– ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యం
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రి ఆవరణంలో ప్రత్యేక క్యాంప్‌లో భాగంగా సంపూర్ణ సురక్ష కేంద్రం, ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా ప్రత్యేక వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆరోగ్య వారోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ప్రత్యేక వర్గాల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని తెలిపారు. పరిశుభ్రత, పోషకాహారం, నివారణాత్మక వైద్యంపై దృష్టి పెట్టడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారి రవీందర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్, డీసీహెచ్‌ఎస్ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డీవో ఎన్.వి గిరి, తహసీల్దార్ హిమబిందు, డీపీఆర్వో తిరుమల, ఎంపీడీఓ రాణి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



