వాషింగ్టన్ : ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్‌బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు కృత్రిమ మేధా (ఏఐ) స్టార్టప్ కంపెనీ పర్‌ప్లెక్సిటీ ఆసక్తి చూపింది. పర్‌ప్లెక్సిటీ కోఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ కంపెనీ గూగుల్‌కి మొత్తం 34.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల కోట్లు) ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇది పర్‌ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే ఎక్కువ కావడం గమనార్హం. బ్రౌజర్ విషయంలో గూగుల్ క్రోమ్ గుత్తాధిపత్యం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దాన్ని విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నుంచి ఓ వైపు ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో పర్‌ప్లెక్సిటీ నుంచి ఈ భారీ ఆఫర్ రావడం విశేషం. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు పర్‌ప్లెక్సిటీ ఇతర పెట్టుబడిదారుల సాయం తీసుకోనుంది.