Monday, September 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఏథెన్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఫెస్టివల్‌కు భారీ స్పందన

ఏథెన్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఫెస్టివల్‌కు భారీ స్పందన

- Advertisement -

– వేలాదిమంది యువత, కార్మికులు హాజరు
ఏథెన్స్‌ :
గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ఫెస్టివల్‌కు భారీ స్పందన వచ్చింది. ఏథెన్స్‌లోని ట్రిట్సిస్‌ పార్కులో నాలుగు రోజులపాటు జరిగిన 51వ గ్రీస్‌ ఒడిగిటిస్‌ ఫెస్టివల్‌ ఆదివారంతో ముగిసింది. దీనిలో వేలాదిమంది యువకులు , కార్మికులు పాల్గొన్నారు. ఫెస్టివల్‌ ప్రధాన నినాదం ” చిన్న నిప్పు రవ్వ పెద్ద అగ్ని జ్వాలగా మారుతుంది ” యువతను ఆకట్టుకుంది. ఆ ప్రాంతమంతా సోషలిజంకు సంబంధించిన బ్యానర్లు, నినాదాలతో నిండిపోయింది. కచేరీ వేదికలు, చర్చలు, ప్రదర్శనలు, సంస్కృతిని రాజకీయాలతో, కళను పోరాటంతో కలిపాయి. ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్వాప్తంగా 35 దేశాలకు చెందిన యువ కమ్యూనిస్ట్‌, సామ్రాజ్యవాద వ్వతిరేక సంస్థలు హాజరయ్యాయి. ఉక్రెయిన్‌ , రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్‌, టర్కీ, సైప్రస్‌లకు చెందిన యువకులు తమకు హద్దులు తెలియదని చాటిచెప్పారు. క్యూబా, పాలస్తీనా రాయబారులు, అంతర్జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు, కమ్యూనిస్ట్‌ మేయర్లు, సాంస్కృతిక వ్యక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటి కార్యదర్శి థోడోరిస్‌ కొట్సాంటిస్‌ ఈ సందర్బంగా మాట్లాడుతూ పోరాటాల్లో యువత బలాన్ని నొక్కిచెప్పారు. ఈ ఫెస్టివల్‌ చరిత్రలో కొత్త పేజీలు రాస్తుందన్నారు. గ్రీస్‌ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక బిల్లును ఖండించారు. 13 గంటల బానిసత్వానికి కార్మికులు సిద్దంగాలేరని , 21వ శతాబ్దంలో రోజుకు 7 గంటలు, వారానికి 5 రోజులు, 35 గంటలు, జీతాల పెంపునకు పార్టీ పోరాడుతుందన్నారు. ఇజ్రాయిల్‌కు గ్రీక్‌ ప్రభుత్వ సహకారాన్ని ఖండిస్తూ, తూర్పు జెరూసలేంను రాజధానిగా కలిగిన 1967 సరిహద్దుల్లో పాలస్తీనా దేశాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఫెస్టివల్‌ వేదిక నుంచి అక్టోబర్‌ 1న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పరిశ్రమలను మూసేయాలని, ఆధునిక బానిసత్వానికి వ్యతిరేకంగా తమ గొంతులను వినిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -