– లక్షల విలువైన సంచులు కాలి బూడిద
నవతెలంగాణ – మెట్‌పల్లి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో గోనె సంచులు నిల్వ చేసిన గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 9గంటల సమయంలో గోదాం పైభాగం నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి మరో రెండు అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం వరకూ మంటలు అదుపులోకి రాకపోవడంతో జేసీబీ సాయంతో గోదాము గోడలను కూల్చివేసి లోపలున్న గోనె సంచులను బయటకు తెస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి గోదాంలో 9లక్షలకుపైగా గోనె సంచులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిలో సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు కాలిపోయి ఉండొచ్చని అంచనా వేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాలిపోయిన గోనె సంచుల విలువ సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండవచ్చని జిల్లా సివిల్ సప్లరు మేనేజర్ జితేంద్ర ప్రసాద్ అంచనా వేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. గోదాంలో విద్యుత్ సౌకర్యం లేనందున పోలీసులు ఆకతాయిలు ఎవరైనా అంటించి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన గోదాం వద్ద మద్యం సేవించిన ఆనవాళ్లు ఉన్నందున పోలీసులు ఆ దిశలో విచారణ చేపడుతున్నారు.
గోనె సంచుల గోదాములో భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES