జైపూర్ : కస్టోడియన్ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజస్తాన్‌లో రైతులు కదం తొక్కారు. రాష్ట్రంలోని దిద్వానాలో రైతులు మంగళవారం రెహ్మాన్ గేట్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర మహా పాదయాత్ర నిర్వహించారు. కస్టోడియన్ భూములను స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల రైతులు నిరసనలో భాగమయ్యారు. అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా కలెక్టర్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం తమ పూర్వీకుల భూములను లాక్కుంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చేతన్ దూడి, రైతు నాయకుడు భగీరథ్ యాదవ్, సీపీఐ(ఎం), అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) కార్యకర్తలతో పాటు కాంగ్రెస్, ఆర్‌ఎల్‌పి నుంచి కూడా వందలాది మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అనేక మంది రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్నారు. ‘రైతుల గొంతు అణచివేయలేరు.. పోరాటం మరింత ఉధృతం చేస్తాం’ అంటూ నినాదాలు చేశారు.



