వేలాది యువతకు ఉపాధి అవకాశాలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో టిపిసిసి సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని జీసీఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున జాబ్ మేళాను నిర్వహించింది. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చర్చి రోడ్డులో గల పార్సిరాముల కళ్యాణమండపంలో ఈ జాబ్ మేళా ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి గత 15 రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించగా, సుమారు 2000 మంది నిరుద్యోగ యువత ఆన్లైన్‌లో నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 12 గంటల వరకు దాదాపు 2500 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇంకా మరో 2000 మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో ఎం ఎస్ ఎన్ లేబరేటరీస్, జెసిబి, అపోలో హాస్పిటల్స్, అమెజాన్, డీమార్ట్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు పలు మెడికల్ ఏజెన్సీలు, ఇతర కంపెనీలు పాల్గొన్నాయి. పదవ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదివిన యువతకు రూ.12000 నుండి ఆపై వేతనం వరకు ఇస్తూ ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. స్థానికంగా ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం పట్ల యువత జెసిఆర్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.



