Tuesday, March 3, 2026
E-PAPER
Homeజాతీయంఉద్యోగులకు భారీ నిరాశ

ఉద్యోగులకు భారీ నిరాశ

- Advertisement -

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు యథాతథం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 7 కోట్ల మంది ఎంప్లాయిస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. పెరిగిన ధరల నేపథ్యంలో తమ రిటైర్మెంట్‌ పొదుపుపై వడ్డీ రేటు పెరుగుతుందని మూడేండ్ల నుంచి ఆశిస్తోన్న ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. సోమవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జరిగిన 239వ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను వడ్డీ రేటును గత ఏడాదిలోని 8.25 శాతాన్నే ప్రకటించారు. 2022-23లో వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండగా, 2023-24లో దానిని స్వల్పంగా 8.25 శాతానికి పెంచారు. అప్పటి నుండి వరుసగా మూడవ ఏడాది కూడా వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.

మోడీ సర్కార్‌ అధికారంలోకి రాకముందు 2013-14లో 8.75 శాతంగా ఉన్న ఈపీఎఫ్‌ రేటుకు క్రమంగా కోత పెడుతూ.. 2021-22లో అత్యల్పంగా 8.10 శాతం అందించింది. ఆ తర్వాత కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పల్పంగా పెంచింది. మరోవైపు స్తబ్దుగా ఉన్న ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి సీబీటీ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో రూ.1,000 కంటే తక్కువ నిధులు ఉన్న 1.33 లక్షల ఖాతాలను గుర్తించి, వాటిలో ఉన్న మొత్తం రూ. 5.68 కోట్లను సెటిల్‌ చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రధానంగా వడ్డీ రేటు పెరగకపోవడం పట్ల కార్మిక సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్‌ అనిశ్చితిని సాకుగా చూపిస్తూ.. ప్రభుత్వం కోట్లాది మంది మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని వారు విమర్శిస్తున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపిన తర్వాత, ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన వెంటనే చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -