నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి, సుమారు రూ. 12,000 కోట్ల విలువైన ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్‌ను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తమ గూఢచారులను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ‘వాఘ్దేవి ల్యాబ్స్’ అనే నకిలీ లైసెన్స్‌తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడైన శ్రీనివాస్‌తో పాటు అతని సహచరుడు తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ప్రాథమికంగా 100 గ్రాముల ఎండీ డ్రగ్, రూ. 25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో జరిపిన సోడాలలో డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు 32,000 లీటర్ల రసాయనాలతో పాటు, భారీ ఉత్పత్తి యూనిట్లను కూడా సీజ్ చేశారు.
ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మాదకద్రవ్యాలను మహారాష్ట్రతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంత పెద్ద నెట్‌వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.