18 మంది మృతి
నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కటోల్ ప్రాంతంలోని ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న సుమారు 18 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం కొంతమేర కుప్పకూలడంతో మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో రసాయనాల మిక్సింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌్‌లోని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మృతదేహాలు గుర్తుపట్ట లేనంతగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించడంతోపాటు, ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కర్మాగార యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభు త్వం హామీ ఇచ్చింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



