుల్స్‌లో రెండు మ్యాచుల్లో హృషికేశ్ సింహా అజేయంగా 183 పరుగులు చేసి, ఓవరాల్‌గా పరుగుల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.



